జల్లికట్టు :సుప్రీం కోర్టులో తమిళనాడు ప్రభుత్వానికి చుక్కెదురు
జల్లికట్టుపై నిషేధం ఎత్తివేయాలని తమిళనాడు ప్రభుత్వం వేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టుతోసిపుచ్చింది. 2014 లో సుప్రీంకోర్టు ఈ క్రీడపై నిషేధం విధించింది.
చెన్నై :సంక్రాంతి పర్వదినం సందర్భంగా తమిళనాడులో నిర్వహించే జల్లికట్టుపై నిషేధాన్ని ఎత్తివేయాలని సుప్రీం కోర్టును ఆశ్రయించిన తమిళనాడు ప్రభుత్వానికి చుక్కెదురైంది. ఈ ఆటపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేయాలని కోరుతూ సుప్రీం కోర్టులో తమిళనాడు ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీం కోర్టు తోసిపుచ్చింది.
తమిళనాడు రాష్ట్ర రాజకీయాలన్నీ జల్లికట్టుపైనే తిరుగుతున్నాయి. జల్లి కట్టుపై నిషేధాన్ని ఎత్తివేయాలని అన్ని రాజకీయ పార్టీలు కోరుతున్నాయి.అయితే ఈ నిషేధం మీ వల్లే అంటే మీ వల్లే అని అధికార విపక్షాలు కూడ ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకొంటున్నారు.
సంక్రాంతి పర్వదినం సందర్భంగా తమిళనాడులోని గ్రామీణ ప్రాంతాల్లో జల్లికట్టును ఆడడం సంప్రదాయంగా వస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో జంతువులను హింసించే ఈ క్రిడను సుప్రీం కోర్టు నిషేధించింది.
సుప్రీం కోర్టు ఈ క్రీడపై నిషేధం విధించిన తర్వాత నిషేధం ఎత్తివేయాలనే డిమాండ్ కొనసాగుతోంది. దరిమిలా తమిళనాడు రాష్ట్రంలో అధికారంలో ఉన్న అధికార, విపక్షాలు నిషేధం ఎత్తివేయాలని రెండు వారాలుగా పోటాపోటీ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

జల్లి కట్టు అంటే ఏమిటీ?
తమిళనాడు రాష్ట్రంలో సంక్రాంతి తర్వాత వచ్చే కనుమ పండుగ రోజున జల్లికట్టును పెద్ద ఎత్తున నిర్వహించుకొంటారు. ఎద్దులను మచ్చిక చేసుకొని వాటిని లొంగదీసుకోవడమే జల్లికట్టుగా పిలుస్తారు. స్పెయిన్ దేశంలో నిర్వహించే బుల్ ఫైట్ తరహలోనే ఈ జల్లికట్టు ఉంటుంది. స్పెయిన్ లో నిర్వహించే బుల్ ఫైట్ లో మాత్రం జంతువులను చంపుతారు. కాని తమిళనాడులో నిర్వహించే జల్లికట్టులో ఎద్దులను మాత్రం మచ్చికచేసుకొని లొంగదీసుకొంటారు. ఆయుధాన్ని వినియోగించకుండానే ఈ జల్లికట్టులో యువకులు ఎద్దులను లొంగదీసుకొంటారు.జల్లికట్టును మంజు విరాట్టు అనే మరో పేరుతో కూడ పిలుస్తారు.ఎద్దులను మచ్చిక చేసుకొన్న యువకులకు వీరులుగా పిలుస్తారు.

జల్లికట్టు ఎలా వచ్చింది.
జల్లికట్టు ఆటకు పెద్ద చరిత్రే ఉందని చెబుతారు. తమిళనాడు రాష్ట్రంలోఈ చరిత్రప్రచారంలో ఉంది.తమిళనాడు రాష్ట్రంలోని నీలగిరి జిల్లాలోని కరిక్కియూర్ అనే గ్రామంలో 3500 సంవత్సరాల వయసు గల శిలాఫలకాలపై మనుషులు ఎద్దులను తరిమే దృశ్యాలు ఉన్నాయి. మరో వైపు మధురైకు 35 కిలోమీటర్ల దూరంలోని కళ్ళుత్తు మెట్టుపట్టి అనే ప్రాంతంలో కూడ లభ్యమైన రాతి ఫలకం మీద కూడ ఓ మనిషి ఎద్దును లొంగదీసుకొనే దృశ్యాలు చెక్కబడి ఉన్నాయి.ఈ చిత్రాల ఆధారంగా ఈ క్రీడకు సుమారు 1500 సంవత్సరాల చరిత్ర ఉందని చెబుతుంటారు.

వివాదాలకు కారణమైనక్రీడ
జల్లికట్టు క్రీడ ఎంత ప్రాధాన్యాతను సంతరించుకొందో , అంతే వివాదాలను కూడ మూటగట్టుకొంది. జంతువులను హింసిస్తున్నారనే కారణం ప్రధానంగా చెబుతుంటారు. జీవ కారుణ్యాన్ని దెబ్బతీసేవిధంగా ఈ క్రీడలను పెంచిపోషిస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో జల్లికట్టు క్రీడ వివాదాస్పదమైంది.ఈ క్రీడ స్థానికంగా రాజకీయ పార్టీల మద్య స్పర్థలకూ,ప్రతీకారాలకూ వేదికగా మారిందనే ఆరోపణలు వచ్చాయి. ఎద్దుల దాడిలో మరణించినట్టుగా చూపిస్తూ కొన్ని హత్యలు జరిగాయన్న వార్తలు కూడ వచ్చాయి.

జల్లికట్టుపై నిషేధం విధించిన సుప్రీంకోర్టు
జల్లికట్టుపై 2014 మే 7వ, తేదిన సుప్రీం కోర్టు నిషేధాన్ని విధించింది. కొందరు జంతు ప్రేమికులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు ఈ ఆటపై సుప్రీం కోర్టు నిషేధాన్ని విధించింది.అయితే ఈ ఆటపై విధించిన నిషేధాన్ని ఎత్తివేయాలని తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం కోరుతోంది.జయలలిత బతికున్న సమయంలో కూడ ఈ విషయమై కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాసింది. అయినా కేంద్రం నుండి సానుకూలమైన స్పందన రాలేదు.జయలలిత మరణించిన తర్వాత అన్నాడిఎంకె ప్రధాన కార్యదర్శిగా బాద్యతలు స్వీకరించిన శశికళ కేంద్రానికి లేఖ రాశారు. మరో వైపు డిఎంకె కూడ ఈ ఆటపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేయాలని కేంద్రాన్ని కోరింది.

సుప్రీం లో తమిళనాడు సర్కార్ కు చుక్కెదురు
జల్లి కట్టుపై నిషేధం ఎత్తివేయాలని కోరుతూ తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ ను సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. రెండు వారాలుగా ఈ విషయమై అధికార, విపక్ష పార్టీల మధ్య మాటల యుద్దం సాగుతోంది. పోటాపోటీగా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.మరో వైపు జల్లికట్టు తమిళనాడులో వంశపారంపర్యంగా జల్లికట్టు క్రీడను నిర్వహించుకొంటున్నారని చెబుతోంది. ఈ క్రీడ సాపీగా నిర్వహించుకొనేలా ఆర్డినెన్స్ ను తీసుకురావాలని ప్రధానమంత్రి నరేంద్రమోడీని కోరారు ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం. ఇదే అంశంపై అన్నాడిఎంకె ప్రధాన కార్యదర్శి శశికళ లేఖ రాశారు.












Click it and Unblock the Notifications