మూడు రాష్ట్రాల్లో ఎన్నికల పోలింగ్ ప్రారంభం
న్యూఢిల్లీ: తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిలో సోమవారం ఉదయం పోలింగ్ ప్రశాంతంగా ప్రారంభం అయ్యింది. ఈ రాష్ట్రాలతో పాటు తెలంగాణలోని పాలేరు ఉప ఎన్నిక ప్రారంభం అయ్యింది. తమిళనాడులో 232 స్థానాలకు, కేరళలో 140 స్థానాలకు, పుదుచ్చేరిలో 30 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి.
సోమవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ నిర్వహించడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. తమిళనాడులో ఎన్నికల పోలింగ్ ప్రారంభం అయిన కొంత సమయానికి సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజనీకాంత్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

తమిళనాడులో 232 స్థానాల్లో 3,776 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. 5,82,59,801 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మొత్తం 65 వేల పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. తంజావూరు, అరవకురిచి స్థానాల్లో పలువురు అభ్యర్థులు ఓటర్లకు నగదు పంపిణి చేశారని వెలుగు చూసింది.
ఈ ఆరోపణల కారణంతో ఆ రెండు నియోజక వర్గాల్లో ఎన్నికలను ఈ నెల 23వ తేదికి వాయిదా వేస్తూ ఈసీ ఆదేశాలు జారీ చేశారు. మే 25న ఆ రెండు నియోజక వర్గాల్లో కౌంటింగ్ జరగనుంది.

కేరళలో 140 స్థానాలకు 1,203 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. కేరళలో 2,61,06,422 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు, మొత్తం 109 మంది మహిళా అభ్యర్థులు బరిలో నిలిచారు. పుదుచ్చేరిలో 30 స్థానాల్లో 344 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.
9,41,935 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. తమిళనాడు, కేరళ,పుదుచ్చేరితో పాటు ఇతర రాష్ట్రాల పోలీసులు, సాయుధ బలగాలు ఎన్నికల విధులలో ఉన్నారు. ముఖ్యంగా తమిళనాడులో ఎప్పుడూ లేని విధంగా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.












Click it and Unblock the Notifications