పన్నీర్ సెల్వం, పళనిసామి వర్గాలు కలిసిపోవాలి: బాంబు పేల్చిన బీజేపీ !
అన్నాడీఎంకే పార్టీలోని పన్నీర్ సెల్వం వర్గం, ఎడప్పాడి పళనిసామి వర్గం కలిసిపోవాలని బీజేపీ సీనియర్ నేత బాంబుపేల్చారు. వారిద్దరూ కలిసిపోతే చూడాలని ఉందని అన్నారు.
చెన్నై: తమిళనాడు రాజకీయాలను తెరవెనుక నుంచి బీజేపీ నడుపుతుందా అంటే ఔను అనే సమాదానం చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు. జయలలిత మరణంతో తమిళనాడులో తమ పార్టీ పుంజుకోవడానికి బీజేపీ నేతలు పావులుకదుపుతున్నారని వార్తలు వినిస్తున్న విషయం తెలిసిందే.
అన్నాడీఎంకే పార్టీ రెండు వర్గాలుగా చీలిపోవడంతో బీజేపీ నాయకులు తమిళనాడు మీద ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. పన్నీర్ సెల్వం సీఎంగా ఉన్న సమయంలో తమిళనాడులో మొదలైన ఐటీ దాడులు ఇప్పటికీ కొనసాగుతున్నాయి.

పన్నీర్ సెల్వం ఉన్నప్పుడే
తమిళనాడు ముఖ్యమంత్రిగా పన్నీర్ సెల్వం ఉన్న సమయంలో ఇసుక వ్యాపారి శేఖర్ రెడ్డి, ఆయన అనుచరుల మీద ఐటీ దాడులు జరిగాయి. అదే సమయంలో అప్పటి తమిళనాడు ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ రామ్మోహన్ రావు ఇంటి మీద ఐటీ దాడులు జరిగాయి.

పన్నీర్ సెల్వం లేకున్నా
సీఎం కావాలని ఆశపడిన శశికళ పన్నీర్ సెల్వంను ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించారు. అయితే ఆమె జైలుకు వెళ్లడంతో ఆమె అనుచరుడు ఎడప్పాడి పళనిసామి సీఎం అయ్యారు. అప్పటి నుంచి ఆదాయ పన్ను శాఖ అధికారులు తమిళనాడు మీద ప్రత్యేక శ్రద్ద చూపిస్తున్నారు.

ఆర్ కే నగర్ ఉప ఎన్నిక దెబ్బతో
ఆర్ కే నగర్ ఉప ఎన్నికల సందర్బంగా విచ్చలవిడిగా స్థానిక ఓటర్లకు డబ్బులు పంచిపెడుతున్నారని ఆదాయపన్ను శాఖ అధికారులు గుర్తించారు. తరువాత ఐటీ శాఖ అధికారులు తమిళనాడు మీద డేగ కన్ను వేశారు. సమయం కోసం వేచి చూసి దాడులు మొదలు పెట్టారు.

మంత్రి టార్గెట్
తమిళనాడు ఆరోగ్య శాఖా మంత్రి విజయభాస్కర్ ఇంటి మీద మొదలైన ఐటీ శాఖ దాడులు సినీనటుడు శరత్ కుమార్, ఆయన భార్య రాధిక కార్యాలయం, ఎంజీఆర్ వైద్య వర్శిటీ ఉపకులపతి గీతాలక్ష్మి తదితరుల మీద ఐటీ శాఖ దాడులు చేసింది.

పన్నీర్, పళనిసామి కలిసిపోవాలి
తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి, మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం కలిసిపోవాలని ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ శనివారం సంచలన వ్యాఖ్యలు చేశారు. వారిద్దరూ ఒక్కటి అయితే చూడాలని ఉందని ఆమె మీడియాతో అన్నారు.

అన్నాడీఎంకేలో చీలిక వద్దు
అన్నాడీఎంకే చీలిపోవడం చాల మందికి ఇష్టం లేదని ఆమె అంటున్నారు. తమిళనాడు ప్రజలకు మంచి జరగాలంటే ప్రభుత్వంలో ఎలాంటి సమస్యలు ఉండకూడదని, ప్రజల కోసం పన్నీర్, పళనిసామి కలిసిపోతే మంచిదని ఆమె అంటున్నారు.

డ్రామా కాదు కాద ?
పన్నీర్ సెల్వం, పళనిసామి వర్గం కలిసిపోవాలని తమిళనాడు బీజేపీ నాయకులు అంటున్నారు. ఈ రెండు వర్గాలు కలిసిపోతే బీజేపీకి ఏం లాభం అంటున్నారు అన్నాడీఎంకే నాయకులు. మొత్తం మీద అన్నాడీఎంకే పార్టీలోని రెండు వర్గాలు కలిసిపోవాలని బీజేపీ నాయకురాలు తమిళిసై సౌందరరాజన్ బాంబు పేల్చారు.












Click it and Unblock the Notifications