స్కూళ్లు, కాలేజీలు బంద్.. ఎందుకంటే..?
ఈశాన్య రుతుపవనాలు తమిళనాడుపై తమ ప్రతాపాన్ని తీవ్రతరం చేస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడుతుండటంతో, రాష్ట్రంలోని తీరప్రాంత జిల్లాలకు భారీ వర్ష సూచనల నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. చెన్నైలోని అనేక జిల్లాల్లో కుండపోత వర్షాల హెచ్చరికల దృష్ట్యా, అక్టోబర్ 22 (మంగళవారం) నాడు పాఠశాలలు , కళాశాలలకు సెలవు ప్రకటిస్తూ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. పుదుచ్చేరి , కారైకల్‌లో కూడా విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు.
చెన్నైలోని ప్రాంతీయ వాతావరణ కేంద్రం అందించిన వివరాల ప్రకారం, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం చెన్నైకి సుమారు 400 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది. రేపు (అక్టోబర్ 23) మధ్యాహ్నానికి ఇది మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉంది. ఈ ప్రభావం ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి , దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాలపై అధికంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.

వర్షాల తీవ్రతను బట్టి వాతావరణ శాఖ వివిధ జిల్లాలకు హెచ్చరికలు జారీ చేసింది. చెంగల్పట్టు, విల్లుపురం, కడలూరు , మైలాడుతురై, తిరువళ్లూరు, కాంచీపురం, తిరువణ్ణామలై, కళ్లకురిచ్చి, అరియలూర్, పెరంబలూర్, నాగపట్నం, తంజావూరు జిల్లాలకు హై అలర్ట్ ప్రకటించారు.
పరిస్థితి తీవ్రత దృష్ట్యా, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ , డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ పరిస్థితులను నిశితంగా సమీక్షించారు. వర్షాల కారణంగా తలెత్తే సమస్యలను పరిష్కరించడానికి, సహాయక చర్యలను వేగవంతం చేయడానికి తీసుకుంటున్న చర్యలపై ముఖ్యమంత్రి అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు.
తీరప్రాంత నివాసితులు , మత్స్యకారులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని, అధికారులు జారీ చేసే భద్రతా సలహాలను తప్పక పాటించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రజలు అనవసర ప్రయాణాలు మానుకోవాలని సూచించబడింది.












Click it and Unblock the Notifications