శశికళకు సినిమా చూపిస్తున్న పన్నీర్ సెల్వం: ఎవరు మీరు ?
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం తన రూటు మార్చుకుని అన్ని పనులు చకచక చేసుకుంటు వెలుతున్నారు. ఎవ్వరికీ భయపడనవసరం లేదని పన్నీర్ సెల్వం వర్గీయులు ధైర్యం చెప్పడంతో ఆయన కేవలం ప్రజల మీద, పరిపాలన మీద దృష్టి కేంద్రీకరించారు.
ఈనెల 19వ తేదీన తమిళనాడు సీఎం పన్నీర్ సెల్వం ఢిల్లీ వెళ్లి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు. తమిళనాడు రాష్ట్ర అభివృద్ది గురించి, వర్దా తాండవం గురించి సుదీర్ఘంగా చర్చించారు.
అదే సమయంలో తమిళనాడు రాజకీయాల గురించి చర్చించారు. పన్నీర్ సెల్వం ఢిల్లీలో ఉన్న సమయంలో కొందరు సినియర్ మంత్రులు, శశికళ వర్గీయులు ఓ కొత్తనినాదం తెరమీదకు తీసుకు వచ్చారు.
అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా ఎవరు ఉంటారో వారే సీఎంగా ఉండాలని, అది పార్టీ అనవాయితీ అని మీడియాకు చెప్పారు. పరోక్షంగా తాము శశికళకే మద్దతు ఇస్తామని, పన్నీర్ సెల్వంకు కాదని అన్నాడీఎంకే నాయకులు చెప్పకనే చెప్పారు.
విషయం తెలుసుకున్న పన్నీర్ సెల్వం అదే రోజు రాత్రి ఢిల్లీ నుంచి చెన్నై బయలుదేరి వచ్చేశారు. తరువాత ఆయన పోయెస్ గార్డెన్ వైపు కన్నెత్తి చూడలేదు. ఒక్క రోజు తేడాలో ఏమీ జరిగిందో ఏమో కాని బుధవారం వేకువ జామున ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామ్మోహన్ రావు ఇంటి మీద ఐటీ శాఖదాడులు జరిగాయి.

బుధవారం మద్యాహ్నం ఐటీ అధికారులు సెక్రటేరియట్ చేరుకుని రామ్మోహన్ రావు కార్యాలయంలో సోదాలు చేశారు. అప్పటి వరకు సెక్రటేరియట్ లో ఉన్న పన్నీర్ సెల్వం అక్కడి నుంచి వెళ్లిపోయారు.
బుధ, గురువారం రెండు రోజులు రామ్మోహన్ రావు ఇంటిలో, ఆయన కుటుంబ సభ్యులు, బంధువుల నివాసాల్లో ఐటీ సోదాలు జరిగాయి. గురువారం రామ్మోహన్ రావు పదవికి ఉద్వాసన పలికిన పన్నీర్ సెల్వం సీనియర్ ఐఏఎస్ అధికారి గిరిజా వైద్యనాథన్ ను ఆపదవిలో నియమించారు.
శుక్రవారం గిరిజా వైద్యనాథన్ అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. ఇంత జరిగినా పన్నీర్ సెల్వం పోయెస్ గార్డెన్ వైపు కన్నెత్తి చూడకపోవడంతో అన్నాడీఎంకే నాయకులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

ఢిల్లీ బయలుదేరక ముందు రోజు వరకూ ప్రతి రోజూ పన్నీర్ సెల్వం పోయెస్ గార్డెన్ వెళ్లి శశికళను కలిసి వచ్చేశారు. అయితే ఆయన ఢిల్లీ వెళ్లి వచ్చిన తరువాత నాలుగు రోజులు అయినా చెన్నైలో ఉంటూ పోయెస్ గార్డెన్ వెళ్లకపోవడంతో అన్నాడీఎంకే నాయకులలో చర్చ మొదలైయ్యింది.
శుక్రవారం అన్నాడీఎంకే నాయకులు డిసెంబర్ 29వ తేదిన పార్టీ కార్యవర్గ సమావేశం ఉంటుందని చెప్పారు. అయితే ఈ విషయంపై కూడా పన్నీర్ సెల్వం కాని, ఆయన వర్గీయులు కానీ ఒక్క మాటా మాట్లాడలేదు.
శశికళ, పన్నీర్ సెల్వం మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయా ? ఎందుకు పన్నీర్ సెల్వం చిన్నమ్మను కలవడం లేదు ? అసలు ఏం జరిగింది ? అని అన్నాడీఎంకే కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. ఇప్పుడు ఈ విషయం తమిళనాడులో హాట్ టాఫిక్ అయ్యింది.












Click it and Unblock the Notifications