తెహల్కా కేసు: సంస్థను వీడిన మరో జర్నలిస్టు
న్యూఢిల్లీ: తెహల్కా పత్రికా కార్యాలయంలో సీనియర్ జర్నలిస్టుగా కొనసాగుతున్న మరో పాత్రికేయురాలు మంగళవారం రాజీనామా చేశారు. రాజీనామా చేసిన సీనియర్ ఎడిటర్ రానా అయ్యూబ్ ప్రస్తుత పత్రిక వ్యవస్థాపకుడు తరుణ్ తేజ్‌పాల్ వివాదం నేపథ్యంలో సంస్థలో కొనసాగదలచుకోలేదని ట్విట్టర్‌లో పేర్కొన్నారు.
కాగా తరుణ్ తేజ్‌పాల్ గోవాలోని ఓ హోటల్‌లో తనపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు చేసిన బాధిత జర్నలిస్టు తన ఉద్యోగానికి సోమవారం రాజీనామా చేశారు. తనకు వేధింపుల విషయంలో సంస్థ నుంచి ఎలాంటి మద్దతు లభించలేదని, అందుకోసమే తను రాజీనామా చేసినట్లు ఆమె తెలిపారు. మేనేజింగ్ ఎడిటర్ సోమా చైధురి నుంచి కూడా ఎలాంటి మద్దతు లభించలేదని బాధిత జర్నలిస్టు ఆరోపించారు.

తరుణ్ తేజ్‌పాల్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు సోమా చౌధురికి గత వారం ఈ మెయిల్ ద్వారా ఓ సందేశాన్ని పంపించానని తెలిపారు. అయితే అది మీడియాకు లీక్ అయిందని, దీంతో గోవా పోలీసులు తరుణ్ తేజ్‌పాల్‌పై అత్యాచారం చేసు నమోదు చేశారని బాధితురాలు తెలిపారు. తెహల్కాను కాపాడేందుకు మాత్రమే సోమా చౌధురి ప్రయత్నిస్తున్నారని ఆమె ఆరోపించారు. తరుణ్ తేజ్‌పాల్ లైంగిక దుష్ప్రవర్తన గురించి సంస్థ ఉద్యోగులకు తెలియజేయాలని కోరినా, ఆమె అందుకు నిరాకరించిందని బాధితురాలు పేర్కొంది.
అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోవడం వల్ల తేజ్‌పాల్ తన పదవికి ఆరు నెలలపాటు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు ఉద్యోగులతో చౌధురి పేర్కొన్నట్లు ఆమె తెలిపింది. బాధితురాలు విషయాన్ని బయటపెట్టడం చౌధురికి ఇష్టం లేనట్లుగా ఉందని, పోలీసులకు వేధింపుల విషయాన్ని చెప్పడాన్ని ఆమె వ్యతిరేకించినట్లు కొందరు అభిప్రాయపడుతున్నారు. కాగా ఘటన పట్ల సంస్థ స్పందనను నిరసిస్తూ గత వారం క్రితం ఇద్దరు ఉద్యోగులు రాజీనామా చేసి సంస్థను వీడారు.












Click it and Unblock the Notifications