TCS ఉద్యోగుల ల్యాప్ టాప్స్ ట్రాక్ చేస్తోందా..! క్లారిటీ ఇదే ..!
ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) తమ ఉద్యోగుల ల్యాప్ టాప్స్ పై నిఘా పెట్టిందన్న వార్తలు ఇండస్ట్రీలో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేపాయి. ఆన్ లైన్లో ల్యాప్ టాప్స్ పై నిఘా పెట్టడం ద్వారా తమ ఉద్యోగుల సమాచారాన్ని ఎప్పటికప్పుడు ట్రాక్ చేస్తోందన్న ప్రచారం గుప్పుమనడంతో ఒక్కసారిగా టెన్షన్ మొదలైంది. దీనిపై ఇవాళ టీసీఎస్ క్లారిటీ ఇచ్చింది. ల్యాప్ టాప్స్ యాక్టివిటీని పరిశీలిస్తున్న మాట వాస్తవమే అయినా నిఘా పెట్టలేదని టీసీఎస్ తెలిపింది.
ఉద్యోగులకు టీసీఎస్ ఇచ్చిన ల్యాప్ టాప్స్ లో టీసీఎస్ తాజాగా ప్రత్యేక పర్యవేక్షణ సాఫ్ట్ వేర్ ను ఇన్ స్టాల్ చేసిందని వార్తలొచ్చాయి. డిజిటల్ యూజర్ ఎక్స్ పీరియన్స్ మానిటరింగ్ టూల్ గా దీన్ని తెలిపాయి. ఉద్యోగులు ల్యాప్ టాప్ లో ఏయే అప్లికేషన్లు వాడుతున్నారు, ఎంత సమయం వాడుతున్నారో తెలుసుకునేందుకే ఈ మానిటరింగ్ టూల్ ఇన్ స్టాల్ చేసినట్లు ఉద్యోగులు తెలిపారు. దీంతో ఉద్యోగుల గోప్యత మరోసారి చర్చనీయాంశమైంది.

ఈ వివాదంపై టీసీఎస్ ఇవాళ స్పందించింది. తమ ఉద్యోగుల్ని వ్యక్తిగతంగా ల్యాప్ టాప్స్ ద్వారా ట్రాకింగ్ చేయడం లేదని టీసీఎస్ స్పష్టత ఇచ్చింది. తమ నెట్ వర్క్ మొత్తం పనితీరును ట్రాక్ చేసేందుకే ఈ టూల్స్ అమర్చినట్లు తెలిపింది. తమ ఉద్యోగులకు భద్రత కల్పించడం తో పాటు యూజర్లకు మెరుగైన సేవలు అందించేందుకు మాత్రమే ఈ టూల్స్ వాడుతున్నట్లు వెల్లడించింది. అంతే కానీ తాము ఉద్యోగుల వ్యక్తిగత యాక్టివిటీని ట్రాక్ చేయడం లేదని తెలిపింది. దీనిపై జరుగుతున్న ప్రచారం అంతా నిరాధారం, అవాస్తవం అంటూ కొట్టిపారేసింది. దీంతో ఉద్యోగులు ఊపిరిపీల్చుకుంటున్నారు.














Click it and Unblock the Notifications