భారత దంపతులకు కొడుకును దూరం చేసిన అమెరికా
న్యూయార్క్/జైపూర్: అమెరికాలోని న్యూజెర్సీలో ఓ భారతీయ జంటకు అనుకోని ఆటంకం ఎదురైంది. చిన్న పొరపాటు కారణంగా అమెరికా అధికారుల తీరుతో తల్లి ఒడిలో సేద తీరాల్సిన రెండు నెలల చిన్నారి ప్రస్తుతం బాలల సంరక్షణ కేంద్రంలో ఉండాల్సి వచ్చింది. ఆస్పత్రిలో చికిత్స పొంది, ప్రాణాపాయం నుంచి బయటపడిన తమ ముద్దుల చిన్నారి తిరిగి తమ వద్దకు చేరకపోవడంతో ఆ తల్లిదండ్రులు తీవ్ర మనో వేదనకు గురవుతున్నారు.
ఈ నేపథ్యంలో తమ బాబును తిరిగి తమ చెంతకు చేర్చాల్సింది కోరుతూ కేంద్రమంత్రి సుష్మా స్వరాజ్‌కు లేఖ రాశారు. వివరాల్లోకి వెళితే.. రాజస్థాన్ రాష్ట్రంలోని జైపూర్‌కు చెందిన ఆశీష్ పరీక్ ఐటి దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగిగా పని చేస్తున్నాడు. భార్య విదీశాతో న్యూజెర్సీలో ఉంటున్న వీరికి గత అక్టోబర్‌లో అశ్విద్ పుట్టాడు.
అయితే విదీశ చేతిలో నుంచి అశ్విద్.. ప్రమాదవశాత్తూ జారి కిందపడ్డాడు. కాగా, సమీపంలో ఉన్న టీవీ స్టాండ్‌కు బలంగా తగిలి నేలపై పడటంతో చిన్నారి తలపై తీవ్రంగా గాయమైంది. దీంతో వెంటనే ఆ చిన్నారిని ఆస్పపత్రికి తరలించారు. పరిస్థితి విషమంతో ఉండడంతో మరో ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. పూర్తి చికిత్స అనంతరం అశ్విద్ కోలుకున్నాడు.

అయితే, పిల్లవాడిని అమానుషంగా హింసించారని ఆరోపిస్తూ అమెరికా అధికారులు ఆశిష్ పరీక్- విదీశాలపై కేసులు నమోదు చేశారు. చికిత్స తర్వాత కోలుకున్న చిన్నారిని బాలల సంరక్షణ కేంద్రానికి తరలించారు. ఈ పరిస్థితుల్లో అతడిని తల్లిదండ్రులకు అప్పగించలేమని అధికారులు వాదిస్తున్నారు.
పరీక్ దంపతులు ఎంత వేడుకున్నా ప్రయోజనం లేకుండాపోయింది. దీంతో అశ్విద్ తల్లిదండ్రులు, బంధువులు ఆందోళనలో మునిగిపోయారు. తిరిగి తమ బాబును తమకు అప్పగించాల్సింది కోరుతూ తల్లిదండ్రులు కన్నీటి పర్యాంతమయ్యారు.
ఈ నేపథ్యంలోనే విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌కు పరీక్ లేఖ రాశారు. తమ కుమారుడిని తమకు అప్పగించేలా చర్యలు తీసుకోవాలని ఆ లేఖలో విజ్ఞప్తి చేశారు. కాగా, 2012లో నార్వేలో ఓ భారతీయ జంటకు ఇలాంటి అనుభవమే ఎదురైన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications