టి బిల్లుకు ఆమోదం: వెంకయ్య డిమాండ్, చిరు ప్రశ్నలు

న్యూఢిల్లీ:రాజ్యసభలో గురువారం రాత్రి తెలంగాణ బిల్లు ఆమోదం పొందింది. మూడు రోజుల క్రితం లోకసభలో బిల్లు ఆమోదం పొందిన విషయం తెలిసిందే. ఇప్పుడు రాజ్యసభలో ఆమోదం పొందడంతో పార్లమెంటు ఉభయ సభల ఆమోదం లభించినట్లయింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అడ్డంకులు తొలిగాయి.
కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండే గురువారం మధ్యాహ్నం రాజ్యసభలో ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లు (తెలంగాణ ముసాయిదా బిల్లును)ను ప్రవేశ పెట్టారు. పలుమార్లు వాయిదా పడిన అనంతరం రాజ్యసభ మధ్యాహ్నం మూడు గంటలకు తిరిగి ప్రారంభమైంది.

విపక్షాల నుండి తనకు నోటీసులు అందినట్లు డిప్యూటీ చైర్మన్ కురియన్ చెప్పారు. అరుణ్ జైట్లీ, సుజనా చౌదరి, రాజీవ్ చంద్రశేఖర్, నరేష్ గుజ్రాల్‌ల నుండి నోటీసులు అందినట్లు ప్రకటించారు. బిల్లు రాజ్యాంగబద్ధంగా లేదని నోటీసులు ఇచ్చినట్లు చెప్పారు.

బిల్లుకు మద్దతిచ్చిన పార్టీలు.... కాంగ్రెసు, బిజెపి, ఎన్సీపి, సిపిఐ, బిఎస్పీ, బిపిఎస్, వ్యతిరేకించిన పార్టీలు..... ఎస్పీ, డిఎంకె, తృణమూల్ కాంగ్రెసు, బిజెడి, జెడి(యు), సిపిఎం

Telangana Bill in Rajya Sabha

- అనంతరం తెలంగాణ బిల్లును ప్రవేశ పెట్టాలని సుశీల్ కుమార్ షిండేకు సూచించారు.

- షిండే టి బిల్లుపై ప్రసంగం చదవడం ప్రారంభించారు. ఆ సమయంలో సీమాంధ్ర ప్రాంత సభ్యులు అడ్డుకునే ప్రయత్నాలు చేశారు.

- అప్పటికే షిండేకు మార్షల్స్, తెలంగాణ కాంగ్రెసు సభ్యులు రక్షణ కవచంగా నిలబడ్డారు. వారిని ప్రతిఘటించారు. వి హనుమంత రావు వారిని అడ్డుకున్నారు.

- టిడిపి సీమాంధ్ర సభ్యులను డిప్యూటీ చైర్మన్ బయటకు పంపించారు.

- సభలో గందరగోళం చెలరేగడంతో కురియన్ సభను పదినిమిషాలు వాయిదా వేశారు.

- వాయిదా అనంతరం తిరిగి సభ ప్రారంభమైంది.

- జైట్లీని మాట్లాడాలని కురియన్ సూచించారు. జైట్లీ రాజ్యాంగ బద్దంగా లేదని నోటీసు ఇవ్వలేదని, బిల్లులోని లోపాలు మాత్రమే చెబుతానన్నారని, తాను మొదట పొరపాటుగా ప్రస్తావించానని తెలిపారు. జైట్లీని మాట్లాడాలని సూచించారు.

- సభలో గందరగోళం ఏర్పడటంతో జైట్లీ మాట్లాడలేకపోయారు. సభను పదిహేను నిమిషాలు వాయిదా వేశారు.

