కేంద్రంతో అమీతుమీ- సీజేఐ బెంచ్‌కు కీలక పిటీషన్
న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సారథ్యంలో ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీకి కంటి మీద కునుకు లేకుండా చేస్తోన్న ఉదంతం- కేంద్ర ప్రభుత్వ ఆర్డినెన్స్. ఈ ఆర్డినెన్స్ వల్ల తమ ప్రాథమిక హక్కులను సైతం కేంద్ర ప్రభుత్వం లాక్కోంటోందనేది ఢిల్లీ ప్రభుత్వ వాదన. ఉద్యోగుల బదిలీలు సైతం తమ చేతుల్లో ఉండవని చెబుతోంది ఢిల్లీ సర్కార్.
ఢిల్లీ ప్రభుత్వ అధికారాలను మరింత కుదిస్తూ కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకుని రావడానికి ప్రయత్నాలు సాగిస్తోంది. ఈ ఆర్డినెన్స్ ద్వారా.. ఢిల్లీ- నేషనల్ క్యాపిటల్ రీజియన్ పరిధిలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానికి ఉండే అధికారాలను మరింత కోత పెట్టాలని కేంద్రం నిర్ణయించింది. పోలీస్, పబ్లిక్ ఆర్డర్, భూ కేటాయింపులు మినహా మిగిలిన అన్ని సేవలన్నింటిపైనా కేంద్రం నియంత్రణ ఉంటుంది.

పోలీస్ వ్యవస్థ ప్రస్తుతం ఢిల్లీ లెప్టినెంట్ గవర్నర్ ఆధీనంలో ఉంది. ఈ ఆర్డినెన్స్‌లో భాగంగా నేషనల్ క్యాపిటల్ సివిల్ సర్వీస్ అథారిటీని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది కేంద్ర ప్రభుత్వానికి. సాధారణ సేవలన్నింటినీ ఈ అథారిటీ పర్యవేక్షిస్తుంది. ఇది కేంద్రం ఆధీనంలో పని చేస్తుంది. ఈ ఆర్డినెన్స్‌ను అరవింద్ కేజ్రీవాల్ గట్టిగా వ్యతిరేకిస్తోన్నారు. దేశవ్యాప్తంగా ఉద్యమిస్తోన్నారు.
ప్రతిపక్ష పార్టీల మద్దతును కూడగట్టుకుంటోన్నారు. పార్లమెంట్‌లో దీన్ని తిప్పికొట్టేలా అన్ని పార్టీల సహాయ సహకారాలను తీసుకునే ప్రయత్నం చేస్తోన్నారు. ఇందులో భాగంగా ఆయన ఈ మధ్యే హైదరాబాద్‌లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తోనూ భేటీ అయ్యారు. అంతకంటే ముందు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే వంటి సీనియర్లను కలిశారు.
రాజకీయపరంగా తన ప్రయత్నాలు కొనసాగిస్తూనే చట్టపరంగా కూడా ఈ ఆర్డినెన్స్‌ను అడ్డుకోవడానికి దేశ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. దీన్ని సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. మంగళవారం విచారణ చేపట్టబోతోంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ సారథ్యంలోని ధర్మాసనం సమక్షానికి విచారణకు రానుంది ఈ పిటీషన్.












Click it and Unblock the Notifications