విద్యార్థులా.. బజారు రౌడీలా: వైరల్ వీడియో వెనుక నివ్వెరపోయే నిజం
పాట్నా : ఒక్కడిని చేసి ఐదారుగురు విద్యార్థులు కలిసి ఓ విద్యార్థిని బజారు రౌడీల్లా చితకబాదిన ఘటన సోషల్ మీడియా ద్వారా దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన సంగతి తెలిసిందే. అయితే ఆ సంచలనాన్ని మించేలా.. ఇప్పుడు దాని వెనుక దాగున్న కథనం బయటకొచ్చింది. దెబ్బలు తిన్న సదరు బాధిత విద్యార్థి మనోవేదన ఇప్పుడు సోషల్ మీడియాలో అదే రేంజ్ లో వైరల్ అవుతోంది.
బాధిత విద్యార్థి వెల్లడించిన విషయాలు వింటే.. ఎవరైనా సరే చలించిపోకమానరు. అంతలా అతన్ని టార్గెట్ చేసుకుని చావబాదడమే పనిగా పెట్టుకున్నారు అతని సహచర విద్యార్థులు. కేవలం చదువులో ముందున్నాడన్న కారణం.. దానికి తోడు దళితుడన్న చులకన భావంతో అతని సహచర విద్యార్థులు తీవ్రమైన ఈర్ష్యా ద్వేషాలను పెంచుకున్నారు. ఈ క్రమంలోనే ప్రతీరోజు అతన్ని కొట్టడం.. మొహం మీద ఉమ్మేయడం లాంటి పాశవికమైన చర్యలకు దిగుతున్నారంటూ ఎన్డీటీవీకి రాసిన లేఖ ద్వారా సదరు బాధిత విద్యార్థి తన ఆవేదనను వ్యక్తం చేశాడు.

బీహార్ లోని ముజఫర్ నగర్ కేంద్రీయ విద్యాలయంలో చోటు చేసుకున్న ఈ ఘటనపై బాధిత విద్యార్థి వెల్లడించిన వివరాలు క్లుప్తంగా :
దళితుడినన్న ఒకే ఒక్క కారణంతో వారు నన్ను రోజూ చిత్రహింసలకు గురి చేస్తున్నారు. దీనిపై పోలీసులకు, నా స్నేహితులకు ఎన్నోసార్లు చెప్పి విసిగిపోయాను తప్ప నా మాటలను ఎవరూ పట్టించుకోలేదు. వారిద్దరూ అన్నదమ్ములు. అందులో ఒకడు నా జూనియర్. వారానికి ఓ రోజైనా నా మొహాన ఉమ్మేయందే వూరుకోరు. మా టీచర్ కి నా బాధ చెప్పుకొంటే ఓపిగ్గా విని నా పట్ల సానుభూతి చూపుతారు కానీ వారిద్దరినీ ఏమీ అనలేరు. ఎందుకంటే, వారి తండ్రి పవరఫుల్ క్రిమినల్. పోలీసు కేసు పెడదామంటే నన్ను పాఠశాల నుంచి డిస్మిస్ చేస్తారు. అదీకాకుండా వాళ్ల నాన్న క్రిమినల్ కాబట్టి మా ఫ్యామిలీకి హాని తలపెడతారన్న భయం నన్ను వెంటాడుతోంది. నన్ను కొడుతున్న వీడియో బయటికి రావడంతో మా అమ్మమ్మ, తాత పోలీసులకు ఫిర్యాదు చేశారు.
నన్ను కొడుతున్నప్పుడు క్లాస్ రూంలో మరో విద్యార్థి దీనిని రికార్డ్ చేశాడు. నన్ను అలా కొడుతుంటే అతనికి సరదాగా ఉంటుందట. అందుకే వీడియో తీశానని ఓసారి నాతో చెప్పాడు. పైగా ఆ విద్యార్థి ఎప్పుడూ నా వెనక కూర్చుంటాడు. నేను రాసింది కాపీ కొట్టి పాసవ్వాలనుకుంటాడు. దీనికితోడు నేను దళితుడినని తెలిసింది. దీంతో మరింత కసితో నన్ను చావబాదేవాడు. మా తాత కేసు పెట్టడంతో ఈ ముగ్గురు వ్యక్తులు మా వద్దకు వచ్చి కేసు వాపసు తీసుకోమని బెదిరించారు. మార్చ్ లో ఫైనల్స్ ఉన్నాయి. ఇప్పుడు స్కూల్ కి వెళ్లడం లేదు. ఏం చేయాలో అర్థం కావడం లేదు" అంటూ తన గోడు వెల్లబోసుకున్నాడు.
వీడియో సృష్టించిన సంచలనం కన్నా.. అసలు నిజం వెలుగులోకి వచ్చాక.. విషయం మరింత సంచలనంగా మారుతోంది. విద్యార్థి పట్ల అమానుషంగా వ్యవహరించిన సహచర విద్యార్థులపై నెటిజెన్స్ అంతా తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. విద్యార్థిపై దాడికి పాల్పడిన ఇద్దరు సోదరులపై గత గురువారం నాడు ఖాజీ మహమ్మద్ పూర్ పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేయగా.. వారిద్దరు ఊరిడిచి వెళ్లిపోయినట్లుగా తెలుస్తోంది. దాడికి పాల్పడ్డ ఇద్దరు సోదరులు 11, 12వ తరగతి విద్యార్థులుగా సమాచారం.
ఆ సోదరులిద్దరు తమ తాత ఇంటి వద్ద ఉండి చదువుకుంటున్నట్లుగా తెలుస్తోంది. వీడియో కాస్త వైరల్ గా మారాక.. దీనిపై స్పందించాడు ఆ సోదరుల తాతయ్య. 'మేము ఈ ఘటనను మరిచిపోయాం. వీడియో వైరల్ అయ్యాక నా మనువడు ఊరిడిచి వెళ్లిపోయాడు, మళ్లీ ఇక ఇక్కడికి రాకపోవచ్చు' అంటూ తెలిపాడు. పోలీసులు స్పందిస్తూ.. 'ఆ ఇద్దరు సోదరులతో మాట్లాడాం, వీడియో ఫుటేజీని ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపిస్తున్నాం.. జువైనల్ చట్టం ప్రకారం వారిపై చర్యలు తీసుకుంటాం' అని వెల్లడించారు.












Click it and Unblock the Notifications