- జైట్లీ నోటీసుపై ప్రకాశ్ జవదేకర్ వివరణ

సభలో జైట్లీ నోటీసు పైన బిజెపి అధికార ప్రతినిధి ప్రకాశ్ జవదేకర్ వివరణ ఇచ్చారు. తాము తెలంగాణకు కట్టుబడి ఉన్నామని, జైట్లీ సవరణల కోసమే రాజ్యసభలో నోటీసు ఇచ్చారని తెలిపారు. తాము తెలంగాణకు కట్టుబడి ఉన్నామని అదే సమయంలో సీమాంధ్రకు న్యాయం చేయాలన్నారు. తెలంగాణ ఇచ్చి, సీమాంధ్రకు న్యాయం చేయడం సాధ్యమే అన్నారు. జైట్లీ సవరణలు ప్రతిపాదించారన్నారు. కాంగ్రెసు పార్టీ బిల్లును సక్రమంగా తీసుకు రాలేదన్నారు. కాంగ్రెసు తెలంగాణ వ్యవహారాన్ని సంక్లిష్టం చేస్తోందన్నారు.

- మూడున్నరకు సభ ప్రారంభమైంది. పరిస్థితిలో మార్పు లేకపోవడంతో ప్రొటెం స్పీకర్‌గా వచ్చిన రేణుకా చౌదరి సభను నాలుగు గంటల వరకు వాయిదా వేశారు. సీమాంధ్ర ఎంపీలకు తోడు శివసేన, తృణమూల్ కాంగ్రెసు, ఎస్పీ, సిపిఎం, జెడి(యు) సభ్యులు తోడయ్యారు.

- వాయిదా అనంతరం నాలుగు గంటలకు సభ ప్రారంభమైంది. రాజ్యసభకు ప్రధాని హాజరయ్యారు. బిల్లు రాజ్యాంగ బద్దంగా లేదని కొందరు ఎంపీలు ప్లకార్డులు ప్రదర్శించారు. అటార్నీ జనరల్‌ను పిలిపించాలని సుజనా చౌదరి పట్టుబట్టారు. సభ్యులు ఆందోళన చేస్తుండటంతో డిప్యూటీ చైర్మన్ కురియన్ సభ్యులకు నమస్కరించి మరీ సహకరించాలని కోరారు.

తెలంగాణ బిల్లుపై చర్చిచేంచేందుకు సహకరించాలని చాలాసేపు సభ్యులకు విజ్ఞప్తి చేశారు. సవరణలు కుదరవన్నారు. వెంకయ్య నాయుడును మాట్లాడాలని కురియన్ సూచించారు.

సభలో ఇంత గందరగోళంగా ఉంటే ఎలా మాట్లాడాలని వెంకయ్య అన్నారు. సభను అదుపులో పెట్టాలని కోరారు. బిల్లుపై చర్చకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. మరోవైపు సుజనా చౌదరి - కురియన్‌‍ల మధ్య వాగ్వాదం జరిగింది. సభను అడ్డుకుంటే సస్పెండ్ చేస్తానని సుజనా చౌదరిని కురియన్ హెచ్చరించారు. సభ అదుపులోకి రాకపోవడంతో పదిహేను నిమిషాలు వాయిదా వేశారు.

- నాలుగు గంటల ఇరవై అయిదు నిమిషాలకు తిరిగి సభ ప్రారంభమైంది. చర్చ ప్రారంభించాలని వెంకయ్యను కురియన్ కోరారు. వెంకయ్య మాట్లాడుతుండగా సభ్యులు నినాదాలు చేశారు. కురియన్ పలుమార్లు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఆందోళన మధ్య వెంకయ్య ప్రసంగించారు.

విభజన బిల్లుపై సీమాంధ్రులు తీవ్ర ఆందోళనతో ఉన్నారని వెంకయ్య చెప్పారు. సీమాంధ్రుల సమస్యలను తాను సభ దృష్టికి తీసుకువస్తానని చెప్పారు. సీమాంధ్రలో ఆర్నెల్లుగా ఆందోళనలు జరుగుతున్నాయని, తెలంగాణలో వెయ్యి మందికి పైగా ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. తెలంగాణ బిల్లుకు తాము మద్దతిస్తామని చెప్పారు. బిల్లుకు అందరు సహకరించాలని కోరారు.

