కరోనా టైమ్‌లో మరో కుంభమేళా: కావడి యాత్రకు యోగి సర్కార్ పర్మిషన్: సుప్రీం సుమోటో
న్యూఢిల్లీ: ఉత్తరాది రాష్ట్రాల్లో ప్రతి సంవత్సరం అత్యంత వైభవంగా, ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే కావడి యాత్ర (Kanwar Yatra)కు ఉత్తర ప్రదేశ్‌లో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ అనుమతి ఇవ్వడం పట్ల విమర్శల జడివాన కురుస్తోంది. కరోనా వైరస్ మహమ్మారి ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతోన్న ఈ పరిస్థితుల్లో కావడి యాత్రకు అనుమతి ఇవ్వడం ఏ మాత్రం సరికాదనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి. తోటి రాష్ట్రం ఉత్తరాఖండ్ ఈ యాత్రను రద్దు చేసింది.
కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జీ కిషన్ రెడ్డి సైతం- ఈ యాత్రను రద్దు చేసినట్లు ప్రకటించారు. అయినప్పటికీ- వేలాదిమంది భక్తులు పాల్గొనే ఈ యాత్రకు ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీన్ని దేశ అత్యున్నత న్యాయస్థానం సుమోటోగా స్వీకరించింది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సారథ్యంలోని బీజేపీ ప్రభుత్వానికి నోటీసులను జారీ చేసింది. ఇదివరకు కరోనా వైరస్ సెకెండ్ వేవ్ ఆరంభ సమయంలో కుంభమేళాను నిర్వహించడం మహమ్మారి వ్యాప్తి చెందడానికి ప్రధాన కారణమైందంటూ విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో.. అదే తరహాలో కావడి యాత్ర నిర్వహించడానికి అనుమతి ఇవ్వడాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా పరిగణనలోకి తీసుకుంది. నోటీసులను జారీ చేసింది.

సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ రోహిన్టన్ ఎఫ్ నారీమన్ సారథ్యంలోని ధర్మాసనం.. ఈ నోటీసులను జారీ చేసింది. వివరణ ఇవ్వాలని ఆదేశించింది. దీనిపై తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. కరోనా వైరస్ థర్డ్‌వేవ్ ముంచుకొస్తోందంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సైతం స్వయంగా హెచ్చరికలు జారీ చేశారని, దేశ ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, కోవిడ్ ప్రొటోకాల్స్‌ను పాటించాలంటూ విజ్ఞప్తి చేశారని బెంచ్ గుర్తు చేసింది.
దీనికి సంబంధించిన ఓ కథనాన్ని తాను ఓ ఆంగ్ల దినపత్రిలో చదివానని అన్నారు. ఈ పరిస్థితుల్లోనూ కావడి యాత్రకు అనుమతి ఇవ్వడం సరికాదని అన్నారు. యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వానికి నోటీసులను జారీ చేశారు. తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసినట్లు చెప్పారు. రెండు వారాల పాటు సాగే ఈ యాత్రం ఈ ఏడాది 25వ తేదీన ఇది ప్రారంభం కావాల్సి ఉంది. భక్తులు కాలి నడకన హరిద్వార్ వంటి క్షేత్రాలకు చేరుకుని గంగానదిలో పుణ్యస్నానాలు ఆచరిస్తుంటారు. దీనివల్ల కరోనా వైరస్ మరింత వ్యాప్తి చెందుతుందనే కారణంతో ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఈ యాత్రను రద్దు చేసింది.












Click it and Unblock the Notifications