దొంగకు దొంగ బుద్ధి.. దొరకు దొర బుద్ధి!!
అనుకోకుండా, అకస్మాత్తుగా ప్రయాణించాల్సి వచ్చేవారి జేబులను రైల్వేశాఖ కత్తిరిస్తోంది. అవసరాన్ని సొమ్ము చేసుకోవడంలో తనను మించినవారెవ్వరూ ఉండరనే ఆధిపత్యాన్ని ప్రదర్శించడానికి తహతహలాడుతోంది. తత్కాల్ పేరుతో టికెట్ ధరకు 90 శాతం వరకు అదనంగా వసూలు చేస్తోంది. ఒకవైపు వేసవి సెలవులు ముగియడం, మరోవైపు శుభకార్యాలుండటంతో రైళ్లల్లో రిజర్వేషన్లు దొరకడంలేదు.
80 నుంచి 90 శాతం వరకు వసూళ్లు
30 శాతం అదనపు మొత్తాన్ని మాత్రమే తత్కాల్ టికెట్లకు వసూలు చేస్తున్నట్లు రైల్వేశాఖ చెబుతోంది. అయితే వివిధ రైళ్లలో 80, 90 శాతం వరకు పెరుగుతోంది. సికింద్రాబాద్-తెనాలి థర్డ్ ఏసీ ఛార్జి రూ.610గా ఉంది. తత్కాల్ లో 30 శాతం అదనంతో రూ.800 గా ఉండాలి. రైల్వేశాఖ రిజర్వేషన్, సూపర్‌ఫాస్టు ఛార్జీలతో రూ.900 లోపే ఉండాలి. కానీ రూ.1,150 తీసుకుంటోంది. 200 కిలోమీటర్ల నుంచి 400 కిలోమీటర్ల దూరం ప్రయాణించేవారిపై భారం ఎక్కువగా పడుతోంది. స్లీపర్ లో రూ.100- రూ.200, థర్డ్ ఏసీలో రూ.300- రూ.400, సెకండ్ ఏసీలో రూ.400- 500 అదనంగా వసూలు చేస్తోంది. ఏసీ తరగతులకు కనీస దూరంగా 500 కిలోమీటర్లను రైల్వే పరిగణనలోకి తీసుకోవడమే దీనికి కారణం.
రైలును బట్టి.. డిమాండ్ ను బట్టి..
సికింద్రాబాద్ నుంచి విజయవాడ వరకు ఫలక్‌నుమా, కృష్ణా ఎక్స్‌ప్రెస్, ఈస్ట్‌కోస్ట్ సహా పలు రైళ్లలో థర్డ్ ఏసీ తత్కాల్ టికెట్ ధర రూ.1,150గా నిర్ణయించారు. అదే రెగ్యులర్ గా తీసుకునే టికెట్ ధర రూ.645 మాత్రమే. కొన్ని రైళ్లల్లో మాత్రం తక్కువగానే వసూలు చేస్తున్నారు. సికింద్రాబాద్ నుంచి విజయవాడ వరకు వందేభారత్‌లో ఛైర్‌కార్, ఎగ్జిక్యూటివ్ ఛైర్‌కార్ టికెట్ల ధరలు వరుసగా రూ.819, 1650గా ఉన్నాయి. తత్కాల్‌లో రూ.1,039, 2,100గా ఉన్నాయి. విజయవాడ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌లో ఛైర్‌కార్ టికెట్ రూ.515 అయితే తత్కాల్‌లో రూ.645గా ఉంది.

అవసరాన్ని క్యాష్ చేసుకుంటున్నారా?
సికింద్రాబాద్ నుంచి తిరుపతి వరకు శబరి ఎక్స్‌ప్రెస్‌లో థర్డ్ ఏసీ టికెట్ రూ.1,000 అయితే తత్కాల్‌లో రూ.1,315. ఈ రైళ్లలో తత్కాల్ అదనపు బాదుడు 30 శాతానికి అటూ ఇటూగానే ఉంది. ప్రయాణికుల అవసరాలు ఎక్కడైతే ఎక్కువగా ఉన్నాయో, ఎక్కడైతే టికెట్లకు డిమాండ్ ఉందో అక్కడ మాత్రం అదనంగా సొమ్ము చేసుకుంటోంది. స్లీపర్ బోగీల్లో 30 శాతం సీట్లను తత్కాల్ కింద విక్రయిస్తుండగా, థర్డ్ ఏసీ, ఛైర్‌కార్‌లో ఒక్కో బోగీలో 16 బెర్తులు, సెకండ్ ఏసీలో 10 బెర్తులు, ఎగ్జిక్యూటివ్ ఛైర్‌కార్‌లో 5 బెర్తులు తత్కాల్ కోటా కింద ఇస్తోంది. ప్రయాణికుల అవసరాలను తెలుసుకొని వాటిని పరిష్కరించే విధంగా చర్యలు ఉండాలని, అలా కాకుండా ఛార్లెస్ శోభరాజ్, వీరప్పన్ వారసులు రైల్వేలో ఉన్నారంటూ రైల్వే యూజర్స్ అసోసియేషన్ నాయకులు మండిపడుతున్నారు.












Click it and Unblock the Notifications