మహారాష్ట్ర ''వ్యవహారం''లో కేంద్రానికి సుప్రీంకోర్టు షాక్!!
సుప్రీంకోర్టులో మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి ఊరట లభించింది. తమ పార్టీనే అసలైన శివసేనగా గుర్తించాలంటూ ప్రస్తుత ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే వర్గం చేసిన వినతిపై ఎటువంటి నిర్ణయం తీసుకోవద్దని ఎన్నిక సంఘాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. శివసేన పార్టీ చీలిక తర్వాత ఆ పార్టీపై హక్కుల కోసం షిండే, ఉద్ధవ్ వర్గాల మధ్య నెలకొన్న పోరులో ఇది కీల పరిణామంగా మారింది. కేంద్రంలో అధికారంలో బీజేపీ ప్రభుత్వానికి షాక్ లాంటిదని రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.

సోమవారం కీలక నిర్ణయం తీసుకోనున్న సుప్రీంకోర్టు
మహారాష్ట్ర రాజకీయ సంక్షోభంపై దాఖలైన పలు పిటిషన్లు రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ చేయాలా? వద్దా? అనేది సోమవారం నిర్ణయం తీసుకుంటామని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం వెల్లడించింది. అసలైన శివసేన పార్టీ తమదేనని చెబుతూ షిండే వర్గం ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించింది. పార్టీ గుర్తు అయిన విల్లు-బాణం తమకే కేటాయించాలని కోరింది. దీన్ని ఉద్ధవ్ వర్గం వ్యతిరేకించి సుప్రీంకోర్టును ఆశ్రయించింది. పార్టీ వ్యవహారాలకు సంబంధించిన అంశాలు, ఎమ్మెల్యేల అనర్హత వంటి అంశాలపై సుప్రీంకోర్టులో పిటిషన్లు పెండింగ్‌లో ఉన్న తరుణంలో షిండే వినతిపై ఎటువంటి చర్యలు తీసుకోవద్దని ఉద్ధవ్ ఠాక్రే వర్గం కోరింది.

ఎటువంటి నిర్ణయం తీసుకోవద్దు
మహారాష్ట్ర పరిణామాలకు సంబంధించి ఇటీవలే ఎన్నికల సంఘం కీలకనిర్ణయం తీసుకుంది. విల్లు-బాణం గుర్తు తమదేనని రుజువు చేసే డాక్యుమెంట్లను ఆగస్టు ఎనిమిదోతేదీకల్లా తమకు సమర్పించాలని ఆదేశించింది. శివసేన శాసనసభా పక్షంతోపాటు పార్టీ సంస్థాగత విభాగం సభ్యుల మద్దతు లేఖలను కూడా ఇవ్వాలని రెండువర్గాలను ఎన్నికల సంఘం కోరింది. దీంతో ఉద్ధవ్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఎమ్మెల్యేల అనర్హత వ్యవహారం ఇంకా తేలలేదని, షిండే వర్గం అర్జీపై ఈసీ చర్యలు తీసుకోకుండా నివారించాలంటూ పిటిషన్ వేసింది. దీనిపై విచారణ జరిపిన ఎన్ వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం ఎటువంటి నిర్ణయం తీసుకోవద్దంటూ ఈసీకి స్పష్టం చేసింది.

సందర్భాన్ని బట్టి బీజేపీ వ్యూహం
మహారాష్ట్ర సంక్షోభంపై సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిని రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ చేసే విషయం సోమవారం తేలుతుంది. ఒకవేళ బదిలీ చేయకపోతే పార్టీ గుర్తును కేటాయించే విషయం కూడా వాయిదా పడుతుందని న్యాయనిపుణులు భావిస్తున్నారు. సోమవారం సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పును బట్టి బీజేపీ కేంద్ర నాయకత్వం తదుపరి అడుగులు ఉంటాయని, అప్పటి సందర్భాన్ని బట్టి వ్యూహాన్ని రచించే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications