
Pegasus: దేశం కోసం అఫిడవిట్ ఇవ్వలేమన్న మోడీ సర్కార్: సుప్రీంకోర్టు తీర్పు రిజర్వ్
న్యూఢిల్లీ: రెండు నెలల కిందట దేశవ్యాప్తంగా సంచలనం రేపిన బిగ్ హ్యాకింగ్ స్కాండల్..పెగాసస్ స్పైవేర్. వేర్వేరు రంగాలకు చెందిన పలువురు బిగ్ షాట్స్ ఫోన్లు హ్యాక్ అయ్యాయి. బాధితుల జాబితాలో కొందరు కేంద్రమంత్రులు, ప్రతిపక్ష పార్టీల నేతలు, ప్రభుత్వ అధికారులు, వ్యాపార, పారిశ్రామికవేత్తలు ఉన్నారు. జర్నలిస్టుల ఫ్లోనూ వదల్లేదు హ్యాకర్లు. మొత్తంగా 300 మందికి పైగా బాధితులు ఉన్నారు. ఈ జాబితాలో దేశ అత్యున్నత న్యాయస్థానం సిట్టింగ్ న్యాయమూర్తి కూడా ఉన్నారు.
మార్కెట్లో టీటీడీ అగరబత్తులు: దేనితో తయారు చేస్తారో తెలుసా?: ప్రతి ఇంట్లో పరిమళాలు

తోసిపుచ్చిన ఎన్ఎస్ఓ
పెగాసస్ స్పైవేర్‌ను తాము ఇదివరకే విక్రయించామని, ప్రభుత్వ అవసరాల కోసం మాత్రమే పరిమితంగా దాన్ని వినియోగిస్తోన్నారని స్పష్టం చేసింది. ఫోన్ల హ్యాకింగ్ వార్తలను కేంద్ర ప్రభుత్వం కూడా తోసిపుచ్చింది. 300 మందికి పైగా ప్రముఖుల ఫోన్లు హ్యాక్ అయ్యాయనడానికి సరైన ఆధారాలు లేవని స్పష్టం చేసింది. కొన్నియాపిల్ ఫోన్లను ఫోరెన్సిక్‌కు పంపించగా.. అవి హ్యాక్‌కు గురైనట్లు బలమైన ఆధారాలు లభించాయని పేర్కొంది.

స్తంభించిన పార్లమెంట్
భీమా-కోరేగావ్ కేసులను వాదిస్తోన్న న్యాయవది, దళిత సామాజిక ఉద్యమ కార్యకర్తలు, ఢిల్లీ యూనివర్శిటీ లెక్చరర్లు, జర్నలిస్టులు.. ఇలా అన్ని ప్రధాన రంగాలకు చెందిన వ్యక్తుల ఫోన్లు హ్యాక్ అయ్యాయనడానికి ఫోరెన్సిక్ నివేదిక సాక్ష్యంగా నిలుస్తోందని తెలిపింది. ఇదే విషయంపై కాంగ్రెస్ సారథ్యంలో ప్రతిపక్ష పార్టీలు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలను పూర్తిస్థాయిలో స్తంభింపజేసిన విషయం తెలిసిందే. రాజ్యసభ, లోక్‌సభలను అట్టుడికింపజేశారు ప్రతిపక్ష పార్టీల సభ్యులు.

సుప్రీంకోర్టులో విచారణ..
పెగాసస్ హ్యాకింగ్ కుంభకోణాన్ని విచారించి తీరాలంటూ సమావేశాలను అడ్డుకున్నారు. దీని ఫలితంగా- పార్లమెంట్ ఉభయ సభలను మధ్యలోనే నిరవధికంగా వాయిదా వేయాల్సిన పరిస్థితి తలెత్తింది. దీనిపై- కొందరు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపించేలా ఆదేశాలను జారీ చేయాలంటూ పిటీషన్లను దాఖలు చేశారు. దీనిపై సుప్రీంకోర్టు కొద్దిసేపటి కిందటే విచారణను ముగించింది. తీర్పును రిజర్వ్ చేసింది.

