బంగాళాఖాతంలో అల్పపీడనం: 9 నుంచి రెండు రాష్ట్రాలకు భారీ వర్షాలకు ఛాన్స్
బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. క్రమంగా ఇది అల్పపీడనంగా మారడానికి అనుకూల వాతావరణం నెలకొని ఉంది. ఫలితంగా ఈ నెల 9వ తేదీ నుంచి తమిళనాడు, కేరళకు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెన్నైలోని భారత వాతావరణ కేంద్రం రీజినల్ డైరెక్టరేట్ వెల్లడించింది. ప్రత్యేకించి- తమిళనాడు కోస్తా, దక్షిణ ప్రాంత జిల్లాలు, కేరళపై దీని ప్రభావం అధికంగా ఉంటుందని తెలిపింది.
ఈ నెల 5వ తేదీన ఈ ఆవర్తనం ఏర్పడింది. తమిళనాడు దక్షిణ ప్రాంతం, శ్రీలంక తీరం మీదుగా విస్తరించింది. క్రమంగా ఇది అల్పపీడనంగా మారనుంది. దీని ప్రభావంతో ఈ నెల 9వ తేదీ నుంచి తమిళనాడులోని మైలాడుతురై, తిరువారూర్, నాగపట్టణం, తంజావూరు, పుదుక్కోట్టై, రామనాథపురం జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయి. కొన్ని ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు పడే అవకాశాలు లేకపోలేదు. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యే స్థాయిలో వర్షపాతం నమోదు కావొచ్చు.

10వ తేదీన ఈ వర్షాలు మరింత విస్తరిస్తాయి. క్రమంగా విల్లుపురం, కడలూరు జిల్లాల్లో కూడా విస్తారంగా వర్షాలు కురుస్తాయని చెన్నైలోని రీజినల్ వాతావరణ కేంద్రం తెలిపింది. చెన్నైలో తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. వచ్చే రెండు రోజులు రాత్రి నుంచి తెల్లవారు జాము వరకు చలి తీవ్రత పెరుగుతుందని, తమిళనాడు, పుదుచ్చేరిలో తేలికపాటి పొగమంచు వ్యాపిస్తుందని పేర్కొంది. దృశ్యమానత తగ్గే అవకాశం ఉందని వివరించింది.
ఈ ఉపరితల ఆవర్తనం ప్రభావంతో కేరళలో వర్షాలు తిరిగి ప్రారంభమవుతాయని ఐఎండీ వెల్లడించింది. పథనంథిట్ట, ఇడుక్కి జిల్లాలకు ఏకంగా ఎల్లో అలర్ట్ సైతం జారీ అయింది. శుక్రవారం నాడు ఈ రెండు జిల్లాల్లో అక్కడక్కడ అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని సూచించింది. 24 గంటల వ్యవధిలో 64.5 నుండి 115.5 మిల్లీ మీటర్ల మధ్య వర్షపాతం నమోదైతే దానిని భారీ వర్షంగా పరిగణిస్తారు. ఎల్లో అలర్ట్ జారీ చేస్తారు.












Click it and Unblock the Notifications