DoorDarshan : దూరదర్శన్ లుక్ మారుతోంది- ఇక దేశభక్తి సినిమాలు, సీరియళ్లూ- పంద్రాగస్టు స్పెషల్
కాలం మారుతోంది. దాంతో పాటే అన్నీ మారక తప్పడం లేదు. మారకపోతే అంతరించి పోయే పరిస్దితి తప్పేలా లేదు. దీంతో ప్రతీదీ కాలనుగుణంగా మారాల్సిన పరిస్దితి. దూరదర్శన్ ఛానెళ్ల స్థూల వీక్షకుల సంఖ్య 2019లో 760.4 మిలియన్లు, 2020లో 747 మిలియన్లు, 2021లో 684.9 మిలియన్లుగా నమోదైనట్లు కేంద్రం తాజాగా వెల్లడించింది. దీనికి ఏమార్పూ లేకుండా దశాబ్దాలుగా అదే కంటెంట్ ప్రసారం చేస్తుండటమే. దీంతో మన దేశంలో దశాబ్దాలుగా సేవలు అందిస్తూ కూడా ఎదుగూ బొదుగూ లేకుండా ఉండిపోయిన దూరదర్శన్ లుక్ ను సమూలంగా మార్చేందుకు ప్రసారభారతి సిద్దమవుతోంది. ఈ స్వాతంత్ర దినోత్సవం నుంచి దూరదర్శన్ లో భారీ మార్పులు చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది.
ఈ స్వాతంత్ర్య దినోత్సవం నుండి తన టెలివిజన్ ఛానెల్‌లను సమూలంగా ప్రక్షాలన చేసేందుకు ప్రసారభారతి సిద్ధమవుతోంది. దూరదర్శన్ లోగోలో దాని అసలైన, స్పష్టమైన రంగుల కలయికను పునరుద్ధరించడం ద్వారా దాని అసలు ఫ్లేవర్ తీసుకురావాలని ప్రసార భారతి భావిస్తోంది. అలాగే మారుతున్న కాలం, అభిరుచులకు అనుగుణంగా కొంగొత్త ప్రోగ్రామ్ లను ప్రేక్షకులకు అందుబాటులోకి తెచ్చేందుకు సిద్ధమైంది.

ఈ ఏడాది స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ముందు ప్రసార భారతి సుభాష్ ఘాయ్ దర్శకత్వం వహించిన యాక్షన్ థ్రిల్లర్ "కర్మ" లో సుప్రసిద్ధ దేశభక్తి గీతం "హమ్ జియేంగే ఔర్ మరేంగే ఏ వతన్ తేరే లియే" సంస్కృత వెర్షన్‌ను ప్రారంభించనుంది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా అక్షయ్ కుమార్ నటించిన కేసరి, సన్నీ డియోల్ గదర్ వంటి చిత్రాలను అందించేందుకు ప్రసార భారతి ఏర్పాట్లు చేస్తోంది.
వీక్షకుల సంఖ్య నానాటికీ తగ్గిపోతున్న నేపథ్యంలో దేశభక్తి సందేశంతో పాటు కాలనుగుణంగా కంటెంట్ ను మార్చడం ద్వారా తిరిగి పాత, కొత్త ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు దూరదర్శన్ సిద్దమవుతోంది. భారత స్వాతంత్ర్య పోరాటంలో జనానికి అంతగా తెలియని కథలను వివరించేందుకు కూడా ప్రయత్నిస్తోంది.దూరదర్శన్ 75 ఎపిసోడ్‌ల మెగా సీరియల్ - 'స్వరాజ్ - భారత్ కే స్వతంత్రత సంగ్రామ్ కి సమగ్ర గాథ'ను ఆగస్టు 14 నుండి హిందీలో డీడీ నేషనల్ ఛానెల్లో చేస్తుంది. దూరదర్శన్ ప్రాంతీయ నెట్‌వర్క్‌లో ప్రసారం చేయడానికి ఈ సీరియల్ ను 9 ప్రాంతీయ భాషలతో పాటు ఇంగ్లీష్ లో కూడా డబ్ చేయబోతున్నారు.
కాంటిలో పిక్చర్స్ నిర్మించిన ఈ సీరియల్ ప్రతి ఆదివారం రాత్రి 9.00 నుండి 10.00 గంటల వరకు ప్రసారం కానుంది. మంగళవారం, గురు, శనివారాల్లో రీ టెలికాస్ట్‌లు ఉంటాయి. ఈ సీరియల్ ఆడియో వెర్షన్ ఆల్ ఇండియా రేడియో నెట్‌వర్క్‌లో శనివారం ఉదయం 11.00 గంటల నుంచి ప్రసారం కానుంది. 'స్వరాజ్'తో పాటు, దూరదర్శన్ దేశభక్తి, మహిళా సాధికారత సందేశాలతో 'జై భారతి', 'కార్పొరేట్ సర్పంచ్', 'యే దిల్ మాంగే మోర్' అనే 4 సీరియల్‌లను కూడా ప్రారంభించనుంది.
అలాగే మ్యూజికల్ రియాలిటీ షో 'సురోన్ కా ఏకలవ్య'ని కూడా ప్రసారం చేయబోతోంది. ఇది మహ్మద్ రఫీ, లతా మంగేష్కర్, కిషోర్ కుమార్ వంటి దిగ్గజాల సిగ్నేచర్ స్టైల్‌ను నిలుపుకుంటూ, ఒకప్పటి బాలీవుడ్ సంగీత రత్నాలను తాజా స్వరంతో అందజేస్తుంది. 46 జాతీయ అవార్డులు గెలుచుకున్న స్టార్టప్‌ల ప్రయాణం, విజయాన్ని ప్రదర్శిస్తూ 'స్టార్టప్ ఛాంపియన్స్ 2.0' షోను కూడా ఛానెల్ ప్రసారం చేస్తుందని దూరదర్శన్ వర్గాలు తెలిపాయి.












Click it and Unblock the Notifications