సభ్యులు ఆందోళన చేస్తుండటంతో సాధారణ పరిస్థితి నెలకొల్పాలని వెంకయ్య కోరారు. తననేం చేయమంటారని కురియన్ ప్రశ్నించారు. సభ సజావుగా సాగితేనే మాట్లాడుతానని వెంకయ్య చెప్పారు. బిజెపి సహకరిస్తే సభ్యులపై చర్యలు తీసుకుంటానని కురియన్ చెప్పారు.

సభ్యులు వెల్లోకి వచ్చారు. పరిస్థితి అదుపులో లేకపోవడంతో డిప్యూటీ చైర్మన్ కురియన్ సభను పదిహేను నిమిషాలపాటు వాయిదా వేశారు.

తిరిగి సభ ప్రారంభం కాగానే వెంకయ్య నాయుడు ప్రసంగించారు. బిల్లును వ్యతిరేకిస్తూ సభ్యులు వెల్లోకి వచ్చారు. సభ్యుల నిరసనల మధ్యనే ఆయన ప్రసంగించారు. ప్రసంగం మధ్యలో వెంకయ్య.. చిరంజీవి ఎందుకు నిలబడి నిరసన తెలుపుతున్నారన్నారు. సీమాంధ్రకు న్యాయం జరగడం లేదు కాబట్టే ఆయన నిరసన వ్యక్తం చేస్తున్నారన్నారు.

తెలంగాణకు తాము కట్టుబడి ఉన్నామని చెప్పారు. భద్రత, ఉపాధి, విద్య సహా పలు అంశాలపై సీమాంధ్ర ప్రజల్లో ఆందోళన ఉందన్నారు. అటార్నీ జనరల్ అభిప్రాయం తీసుకోవడంలో అబ్యంతరం లేదన్నారు. ప్రాంతాలను విభజించాలి కానీ ప్రజలను కాదన్నారు. హైదరాబాదులోని మిగులు ఆదాయాన్ని మిగతా ప్రాంతాలకు పంపిణీ చేయాలన్నారు. హైదరాబాదుతో కూడిన తెలంగాణకు బిజెపి కట్టుబడి ఉంది. రాజధానిని కోల్పోతున్న సీమాంధ్ర అభివృద్ధికి చేపట్టాల్సిన అంశాలపై స్పష్టత కావాలి.

ఉత్తర తెలంగాణ కూడా బాగా వెనుకబడి ఉంది. సీమాంధ్ర ప్ర్తాంతానికి ప్రత్యేక రైల్వే జోన్లు కేటాయించాలి. హైదరాబాదుతో కూడిన తెలంగాణకు మాత్రమే మిగులు రెవెన్యూ ఉంది. విశాఖ, విజయవాడ, తిరుపతి విమానాశ్రయాల స్థాయిని పెంచాలన్నారు. సీమాంధ్రకు పదివేల కోట్ల ఆర్థిక సాయం అందించాలి.

హైదరాబాదుకు సమాంతరంగా సీమాంధ్రలో విద్యాసంస్థలు, మౌలిక సదుపాయాల కల్పన కావాలి. సీమాంధ్రకు ప్రత్యేక రైల్వే జోన్లు కేటాయించాలి. హైదరాబాదు ఆదాయం ఇరు ప్రాంతాలకు కీలకంగా మారింది. తెలంగాణ ఇవ్వాలి, సీమాంధ్రకు న్యాయం చేయాలి ఇదే తమ డిమాండ్. 2004 నుండి తెలంగాణ విషయంలో కాంగ్రెసు లబ్ధి కోసం చూస్తోంది. కలిసి ఉంటే కలదు సుఖం అనేది నానుడి.. కానీ విడిపోయి కలిసుందాం.

