తమిళనాడు బంద్: సినీరంగం మద్దతు
చెన్నై: కావేరీ జలాల విడుదలకు సంబంధించి బెంగళూరులో తమిళులపై దాడులు చేయడాన్ని ఖండిస్తూ శుక్రవారం తమిళనాడు రాష్ట్ర బంద్ కు పిలుపునిచ్చారు. తమిళనాడు రైతు సంక్షేమ సంఘాల సమైక్య, వ్యాపార సంఘాలు సంయుక్తంగా బంద్ కు పిలుపునిచ్చారు.
తమిళనాడు బంద్ కు ప్రతిపక్షాలైన డీఎంకే, ఎండీఎంకే, డీఎండీకే, వీసీకే, బీజేపీ, కాంగ్రెస్, ఐజేకే, వామపక్షాలు తదితర పార్టీలు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. డీఎండీకే, వీసీకేలు రాష్ట్ర వ్యాప్తంగా రైల్ రోక్ నిర్వహిస్తామని ప్రకటించాయి.
తమిళులపై దాడులు చేసిన కన్నడిగుల తీరును వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా సంపూర్ణ బంద్ పాటించాలని వ్యాపార సంఘాల సమైఖ్య అధ్యక్షుడు వెల్లయ్యన్, వర్తకుల సంఘాల సమాఖ్య అధ్యక్షుడు విక్రమరాజా ఓ ప్రకటనలో పిలుపునిచ్చారు.
శుక్రవారం బంద్ సందర్బంగా రాష్ట్రంలోని అన్ని గ్రామాల నుంచి నగరాల వరకు దాదాపు 21 లక్షల దుకాణాలు మూసివేయనున్నామని వారు తెలిపారు. దుకాణాల్లో పని చేసే కొన్ని లక్షల మంది కార్మికులకు సెలవు ప్రకటించామని చెప్పారు.
చెన్నై నగరంలోని కోయంబేడు కూరగాయల మార్కెట్ కూడా మూసివేస్తున్నామని చెప్పారు. ఈ కురగాయల మార్కెట్ లో 4,400 దుకాణాలు ఉన్నాయి. ప్రతి రోజు 20 వేల మంది కార్మికులు మార్కెట్ లో పని చేస్తారని, వీరందరూ బంద్ కు సాంఘీభావం ప్రకటించారని నిర్వహకులు తెలిపారు.
తమిళనాడు బంద్ కు పాల ఉత్పత్తిదారుల సంఘం, పాల ఏజెంట్ల సంఘం సంఘీభావం ప్రకటించారు. శుక్రవారం ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పాల విక్రయాల దుకాణాలు మూసివేస్తామని ప్రకటించారు.

తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా 60 శాతం విక్రయాలకు ఆటంకం కలుగుతుందని తెలిపారు. ఆవిన్ పాలను కార్డుదారులు తెల్లవారు జామున ఎప్పటిలాగే కొనుగోలు చేసుకోవచ్చని, ప్రయివేట్ పాల విక్రయాలు ఉండవని సంబంధిత వర్గాలు తెలిపాయి.
రాష్ట్ర వ్యాప్తంగా 4,700 పెట్రోల్ బంక్ లు మూసివేస్తున్నామని పెట్రో డిస్టిబ్యూటర్ల సంఘం అధ్యక్షుడు మురళి పేర్కొన్నారు. బంద్ సందర్బంగా గురువారం సాయంత్రం పెట్రోల్ బంకులు కిటకిటలాడాయి.
చెన్నై నగరంలో ఎప్పటిలాగే ఎంటీసీ బస్సులు నడుస్తాయని, ప్రభుత్వ బస్సులు ఎప్పటిలాగే నడుస్తాయని బంద్ నిర్వహకులు చెప్పారు. అయితే ఆటోలు, వ్యాన్లు, ట్యాక్సీలు సంచరించవని ఆ సంఘాల నిర్వహకులు తెలిపారు.
తమిళనాడు బంద్ కు తమిళ సినీరంగ ప్రముఖులు పూర్తి మద్దతు ప్రకటించాయి. తమిళ నటీనటుల సంఘం, నిర్మాతల మండలి, థియేటర్ల యజమానుల సంఘం సంయుక్తంగా ఓ ప్రకటన విడుదల చేశాయి.
శుక్రవారం ఎక్కడా చిత్రీకరణలు జరగవని, అందరూ బంద్ లో పాల్గొంటారని ఆ సంఘాల ప్రతినిధులు తెలిపారు, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా సినీ ప్రదర్శనలు కూడా నిలిపివేస్తున్నామని థియేటర్ యజమానులు తెలిపారు.












Click it and Unblock the Notifications