"2029లో రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయడమే లక్ష్యం"
ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. 2029 లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని ప్రధాన మంత్రిని చేయడమే లక్ష్యంగా విపక్ష పార్టీలన్నీ కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. బిహార్ లోని నవాడాలో నిర్వహించిన ఓటర్ అధికార్ యాత్రలో పాల్గొన్న తేజస్వి యాదవ్ ఈ మేరకు కీలక వ్యాఖ్యలు చేశారు. 2024 లోక్ సభ ఎన్నికల్లో ఇండియా కూటమిలో కొన్ని విబేధాల కారణంగా ప్రధానమంత్రి అభ్యర్థిని ప్రకటించకుండానే ఎన్నికల బరిలో నిలిచి ఓటమి పాలైంది. అయితే ఈ సారి ఎన్నికల ముందు నుంచే ఇండియా కూటమి తమ కూటమి అభ్యర్థిగా రాహుల్ గాంధీని ప్రకటిస్తూ వస్తున్నట్లు స్పష్టం అవుతోంది.
కేంద్ర ఎన్నికల సంఘం, బీజేపీ కలిసి ఓట్లను చోరీ చేసి.. బిహార్ ప్రజలను ఫూల్స్ ను చేయాలని ప్లాన్ వేస్తున్నారని ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ మండిపడ్డారు. ప్రజల ఓటు హక్కును బీజేపీ కూనీ చేస్తోంది. తాము బిహారీలం. తాము ఎన్నికలను ఖైనీ(పొగాకు) గా భావిస్తాం. చేతితో రుద్ది.. నోట్లో వేసుకుని.. నమిలి అవతల పడేస్తాం.. అని కీలక వ్యాఖ్యలు చేశారు. ఈసీ కేంద్ర ప్రభుత్వం చేతుల్లోకి వెళ్లిపోయిందని.. బతికున్న ఓటర్లు చనిపోయినట్లుగా ప్రకటిస్తోందన్నారు.
మరోవైపు ఎన్నికల కమిషన్ పక్షపాతంగా వ్యవహరిస్తోందని ఇండియా కూటమి మండిపడుతూ వస్తోంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఈసీ అవకతవకలకు పాల్పడుతోందని వెంటనే లోక్ సభను రద్దు చేసి ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తోంది. ఇక ఈ ఏడాది చివరిలో బిహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇటీవల కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆ రాష్ట్రంలో భారీ యాత్ర ప్రారంభించిన సంగతి తెలిసిందే.

'ఓటర్ అధికార్ యాత్ర' పేరుతో యాత్రకు శ్రీకారం చుట్టారు. ఆగస్టు 17న బిహార్ లోని ససరాంలో ప్రారంభమైన ఓటర్ అధికార్ యాత్ర సెప్టెంబరు 1న పట్నాలో ముగియనుంది. ఈ యాత్ర రాష్ట్రంలోని 24 జిల్లాలు, 60 అసెంబ్లీ స్థానాలను కవర్ చేస్తుంది. ఓటర్ల హక్కులను పరిరక్షించడం, ఎన్నికల ప్రక్రియలో పారదర్శకతపై అవగాహన కల్పించడం ఈ యాత్ర ప్రధాన లక్ష్యంగా పెట్టుకుంది.












Click it and Unblock the Notifications