అన్ని పార్టీలు తెలంగాణ విషయంలో మాట మార్చాయి. విభజన విషయంలో ప్రధాన ముద్దాయి కాంగ్రెసు పార్టీ. తెలంగాణ విషయంలో బిజెపి ఒక్కటే నిక్కచ్చిగా ఉంది. అధికార పార్టీ ఎంపీలు, మంత్రులే వెల్లోకి వెళ్లడమేమిటి. కాంగ్రెసు ద్వంద్వ ప్రమాణాలు అవలంభిస్తోంది. బిజెపిని విమర్శించే నైతిక హక్కు కాంగ్రెసుకు లేదు. ఇచ్చిన మాటకు కట్టుబడే లక్షణం కాంగ్రెసుకు లేదు. ఇరు ప్రాంతాల ప్రజలు సంతోషంగా ఉండాలి. మోడీ హైదరాబాదు సభలో జై తెలంగాణ, జై సీమాంధ్ర అన్నారు.

- సీతారాం ఏచూరి ప్రసంగం.... సమైక్యాంధ్ర మా విధానం. విభజన విషయంలో మాట మార్చామని వెంకయ్య తమను అనడం సరికాదు.

- చిరంజీవి ప్రసంగం....

ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లు (తెలంగాణ ముసాయిదా బిల్లు)పై కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి గురువారం రాజ్యసభలో ప్రసంగించారు. సభలో ఇది తన తొలి ప్రసంగమని, అందరూ సహకరించాలని చిరంజీవి కోరారు. చిరు ప్రసంగం సమయంలో కొంత వాగ్వాదం, గందరగోళం కనిపించింది. చిరు ప్రసంగిస్తుండగా సిఎం రమేష్ చిరంజీవి పైకి దూసుకు వచ్చారు. కాంగ్రెసు సభ్యులు అడ్డుకున్నారు.

నేను పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉన్నా. తెలుగు ప్రజల తరఫున మాట్లాడుతున్నా. విభజన అనేది పదకొండు కోట్ల మంది తెలుగు ప్రజలకు గుండెకోత వంటింది. విభజన విషయంలో అనుసరించిన వైఖరి దురదృష్టకరం. బాధతో, ఆవేశాలతో విడిపోకూడదు. నేను ఏ ఒక్క ప్రాంతం తరఫునో మాట్లాడటం లేదు.

కాంగ్రెసు పార్టీ ఒక్కటే విభజన విషయంలో నిర్ణయం తీసుకోలేదు. శ్రీకృష్ణ కమిటీ కూడా సమైక్యాంధ్రనే ఉత్తమమని చెప్పింది. లోకసభలో చర్చకు అవకాశం ఇవ్వకుండా బిల్లు పెట్టారు. టిడిపి, బిజెపి, వైయస్సార్ కాంగ్రెసు అన్ని పార్టీలు తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం చెప్పాయి.

తెలంగాణకు మద్దతుగా ఆఖరుగా నిర్ణయం తీసుకున్న పార్టీ కాంగ్రెసు మాత్రమే. లోకసభలో బిల్లు ప్రవేశ పెట్టిన తీరు విచారకరం. మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పార్టీ తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటానని చెప్పారు. తెలంగాణకు అనుకూలంగా టిడిపి, బిజెపి, వైయస్సార్ కాంగ్రెసు, తెరాస అన్ని పార్టీలు నిర్ణయం తీసుకున్నాయి. ఆర్టికల్ 3 ప్రకారం విభజించాలని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ చెప్పింది.

