టాటా ఉద్యోగులకు ఊహించని షాక్: 1500మంది మేనేజర్ల తొలగింపు
ఉద్యోగుల తొలగింపు చర్యకు కంపెనీ పునర్నిర్మాణానికి సంబంధం లేదని అన్నారు. పనితీరు సరిగా లేని, నాయకత్వ లోపాలున్న వారి పైనే వేటు పడినట్లుగా చెప్పారు.
న్యూఢిల్లీ: భారత ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ సంస్థ ఉద్యోగులకు ఊహించని షాక్ ఇచ్చింది. ఉన్నపళంగా ఒకేసారి 1500మంది మేనేజర్ స్థాయి అధికారులను తొలగిస్తున్నట్లు సంచలన ప్రకటన చేసింది. ఈ మేరకు సంస్థ ఎండీ గుంటెర్ బుచ్చక్ స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు.
టాటా మోటార్స్ సంస్థలో మేనేజర్ స్థాయిలో పనిచేస్తున్న 12శాతం మందిని.. అంటే, 1500మందిని విధుల నుంచి తొలగిస్తున్నట్లు బుచ్చక్ ప్రకటించారు. తొలగింపుల గురించి ప్రస్తావిస్తూ.. సంస్థలో వైట్ కాలర్ స్థాయి ఉద్యోగుల పైనే వేటు ఉంటుందని, కింది స్థాయి ఉద్యోగులను తీసివేయడం జరగదని అన్నారు.

ఉద్యోగుల తొలగింపు చర్యకు కంపెనీ పునర్నిర్మాణానికి సంబంధం లేదని అన్నారు. పనితీరు సరిగా లేని, నాయకత్వ లోపాలున్న వారి పైనే వేటు పడినట్లుగా చెప్పారు. దీనిపై సమీక్ష నిర్వహించిన తర్వాతనే నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
ఈ సందర్భంగా సంస్థ వార్షిక ఫలితాలను కూడా బుచ్చక్ వెల్లడించారు.
తొలగించిన ఉద్యోగుల్లో కొంతమంది స్వచ్చంద విరమణను కోరుకున్నారని బుచ్చక్ అన్నారు. కాగా, గడిచిన ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో సంస్థ నెట్ ప్రాఫిట్ 17శాతం మేర తగ్గి (కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన) రూ. 4296 కోట్లకు చేరగా, మొత్తం ఆదాయం 3శాతం తగ్గి రూ. 78,747 కోట్లకు చేరుకుంది.
ఇక జేఎల్ఆర్ నికర లాభం 18శాతం పెరిగి 55.8 కోట్ల పౌండ్లకు చేరగా, ఆదాయం 10 శాతం వృద్ధితో 726 కోట్ల పౌండ్లుగా నమోదైంది. అలాగే బీఎస్ఈ సెన్సెక్స్ 140 పాయింట్లు పెరిగి 0.46 శాతం వృద్దిరేటును నమోదు చేయగా.. టాటా మోటార్స్ 3.68శాతం లాభంతో రూ.466వద్ద దూసుకెళ్తోంది.












Click it and Unblock the Notifications