జయలలిత స్వయంగా ఆహారం తింటున్నారు ?
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యం కుదటపడిందని, అమ్మ కోలుకుంటున్నారని అన్నాడీఎంకే అధికార ప్రతినిధి, మాజీ మంత్రి పొన్నయన్ అన్నారు. అపోలో ఆసుపత్రిలో జయలలితను పరామర్శించిన ఆయన బయట మీడియాతో మాట్లాడారు.
అమ్మ స్వయంగా ఆహారం తీసుకుంటున్నారని, ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పారు. ఆమె ఆరోగ్యం కుదటపడిందని, ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారని అన్నారు. పూర్తిగా విశ్రాంతి తీసుకున్న తరువాత అమ్మ ఆసుపత్రి నుంచి బయటకు వచ్చి ప్రజాసేవ చేస్తారని పొన్నయన్ వివరించారు.
లండన్ వైద్యుడు డాక్టర్ రిచర్డ్, ఎయిమ్స్, సింగపూర్ వైద్య నిపుణులు జయలలిత ఆరోగ్య పరిస్థితిపై పూర్తిగా అధ్యయనం చేసి అమ్మను ఎప్పుడు డిశ్చార్జ్ చెయ్యాలి ? అనే నిర్ణయం తీసుకుంటారని అన్నాడీఎంకే అధికార ప్రతినిధి సీఆర్. సరస్వతి అన్నారు.

అయితే ఈ విషయంపై అపోలో ఆసుపత్రి వర్గాలు మాత్రం అధికారికంగా స్పందించలేదు. జయలలిత గత నెల 22వ తేదిన ఆసుపత్రిలో చేరారు. శుక్రవారానికి 30 రోజులు అయ్యింది. జయలలిత వ్యక్తిగత వైద్యుడు డాక్టర్ శివకుమార్ నేతృత్వంలో వైద్యపరిక్షలు చేస్తున్నారు.
జయలలిత చికిత్సలో లండన్, ఎయిమ్స్, సింగపూర్ వైద్యులు పాలుపంచుకున్నారు. ప్రస్తుతం అమ్మకు ఫిజియోథెరఫీ మాత్రమే కొనసాగుతుందని అన్నాడీఎంకే వర్గాలు అంటున్నాయి. లండన్ వైద్యుడు డాక్టర్ రిచర్డ్ మరో సారి చెన్నై రానున్నారు.
ఆయన వచ్చిన తరువాత జయలలితను ఎప్పుడు డిశ్చార్జ్ చెయ్యాలి ? అనే నిర్ణయం తీసుకుంటారని తెలిసింది. అయితే జయలలిత ఈనెల 27వ తేదిన ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అవుతారని అన్నాడీఎంకే నాయకులు అంటున్నారు.
అపోలో ఆసుప్రతి యాజమాన్యం ఈ విషయంపై అధికారికంగా ప్రకటించలేదు. అమ్మ అనారోగ్యానికి గురైందన్న ఆవేదనతో ఈనెల 13వ తేదిన కుంభకోణంలో అన్నాడీఎంకే కార్యకర్త మోహన్ కుమార్ (47) అనే వ్యక్తి కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. చికిత్స విఫలమై ఆయన మరణించాడు.












Click it and Unblock the Notifications