చివరి వరకూ ఉత్కంఠ.. ఎట్టకేలకు తేజస్వీ యాదవ్ ..
క్షణక్షణం ఉత్కంఠభరితంగా సాగిన పోరులో రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) నాయకుడు, బిహార్ మాజీ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ రాఘోపూర్ లో ఎట్టకేలకు విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థి సతీష్ కుమార్ పై 14 వేలకు పైగా మెజార్టీతో ఆయన విజయం సాధించారు. 32 రౌండ్ ల కౌంటింగ్ లో తేజస్వి యాదవ్ కు 1,18,597 ఓట్లు వచ్చాయి. ఇక బీజేపీ అభ్యర్థికి 1,04,065 ఓట్లు వచ్చాయి. చివరి వరకూ బీజేపీ అభ్యర్థి సతీష్ కుమార్.. తేజస్వికి గట్టి పోటీ ఇచ్చారు.
రాఘోపూర్ నియోజకవర్గం.. హాజిపూర్ లోక్ సభ పరిధిలోకి వస్తుంది. ఇది జనరల్ సీటు. నియోజకవర్గంలో మొత్తం 3,44,369 మంది ఓటర్లు ఉన్నారు. 2020 అసెంబ్లీ ఎన్నికల సమయంలో మొత్తం ఓటర్లలో పురుషులు 1,85,106 మందికాగా.. 1,59,258 మంది మహిళలు ఉన్నారు. అలాగే 1,097 పోస్టల్ ఓట్లు ఉండగా.. 1,320 సర్వీసు ఓట్లు ఉన్నాయి.
ఇక ఈ ఏడాది ఎన్నికల్లో రాఘోపూర్ నియోజకవర్గంలో ఆర్జేడీ నుంచి తేజస్వి యాదవ్ పోటీ చేయగా.. బీజేపీ నుంచి సతీష్ కుమార్ బరిలో నిలిచారు. జన్ సూరజ్ పార్టీ నుంచి చంచల్ కుమార్ పోటీ చేశారు. అలాగే తేజస్వి యాదవ్ సోదరుడు తేజ్ ప్రతాప్ యాదవ్.. తన పార్టీ జన్ శక్తి జనతా దల్ నుంచి ప్రేమ్ కుమార్ ను బరిలోకి దింపారు. ఆర్జేడీ పార్టీ మహగఠ్ బంధన్ లో భాగంగా ఉంది. కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు, వికాస్ శీల్ ఇన్సాన్ పార్టీ ఈ కూటమిలో ఉన్నారు. ఇక ఎన్డీయే కూటమిలో బీజేపీ, జేడీయూ, లోక్ జనశక్తి పార్టీ, హిందూస్తానీ ఆవామ్ మోర్చా, రాష్ట్రీయ లోక్ మోర్చా పార్టీలు కూటమిగా ఉన్నాయి.

2020 బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తేజస్వి యాదవ్ కు భారీ మెజార్టీ వచ్చింది. బీజేపీ అభ్యర్థి సతీష్ కుమార్ పై ఏకంగా 38, 174 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. కానీ ఈసారి మెజారిటీ భారీగా తగ్గింది. కేవలం 14, 532 ఓట్ల మెజారిటీతోనే విజయం సాధించారు. ఇక మొత్తం 243 అసెంబ్లీ స్థానాలకు గాను ఇప్పటికే ఎన్డీయే కూటమి 199 సీట్లు సాధించింది. 4 స్థానాల్లో ఆధిక్యం ప్రదర్శిస్తోంది. ఇక మహా గఠ్ బందన్ 31 స్థానాల్లో మాత్రమే గెలుపొందింది. ఇంకో 3 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఇక బీజేపీ సొంతంగా 90 స్థానాల్లో గెలుపొంది రాష్ట్రంలోనే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా చరిత్ర సృష్టించింది. జేడీయూ 82 స్థానాల్లో విజయం సాధించింది.












Click it and Unblock the Notifications