సీజేఐ ఎన్వీ రమణ సారథ్యంలో..
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ హిమ కోహ్లీలతో కూడిన ముగ్గురు సభ్యుల ధర్మాసనం విచారణను ముగించింది. పిటీషనర్ల తరపున కపిల్ సిబల్, మీనాక్షి అరోరా, కొలిన్ గోన్జాల్వెస్, రాకేష్ ద్వివేది, శ్యామ్ దివాన్ వాదనలను వినిపించారు. ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తుషార్ మెహత కీలక వ్యాఖ్యలు చేశారు.

చట్టాల ఉల్లంఘన..
పెగాసస్ కుంభకోణం అనేది దేశ ప్రజల ప్రాథమిక హక్కులను హరించినట్లుగా భావిస్తున్నామని పిటీషనర్ల తరఫు న్యాయవాదులు వాదించారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ అండ్ మ్యానర్ ఆఫ్ పెర్ఫార్మింగ్ ఫంక్షన్స్ అండ్ డ్యూటీస్) రూల్స్- 2013 నిబంధనలను ఉల్లంఘించడమేనని అన్నారు.
Recommended Video

నిజాలు దాస్తోన్న కేంద్రం..
ఈ పెగాసస్ హ్యాకింగ్ కుంభకోణం విషయంలో కేంద్ర ప్రభుత్వం నిజాలను దాస్తోందని భావిస్తున్నామని న్యాయవాదులు వ్యాఖ్యానించారు. ఇదివరకు దేశాన్ని కుదిపేసిన హవాలా కుంభకోణం విషయంలో సుప్రీంకోర్టు- సిట్టింగ్ న్యాయమూర్తితో ఓ కమిటీని ఏర్పాటు చేసిన సందర్భాన్ని వారు గుర్తు చేశారు. పెగాసస్, ఇజ్రాయెల్‌కు చెందిన ఎన్ఎస్ఓ కంపెనీపై కేంద్ర ప్రభుత్వం వెంటనే చర్యలను తీసుకోవాలని అన్నారు. ఇప్పటిదాకా కనీసం ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయలేదని చెప్పారు.

అఫిడవిట్ దాఖలు చేయలేం..
పెగాసస్ కుంభకోణానికి సంబంధించినంత వరకు ఎలాంటి అఫిడవిట్లను కూడా కేంద్రం దాఖలు చేయలేదని స్పష్టం చేశారు. దేశ రక్షణకు సంబంధించిన అంశం కావడం వల్ల కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్లను దాఖలు చేయకూడదని నిర్ణయించుకున్నట్లు తుషార్ మెహతా స్పష్టం చేశారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ- భద్రతాపరమైన విషయాలను బహిర్గతం చేయాలని తాము కూడా కోరుకోవట్లేదని, ఒక కమిటీని ఏర్పాటు చేసి, దానికి ఆ వివరాలను అందించడానికి అవకాశం ఉందని పేర్కొంది.

తీర్పు రిజర్వ్..
ఈ మొత్తం పెగాసస్ వ్యవహారంపై తాము జోక్యం చేసుకుంటామని, ఓ నిర్ణయాన్ని తీసుకుంటామని ధర్మాసనం వ్యాఖ్యానించింది. అనంతరం తన తీర్పును రిజర్వ్ చేసింది. అతి కొద్దిరోజుల్లోనే తీర్పును వెలువడిస్తామని జస్టిస్ ఎన్వీ రమణ సారథ్యంలోని ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం స్పష్టం చేసింది. దేశ భద్రతకు సంబంధించిన విషయం కావడం వల్ల, దాన్ని బహిర్గతం చేయాలని తాము కూడా కోరుకోవట్లేదని వ్యాఖ్యానించింది. అయినప్పటికీ- ఈ పెగాసస్ సాఫ్ట్‌వేర్ బాధితుల్లో దేశ ప్రజలు, న్యాయవాదులు.. ఇలా చాలామంది ఉన్నారని, అసలు ఈ హ్యాక్ జరిగిందా? లేదా? చట్టాలు ఏం చెబుతున్నాయనే విషయం అందరూ తెలుసుకోవాల్సి ఉందని పేర్కొంది.