టిడిపి చెబుతున్న సమన్యాయం అంటే ఏమిటి. హైదరాబాదుతో సీమాంధ్ర ప్రయోజనాలు ముడివడి ఉన్నాయి. హైదరాబాదును ఛండీగఢ్ తరహా యూటి చేయాలి. జనాభా నిష్పత్తి ప్రకారం మిగులు ఆదాయం సీమాంధ్రకు కేటాయించాలి. ఉత్తరాంధ్, సీమ ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలి. సీమాంధ్రకు ప్రత్యేక హోదా ఇవ్వాలి. అనంతపురం, కర్నూలు జిల్లాలను తెలంగాణలో కలపాలి.

చిరు వర్సెస్ వెంకయ్య అండ్ జైట్లీ

చిరంజీవి మాట్లాడుతుండగా అరుణ్ జైట్లీ లేచి.. చిరు పదవికి రాజీనామా చేసి మాట్లాడలన్నారు. కాంగ్రెసు నాయకుడిగా మాట్లాడారా లేక ప్రభుత్వ హోదాతో మాట్లాడారో చెప్పాలన్నారు. మంత్రివర్గం ఆమోదం తెలిపిన విషయాన్ని గుర్తు చేశారు.

వెంకయ్య నాయుడు మాట్లాడుతూ.. చిరంజీవి మంచి యాక్టర్ అన్నారు. దానిపై సభలో కొంత గందరగోళం చెలరేగింది. దానికి వెంకయ్య సమాధానంగా తన ఉద్దేశ్యం ఇక్కడ నటిస్తున్నాడని కాదని, ఎపిలో మంచి యాక్టర్ అని, తామిద్దరం మంచి మిత్రులమని అన్నారు. చిరు తన అభ్యంతరాలను పార్టీ వేదికలపై చెప్పాలన్నారు. బిజెపి నేతల వ్యాఖ్యలకు సమాధానంగా చిరు మాట్లాడుతూ... తాను ప్రజల తరఫున మాట్లాడుతున్నానని చెప్పారు.

మాయావతి ప్రసంగంలో...

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయడం సంతోషకరం. సీమాంధ్రతో పాటు తెలంగాణకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలి. రాష్ట్రాలకు ప్యాకేజీ ఇచ్చేటప్పుడు కేంద్రం సమదృష్టితో చూడాలి. చిన్న రాష్ట్రాలతో అభివృద్ధి అని అంబేడ్కర్ చెప్పారు. బీహార్, యూపి, మధ్యప్రదేశ్‌లను విభజించినప్పుడు తలెత్తిన సమస్యలు సమసిపోయాయి. హైదరాబాదును రాజధాని చేయడం సరైన పరిష్కారం కాదు. ప్రత్యేక విదర్భ డిమాండును పరిశీలించాలి. చిన్న రాష్ట్రాలు అయితే పాలన, ప్రభుత్వం ప్రజలకు అందుబాటులో ఉంటాయి. ఉత్తరాఖండ్ ఇచ్చినా యూపిలో మరో నాలుగు రాష్ట్రాలు ఏర్పాటు చేయొచ్చు. కాగా, మాయావతి మాట్లాడుతున్నంత సేపు విపక్ష సభ్యులు నో నో అంటూ నినాదాలు చేశారు.

సీతారాం ఏచూరి ప్రసంగంలో...

విశాలాంధ్ర కోసం పోరాడిన ప్రాంతం ఎపి. తొలి భాషాప్రయుక్త రాష్ట్రంగా స్ఫూర్తి కలిగించిన రాష్ట్రం ఎపి. ఎపి విభజనను వ్యతిరేకిస్తున్నాం. కాంగ్రెసు, బిజెపిలు మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకొని విభజనకు సిద్ధపడ్డాయి. ప్రత్యేకాంధ్ర ఉద్యమం సమయంలో నేను రెండేళ్లు చదువును కోల్పోయా. కేంద్రం తీసుకున్న నిర్ణయం పర్యవసనం, తీవ్రతను గుర్తించాలి.

ఇతర సభ్యులు...

