దారుణం: ఏడేళ్ల చిన్నారిపై రాత్రంతా.. ఆపై హత్య.. పాశవిక ఘటనపై భగ్గుమన్న జనం..
కరోనా సెలవులు కావడంతో ప్రతిరోజూ ఇంటి బయటే స్నేహితులతో కలిసి ఆటలాడుకునేదా చిన్నారి. పిల్లలందరూ కలిసే ఉంటారు కాబట్టి ఇంట్లోవాళ్లూ పెద్దగా పట్టించుకోలేదు. ఇంటి ముందే ఆడుకుంటోన్నఆ పాప మంగళవారం సాయంత్రం నుంచి కనిపించకుండా పోయింది. అప్పుడుగానీ తేరుకున్న తల్లిదండ్రులు.. పాప కోసం ఊరంతా వెతికారు. చివరికి అదే రోజు రాత్రి పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశారు. మరుసటిరోజు ఉదయం పోలీసులు దర్యాప్తు మొదలు పెడదామనుకునేలోపే దారుణం జరిగిపోయింది...

పుదుకొట్టై జిల్లా ఎంబల్..
తమిళనాడులోని పుదుకొట్టై జిల్లా అరంతంగి తాలూకా ఎంబల్ గ్రామంలో ఏడేళ్ల చిన్నారి దారుణ హత్యకు గురైంది. చంపడానికి ముందు ఆమెపై పాశవికరీతిలో అత్యాచారం కూడా జరిగినట్లు నిర్ధారణ అయింది. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేసుకున్న పోలీసులు కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. ఇటు సోషల్ మీడియాలోనూ చిన్నారి హత్యాచారానికి సంబంధించిన సమాచారం విపరీతంగా షేర్ అవుతోంది..

ఎండిపోయిన చెరువులో..
ఎంబల్ గ్రామానికి చెందిన నగూరన్-సెల్వీ దంపతులు తమ ఏడేళ్ల పాప కనిపించడంలేదంటూ మంగళవారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. బుధవారం ఉదయం ఊరుఊరంతా షాక్ కు గురయ్యింది. నగూరన్ ఇంటికి దగ్గర్లో ఎండిపోయిన చెరువులో తుప్పల మధ్య రక్తపుమడుగులో విగతజీవిగా పడి ఉన్న పాపను గుర్తించారు. ఆలోపే పోలీసులు కూడా చేరుకుని, అంబులెన్స్ లో చిన్నారి మృతదేహాన్ని పుదుకొట్టై జిల్లా కేంద్రంలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోస్ట్ మార్టం నిర్వహించిన డాక్టర్లు.. హత్య చేయడానికి ముందు పాపపై అత్యాచారం కూడా జరిగినట్లు నిర్ధారించారు.

పక్కింటి యువకుడి పనేనా?
ఎంబల్ గ్రామంలో చిన్నారి హత్యాచారానికి సంబంధించిన కేసులో దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు.. అదే గ్రామానికి చెందిన 27 ఏళ్ల యువకుణ్ని అదుపులోకి తీసుకున్నారు. అతనుండేది బాధిత బాలిక ఇంటికి దగ్గర్లోనే కావడం గమనార్హం. సాయంత్రం పాపను ఎత్తుకెళ్లిన నిందితులు.. రాత్రాంతా ఆమెను హింసించి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే, ఘాతుకానికి పాల్పడింది ఒక్కడేనా, ఇంకా ఎవరైనా సహకరించారా అనే వివరాలు తెలియాల్సి ఉందని, విచారణలో అతను ఎంతకీ నోరు విప్పకపోవడంతో నిందితుడు ఎవరేది ఇప్పుడే చెప్పలేమని పోలీసులు అంటున్నారు. పోస్ట్ మార్టం సమయంలో డాక్టర్లు కూడా నిర్ఘాంతపోయేలా చిన్నారిపై దాడి జరిగినట్లు వెల్లడైంది.

ఉధృతంగా ఉద్యమం..
పుదుకొట్టై జిల్లా ఎంబల్ గ్రామంలో చోటుచేసుకున్న చిన్నారి హత్యాచార ఘటనపై తమిళనాడు వ్యాప్తంగా ఆగ్రహావేశాలు వెల్లువెత్తాయి. పాప పేరుతో ఉద్యమాన్ని ప్రారంభించిన నెటిజన్లు.. నిందితులను వెంటనే ఉరితీయాలని డిమాండ్ చేస్తున్నారు. పోలీసులుగానీ ఆ పాపకు న్యాయం చేయకుంటే, తామే చట్టాన్ని చేతిలోకి తీసుకుంటామని నెటిజన్లలో కొందరు హెచ్చరించారు. నెల రోజుల వ్యవధిలోనే పుదుకొట్టై జిల్లాలో వెలుగు చూసిన దారుణాల్లో ఇది రెండోది.
Recommended Video

గంధర్వకోట ఘటన మరువకముందే..
ఇదే పుదుకొట్టై జిల్లాలో గంధర్వకోటకు చెందిన పన్నీర్ సెల్వం అనే వ్యక్తి.. మాంత్రికుడి మాటలు నమ్మి కన్న కూతురినే నరబలి ఇచ్చిన సంఘటన జూన్ మొదటి వారంలో చోటుచేసుకుంది. 13 ఏళ్ల కూతురిని బలిస్తే కొడుకు పుడతాడని, కోట్ల ఆస్తి కలిసొస్తుందని నమ్మి పైశాచికానికి పాల్పడిన ఆ తండ్రి ప్రస్తుతం కటకటాల్లో ఉన్నాడు. ఆ ఘటన మర్చిపోకముందే ఇదే జిల్లాలోని ఎంబల్ గ్రామంలో ఏడేళ్ల చిన్నారిపై హత్యాచారం జరిగింది.












Click it and Unblock the Notifications