శశికళ VS స్టాలిన్: వార్ వన్ సైడ్, పాపం చిన్నమ్మ !
చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో ఇప్పుడు కొత్త శకం మొదలైయ్యింది. అనారోగ్యంతో జయలలిత మరణించడంతో అన్నాడీఎంకే పార్టీ పగ్గాలు ఇప్పుడు శశికళ చేతికి వచ్చాయి. తీవ్ర అనారోగ్యానికి గురైన కరుణానిధి తన కుమారుడు స్టాలిన్ కు డీఎంకే పార్టీ పగ్గాలు అప్పగించారు.
అన్నాడీఎంకే పార్టీ పగ్గాలు 1989లో జయలలిత చేతికి వచ్చాయి. జయ మరణించిన తరువాత శశికళ అన్నాడీఎంకే పార్టీ చీఫ్ అయ్యారు. 48 ఏళ్ల తరువాత డీఎంకే పార్టీ పగ్గాలు కరుణానిధి చేతి నుంచి ఆయన కుమారుడు, పార్టీ కోశాధికారి ఎంకే. స్టాలిన్ చేతికి వచ్చాయి.
తమిళనాడులో అతి పెద్ద పార్టీలైన అన్నాడీఎంకే, డీఎంకేలకు కేవలం వారం రోజుల వ్యవదిలో కొత్త సారథులు వచ్చారు. ఎంకే. స్టాలిన్ కు పార్టీ పరంగా మంచిపట్టు ఉంది. ఆయనకు రాజకీయ అనుభవం ఉంది.
2016లో జరిగిన శాసన సభ ఎన్నికల ప్రచారానికి కరుణానిధి పూర్తిగా దూరం అయ్యారు. ఆ సమయంలో స్టాలిన్ జయలలితతో పోటీ పడి రాష్ట్రం మొత్తం తిరిగి తమ పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవడానికి శక్తి వంచన లేకుండా పని చేశారు.

చివరికి అధికారం కోల్పుయిన డీఎంకే పార్టీ తమిళనాడులో ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయ్యింది. శాసన సభ్యుడు అయిన స్టాలిన్ ఇప్పుడు తమిళనాడు శాసన సభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు.
అయితే శశికళకు ఇప్పటి వరకు ప్రత్యక్షంగా ఎలాంటి రాజకీయ అనుభవం లేదు. మూడు సార్లు ముఖ్యమంత్రి అయిన జయలలిత వెనుక ఉన్న శశికళ అమ్మ దగ్గర రాజకీయాల గురించి తెలుసుకున్నారని అందరికి తెలిసిందే.
ఇప్పుడు తమిళనాడులో ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన డీఎంకే నుంచి స్టాలిన్ చేసే విమర్శలకు అన్నాడీఎంకే నాయకులు దీటుగా సమాధానం ఇస్తారా ? అంటే ఏమో అంటున్నారు ఆ పార్టీ కార్యకర్తలు.
స్టాలిన్ మాటల యుద్దానికి దిగితే శశికళ సైతం గట్టిగా సమాధానం ఇవ్వకపోతే పార్టీ పరిస్థితి ఏమౌతుందో అని కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. ఏది ఎమైనా ఇక మీదట తమిళనాడులో రాజకీయాల రసవత్తరంగా మారుతాయని ఇరు పార్టీల కార్యకర్తలు అంటున్నారు.












Click it and Unblock the Notifications