ఫైనాన్షియల్ మెమోరాండం వివరాలు బిల్లులో లేవని జెడి(యు) ఎంపి ఎన్‌కె సింగ్ అన్నారు. బీహార్ లాంటి రాష్ట్రాలకు అర్హత ఉన్నా ప్రత్యేక హోదా ఇవ్వట్లేదు. రాజకీయ కారణాలతో నిర్ణయాలు తీసుకోకూడదు. రఘురాణ రాజు కమిటీ నివేదికను కేంద్రం పక్కన పెట్టింది. రాజ్యాంగ వ్యతిరేకంగా ఉన్న బిల్లును వ్యతిరేకిస్తున్నానని టిడిపి ఎంపి సీమాంధ్ర రమేష్ అన్నారు. విభజనలో ఎపి అసెంబ్లీ తీర్మానాన్ని పరిగణలోకి తీసుకోలేదు. రెండు ప్రాంతాలు అభివృద్ధి చెందాలని తాను కోరుకుంటున్నానని ఎన్సీపి ఎంపి జనార్ధన్ అన్నారు.

ప్రకాశ్ జవదేకర్ ప్రసంగంలో...

తెలంగాణ ఏర్పాటు, సీమాంధ్రకు న్యాయం అనేవి పరస్పరం విరుద్ధమైనవి కావు. హైదరాబాద్ తెలంగాణదే. ప్రధానమంత్రి గారు... మీ ముఖ్యమంత్రి గారే మీ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. యువకుల ఆత్మహత్యలకు కాంగ్రెసు పార్టీయే కారణం.

స్పృహతప్పి పడ్డ కెవిపి

తెలంగాణ బిల్లుపై చర్చ జరుగుతున్న సమయంలో కెవిపి రామచంద్ర రావు కుప్పకూలిపోయారు. ఆయన స్పృహతప్పి పడిపోవడంతో డిప్యూటీ చైర్మన్ కురియన్ ఆసుపత్రికి తరలించాలని సూచించారు.

విహెచ్ ప్రసంగంలో...

ఎన్డీయే ఏర్పాటు చేసిన రాష్ట్రాలు చాలా చిన్నవి. తెలంగాణకు ఆది నుండి అన్యాయం జరుగుతోంది. ఎన్డీయే ఏర్పాటు చేసిన రాష్ట్రాలతో తెలంగాణను పోల్చలేదు. సీమాంధ్ర ప్రజలకు మేం రక్షణగా ఉంటాం. అన్ని పార్టీలు తెలంగాణకు అంగీకరించి ఇప్పుడు వెనక్కి వెళ్లాయి. విద్య, ఉద్యోగాలు, నీళ్ల విషయంలో తెలంగాణకు అన్యాయం. ఒక ఓటు రెండు రాష్ట్రాలు అని చెప్పిన వాళ్లు ఆ పని చేయలేదు.

బిజెడి ఎంపీ బెహరా ప్రసంగంలో...

సీమాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వడానికి మాకు అభ్యంతరం లేదు. బిల్లు పెట్టే విషయంలో ప్రభుత్వం సరిగా వ్యవహరించలేదు. రఘురామ రాజన్ చెప్పిన ఏడు వెనుకబడిన రాష్ట్రాలకు ప్రత్యేక ప్యాకేజీ ఎందుకు ఇవ్వడం లేదు.

దేవేందర్ గౌడ్ ప్రసంగంలో...

రెండు ప్రాంతాలకు న్యాయం జరగాలన్నదే తమ విధానం. తెలంగాణకు తాము అనుకూలం. సీమాంధ్ర సమస్యలు పరిష్కరించాలి. రెండు ప్రాంతాలకు న్యాయం మా విధానం.

గుండు సుధారాణి ప్రసంగంలో...

