వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టార్గెట్ కెసిఆర్: బిజెపి, టిడిపి నాయకుల ధ్వజం

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: విద్యుత్తు సమస్యపై తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావును లక్ష్యం చేసుకుని తెలుగుదేశం, బిజెపి నాయకులు ధ్వజమెత్తారు. టిడిపి తెలంగాణ నేతలతో పాటు ఆంధ్రప్రదేశ్ నేతలు కూడా తీవ్రంగా కెసిఆర్‌పై వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కెఈ కృష్ణమూర్తి, నీటిపారదుల శాఖ మంత్రి దేవినేని ఉమా మహేశ్వర రావు, తెలుగుదేశం తెలంగాణ నేతలు ఎర్రబెల్లి దయాకర్ రావు, రేవంత్ రెడ్డి, తెలంగాణ బిజెపి అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి కెసిఆర్‌పై తీవ్రంగా ధ్వజమెత్తారు.

కెసిఆర్ పరమ సన్నాసి

తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావుపై ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి మండిపడ్డారు. చట్టాలు తెలుసుకోకుండా మాట్లాడుతున్న కేసీఆరే పరమ సన్నాసి అని ఆయన కర్నూలు జిల్లాలో అన్నారు. తెలంగాణ భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావును ఆయన వదలలేదు. అన్నీ తెలిసి హరీష్‌ అబద్దాలు చెబుతున్నారని కేఈ ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వం శ్రీశైలంలో మొండిగా విద్యుత్‌ ఉత్పత్తి చేస్తే అడ్డుకుంటామని ఆయన హెచ్చరించారు.

TDP and BJP targets KCR on power issue

అసెంబ్లీలో నిలదీస్తాం

తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు నియంత పోకడలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలంగాణ టిడిపి నేత ఎర్రబెల్లి దయాకరరావు ఆరోపించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కరెంట్‌ కష్టాలు, కరువుతో రైతులు అల్లాడుతున్నా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.

ప్రజా సమస్యలపై అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వాన్ని నిలదీస్తామని ఎర్రబెల్లి స్పష్టం చేశారు. గతంలో కాంగ్రెస్‌ హయాంలో నడిచిన పథకాలు కూడా కుంటుబడ్డాయని, తెలంగాణ రైతాంగమంతా కూడా తీవ్ర అప్పులపాలై, పంటలు నష్టపోయి, గిట్టుబాటు ధర లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వ విధానాలవల్లే నష్టం జరిగిందని ఆయన విమర్శించారు. ఇవన్నీ రేపు అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తామని ఎర్రబెల్లి స్పష్టం చేశారు.

కెసిఆర్ చేయాల్సిన పనులు మానేశారు

తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ తాను చేయాల్సిన పనులను మానేశారని జి. కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. మూడేళ్ల వరకు విద్యుత్తు రాదంటూ కెసిఆర్ రైతులకు చెప్పడం దారుణమని ఆయన మంగళవారం మీడియాతో అన్నారు. సోలార్ విద్యుత్తుకు కేంద్రం సహకారం అందిస్తామని చెప్పినా కెసిఆర్ చొరవ చూపడం లేదని ఆయన అన్నారు. హైదరాబాదులో భారీగా కరెంట్ చౌర్యం జరుగుతోందని, విద్యుత్తు పొదుపునకు ఏ విధమైన చర్యలూ తీసుకోవడం లేదని, విద్యుచ్ఛక్తి శాఖలో విజిలెన్స్ విభాగాన్ని నిర్వీర్యం చేశారని ఆయన అన్నారు. విద్యుత్తు కష్టాలకు కెసిఆరే కారణమని ఆయన అన్నారు.

54 శాతం కరెంట్ వాటా ఎక్కడిది...

తెలంగాణకు 54 శాతం కరెంట్ వాటా ఎలా వచ్చిందో కెసిఆర్ చెప్పాలని తెలుగుదేశం తెలంగాణ నేత రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు న్న అభిమానం వల్లనే తెలంగాణకు 54 శాతం వాటా వచ్చిందని ఆయన మంగళవారంనాడు మీడియాతో అన్నారు.

తెలంగాణకు వాస్తవానికి 42 శాతం కరెంట్ వాటా మాత్రమే రావాలని, అయితే తెలంగాణ రైతులు మోటార్లపై ఆధారపడ్డారని తెలిసి చంద్రబాబు 2006 ప్రాతిపదికగా తీసుకుని విద్యుత్తు పంపిణీ చేశారని ఆయన చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు అధికారంలోకి రాగానే రెండు వేల మెగావాట్ల విద్యుత్తును కొన్నారని, తెలంగాణలో విద్యుత్తు శాఖకు మంత్రి లేరని, ఐఎఎస్ అధికారి లేరని ఆయన అన్నారు.

కరెంట్‌ విషయంలో ఛత్తీస్‌గడ్‌ రాష్ట్రంతో చేసుకున్న ఎంవోయూ అమలవుతుందన్న నమ్మకం లేదని... ఎందుకంటే ఆ రాష్ట్రంతో చేసుకున్నది ఒప్పందం మాత్రమేనని రేవంత్‌రెడ్డి అన్నారు. అక్కడ అంత విద్యుత్‌ ఉత్పత్తి కావడం లేదని ఆయన అన్నారు. తెలంగాణలో ఉన్న విద్యుత్‌, సరఫరా సమస్యలకు అన్నింటికి రిటైర్‌ అయిన అధికారులను టీ. ప్రభుత్వం పెట్టుకుందని ఆయన విమర్శించారు. ఎందుకంటే ప్రభుత్వం ఏం చెబితే అది విని, చెప్పిన చోట సంతకాలు చేస్తారని, అందుకే వాళ్లను నియమించారని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ఈ విధంగా ముఖ్యమంత్రి చేసుకుంటూ పోతే ప్రజల కరెంట్‌ కష్టాలు ఎప్పుడు తీరుతాయని ఆయన ప్రశ్నించారు.

English summary
Making Telangana CM K chandrasekhar Rao as target, BJP president Kishan Reddy, Telugudesam leaders Revanth Reddy, Errabelli Dayakar Rao, KE Krishna Murthy and others made criticism.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X