ప్రభుత్వ ఉద్యోగులు ఇకపై ఆ భాషలోనే సంతకం- రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం
2026లో తమిళనాడులో శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో బీజేపీ, డీఎంకే మధ్య చెలరేగిన భాష వివాదం తారా స్థాయికి చేరింది. ఉపాధి అవకాశాల పెంపుకోసం మేం కృషి చేస్తున్నామని కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఓవైపు చెబుతుండగా.. మరోవైపు హిందీని బలవంతంగా రుద్దే ప్రయత్నం చేస్తున్నారని తమిళనాడు ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో తమిళనాడు సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.
తమిళ భాషే ప్రధాన లక్ష్యంగా తమిళనాడులోని స్టాలిన్ సర్కార్ ఎన్నికల బరిలోకి దిగనుంది. ఈ నేపథ్యంలోనే పలు సంచలనాత్మక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇప్పటికే వాణిజ్య సంస్థలు, రెస్టారెంట్లు, షాపింగ్ మాల్స్ లో బోర్డులు తమిళ భాషలోనే ఉండాలని.. లేదంటే జరిమానా విధిస్తామని కీలక ఆదేశాలు జారీ చేసింది. తాజాగా మరో అడుగు ముందుకేసింది. రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు తప్పనిసరిగా తమిళంలోనే సంతకం పెట్టాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు జీవో జారీ చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది స్టాలిన్ సర్కార్.
ప్రభుత్వ ఉత్తర్వులను కూడా తమిళంలోనే ప్రచురించాలని ఆదేశాలు ఇచ్చింది. ఈ మేరకు బుధవారం నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. అంతేకాక సర్క్యూలర్ కూడా తమిళంలో ఉండాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఇంగ్లీష్ భాషలో వచ్చిన సర్క్యూలర్స్ ను తమిళంలోకి తర్జుమా చేయాలని ఈ మేరకు పేర్కొంది.
ఇక ఇటీవల తమిళనాడు పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్రమోదీ రామేశ్వరంలోని పంబన్ బ్రిడ్జిని ప్రారంభించారు. ఆ తర్వాత నిర్వహించిన సమావేశంలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. తమిళనాడు ప్రభుత్వంపైనా తీవ్ర విమర్శలు చేశారు. డీఎంకే నేతలు ఎవరూ కూడా తనకు రాసే లేఖల్లో తమిళంలో సంతకాలు చేయరని ఎద్దేవా చేశారు. తమిళ భాష పట్ల మీకు గౌరవం ఉంటే తమిళంలో సంతకం చేయడం నేర్చుకోవాలని విమర్శించారు. ఈ క్రమంలో తమిళనాడు ప్రభుత్వం ఈ ఉత్తర్వులు జారీ చేయడం సర్వత్రా ఉత్కంఠ రేపుతోంది.

తమిళనాడులో హిందీ భాషను రుద్దడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని స్టాలిన్ సర్కార్ విమర్శలు చేస్తోంది. దీంతో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఈ భాష వివాదం కీలకంగా మారనున్నట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.












Click it and Unblock the Notifications