పోలవరం డిజైన్‌ను మార్చాలి. యువకుల త్యాగాల ఫలితమే తెలంగాణ బిల్లు. తెలంగాణ కోసం నిరవధిక నిరాహార దీక్షతో నేను జైలుకు వెళ్లా. విభజన బిల్లుకు మా మద్దతు. తెలంగాణకు న్యాయం చేసేందుకు పింఛన్లు స్థానికత ఆధారంగా ఇవ్వాలి. ఉద్యోగులు ఎక్కడి వారు అక్కడే అనే క్లాజు సరికాదు. ఉద్యోగులు సృష్టించి అయినా మార్చాలి. నాలుగున్నర కోట్ల ప్రజల చిరకాల ఆకాంక్ష తెలంగాణ.

సిపిఐ నేత రాజా...

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మా మద్దతు. విభజన చాలా సున్నితమైన సమస్య. కేంద్రం తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతాల్లో కల్లోలం రేపింది. విభజన విషయంలో కేంద్రం సరిగా వ్యవహరించలేదు. సీమాంధ్ర కొత్త రాజధానికి కేంద్రం నిధులు ఇవ్వాలి. విభజన సమస్యను సున్నితంగా పరిష్కరించాలి.

రాపోలు ఆనంద భాస్కర్....

తెలంగాణ ఇచ్చిన సోనియాను ప్రజలు తెలంగాణ మాతగా గుర్తిస్తున్నారన్నారు. సుష్మా స్వరాజ్‌ను కూడా గుర్తిస్తున్నారన్నారు. తెలంగాణ ఏర్పాటులో సుష్మాస్వరాజ్ పాత్ర విస్మరించలేదనిదన్నారు. తెలంగాణ భారత్‌లో 29వ రాష్ట్రమన్నారు. తెలంగాణకు ఆది నుండి అండగా ఉన్న మాయావతికి ప్రత్యేక కృతజ్ఞతలు అన్నారు.

ఎజిపి ఎంపి బీరేంద్ర ప్రసాద్...

తెలంగాణ బిల్లును వ్యతిరేకిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్‌లో గందరగోళానికి కాంగ్రెసు పార్టీయే కారణం. అసెంబ్లీ తిరస్కరించిన బిల్లును ఎలా ప్రవేశపెట్టి ఆమోదిస్తారు. ఎపి అసెంబ్లీని విశ్వాసంలోకి తీసుకోలేదు. ఈ బిల్లు కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పైనే ప్రభావం చూపదు. సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా కేంద్రం వ్యవహరిస్తోంది. కేంద్రం ఎపికి హాని చేస్దోంది.

సుజనా చౌదరి...

తెలంగాణ ముసాయిదా బిల్లు ప్రజాస్వామ్య విరుద్ధమైంది. ఎంతో ఆవేదనతో ఈ బిల్లుపై మాట్లాడవలసి వస్తోంది. ఎన్నికల ముందు ఈ బిల్లు పెట్టడమేమిటి. పదేళ్లు అధికారంలో ఉన్న కేంద్రం ఇన్నాళ్లు ఏం చేసింది. ఓ పక్క వైయస్సార్ కాంగ్రెసు, మరోపక్క తెలంగాణను విలీనం చేసుకోవడానికి కాంగ్రెసు సిద్ధపడుతోంది. కాంగ్రెసు పార్టీ సొంత నేతల మధ్యనే ఏకాభిప్రాయం తేలేకపోయింది. లోకసభలో సీమాంధ్ర ఎంపీలను బహిష్కరించి ప్రజాస్వామ్య విరుద్ధంగా ఆమోదించారు.

తెలంగాణ వెనుకబడలేదని శ్రీకృష్ణ కమిటీ చెప్పింది. రాష్ట్ర శాసన సభ బిల్లును తిరస్కరించింది. బిల్లు అన్యాయం, అక్రమం, అప్రజాస్వామికం. ఎన్నికల సమయంలో రాజకీయ లబ్ధి కోసం తీసుకున్న నిర్ణయం. తమతో కలిసే వారితోనే కేంద్రం మాట్లాడుతోంది. రాజ్యాంగ పదవుల్లో ఉన్న వారు కాంగ్రెసు ఏజెంట్లుగా వ్యవహరిస్తున్నారు. గందరగోళం మధ్య బిల్లు ఆమోదించొద్దు.

