తాజ్ మహల్ vs తేజో మహాలయ: ఆ 22 గదుల్లో ఏముంది?: ముదురుతున్న వివాదం
లక్నో: చారిత్రాత్మక కట్టడం, ప్రపంచంలోని ఏడు వింతల్లో ఒకటైన తాజ్ మహల్.. తాజాగా వివాదాలకు కేంద్రబిందువైంది. తాజ్ మహల్‌లో 22 గదులను తెరవాలంటూ అలహాబాద్ హైకోర్టులో పిటీషన్ దాఖలైన తరువాత.. దీనికి సంబంధించిన సరికొత్త వాదనలు తెరమీదకి వచ్చాయి. తాజ్ మహల్‌లో మూసి ఉంచిన గదుల్లో ఉన్నట్లుగా భావిస్తోన్న విగ్రహాలు, అక్కడి చారిత్రాత్మక శాసనాలను సైతం వెలికి తీసేలా, వాటిపై పరిశోధనలు చేసేలా ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాను ఆదేశించాలనేది ఆ పిటిషన్ సారాంశం.

రాజకీయ రంగు..
ఉత్తర ప్రదేశ్ అయోధ్యకు చెందిన బీజేపీ నాయకుడు డాక్టర్ రజనీష్ సింగ్ ఈ పిటిషన్ దాఖలు చేశారు. బీజేపీ అయోధ్య జిల్లా స్థాయి నాయకుడు ఈ పిటీషన్ దాఖలు చేయడం వల్ల ఇది కాస్తా రాజకీయరంగు పులముకొంది. ఈ పిటీషన్ తన వ్యక్తిగతమేనని, పార్టీకి సంబంధం లేదని ఆయన చెబుతున్నారు. ఈ గదులను జాతీయ భద్రత దృష్ట్యానే మూసివేశారా అన్న సమాచారం కావాలని తాను 2019లో పురావస్తు శాఖను కోరినట్లు డాక్టర్ రజనీష్ సింగ్ చెప్పారు.

22 గదులను తెరిపించాలి..
తాజ్‌మహల్‌కు సంబంధించిన అన్ని విషయాలు వెలుగులోకి వచ్చేలా ఓ నిజ నిర్ధారణ కమిటీని వేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని రాజనీష్ సింగ్ తన పిటీషన్‌లో న్యాయస్థానానికి విజ్ఞప్తి చేశారు. 22 గదులను తెరిపించడం వల్ల వాస్తవం ఏమిటనేది బాహ్య ప్రపంచానికి తెలియజేయాలనేది తన ఉద్దేశమని పేర్కొన్నారు. తాజ్ మహల్ నిర్మితం కావడానికి ముందు అదొక శివాలయం అనే అభిప్రాయం ప్రజల్లో ఉందని గుర్తు చేశారు. ఈ పిటీషన్‌ను అలహాబాద్ హైకోర్టు విచారణకు స్వీకరించలేదు. దాన్ని తిరస్కరించింది.

ఆ స్థలం తమదే..
అదే సమయంలో బీజేపీకే చెందిన ఎంపీ దియా కుమారి సరికొత్త వాదనను వినిపించారు. తాజ్ మహల్‌ను నిర్మించిన స్థలం తమదేనని కోర్టుకెక్కారు. తాజ్ మహల్ కట్టించిన ప్రాంతం జైపూర్ పాలకుడు జైసింగ్‌కు చెందినదని, తాను ఆ రాజవంశీయురాలినేనని చెబుతున్నారు. దానికి అవసరమైన ఆధారాలు తమ ఉన్నాయని వాదిస్తున్నారు. తమ పూర్వీకులకు చెందిన ఆ భూమిని తాజ్‌మహల్ నిర్మాణానికి షాజహాన్ స్వాధీనం చేసుకున్నారని అంటున్నారు.

జ్యోతిర్లింగ క్షేత్రం..
రజనీష్ సింగ్ పిటీషన్ దాఖలు చేయడాన్ని దియా కుమారి సమర్థించారు. తాజ్ మహల్‌లో 22 గదులు తెరవాలని పిటిషన్ వేయడం సబబేనని అన్నారు. బాబ్రీ మసీదును నిర్మించిన స్థలంలో చరిత్రలో ఏం ఉండేదనేది తెలిసిన విషయమేనని, ఇక తాజ్ మహల్ కింద ఏముందనేది ప్రపంచానికి తెలియాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. తాజ్ మహల్ నిర్మాణానికి ముందు అక్కడ తేజో మహాలయ పేరుతో శివాలయం ఉండేదని, అది జ్యోతిర్లింగమనే అభిప్రాయం ప్రజల్లో ఉందని చెప్పారు.

షాజహాన్ ఆక్రమణలో..
తేజో మహాలయ ఆలయం గురించి చరిత్రలో కూడా ఉందని, ఆ విషయాన్ని పిటిషనర్ న్యాయస్థానానికి వివరించే ప్రయత్నం చేశారని దియా కుమారి పేర్కొన్నారు. 1212లో తేజో మహాలయ నిర్మతమైనట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయని చెప్పారు. ఈ భూమిని షాజహాన్ 1632లో ఆక్రమించుకున్నట్లు చరిత్రకారుడు పీఎన్ ఓక్ రాసిన తాజ్ మహల్: ఎ ట్రూ స్టోరీ అనే పుస్తకంలో పొందుపరిచారని చెప్పారు. దీనిపై ఉన్న వివాదాన్ని తెరదించాలంటే సమగ్ర విచారణ జరగాల్సి ఉందని అన్నారు.