ప్రజాస్వామ్య దేశం అనే పేరుకు కాంగ్రెసు తీరు అపఖ్యాతి తీసుకు వస్తోంది. ఎవర్నో విమర్శించాలని నా ఉద్దేశ్యం కాదు. తెలుగు ప్రజల ఆవేదనను చెబుతున్నా. ఇరు ప్రాంతాల్లో జెఏసిలను, ప్రజా సంఘాలను కూర్చోబెట్టి మాట్లాడలేదు.

సుజనా చౌదరి మాట్లాడుతుండగా గొంతు ఎండిపోయినట్లు, తడపడుతూ మాట్లాడారు. దీంతో డిప్యూటీ చైర్మన్ ఆయనను ఉద్దేశించి.. కొద్దిగా నీళ్లు ఇవ్వండని సూచించారు.

ఎంఏ ఖాన్...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ సభ్యుడు మహ్మద్ అలీ ఖాన్ రాజ్యసభలో రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లుపై జరిగిన చర్చలో మాట్లాడారు. విభజన నిర్ణయానికి మద్దతు ఇస్తున్నట్లు ఎంఏ ఖాన్ చెప్పారు. తెలంగాణ ప్రాంతంలో సీమాంధ్రులకు తగిన గౌరవం లభించేటట్లు చూడాలని ఆయన అన్నారు. సీమాంధ్ర ప్రాంతానికి అవసరమైన ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని ఆయన తెలిపారు.

రామ్ విలాస్ పాశ్వాన్...

తెలంగాణ బిల్లుకు మద్దతిస్తున్నా.

అరుణ్ జైట్లీ...

1996 నుంచి తెలంగాణ ఏర్పాటుకు మద్దతిస్తున్నాం. ఇప్పటి వరకు సీమాంధ్ర ప్రజలకు న్యాయం చేయలేకపోయాం. సీమాంధ్ర ప్రజలు మనపై ఎంతో నమ్మకంతో ఉన్నారు. విభజన విషయంలో యూపిఏ తీరు సరికాదు. ఎన్డీయే హయాంలో విభజన జరిగినప్పుడు రెండు ప్రాంతాల్లో సంబరాలు చేసుకున్నారు. తెలంగాణకు అనుకూలం.. యూపిఏ తీరుకు వ్యతిరేకం. పదేళ్లుగా కాంగ్రెసు పార్టీ తెలంగాణ విషయంలో ఏం కసరత్తు చేసింది.

కపిల్ సిబాల్...

గవర్నర్‌కు అధఇకారాల అప్పగింతపై అరుణ్ జైట్లీ లేవనెత్తిన సందేహాలకు రాజ్యాంగంలోని 3, 4 అధికరణలు వాటిని నివృత్తి చేస్తాయి. గవర్నర్‌కు ప్రత్యేక అధికారాలు కాదు, అదనపు బాధ్యతలు మాత్రమే ఇస్తున్నాం. గవర్నర్ అదనపు అధికారాలు నిర్వర్తించడం రాజ్యాంగంలో ఉంది. దానికి జైట్లీ స్పందిస్తూ.. గవర్నర్ కేంద్రం నియమించిన వ్యక్తి అని, ఆయన చేతిలో శాంతిభద్రతలు ఎలా పెడతారన్నారు. హైదరాబాద్ రాష్ట్రం కిందకు వస్తాయా లేదా చెప్పాలన్నారు.

సవరణల పైన మూజువాణి ఓటింగ్ ద్వారా డిప్యూటీ స్పీకర్ ఓటింగ్ నిర్వహించారు. బిల్లుపై ఓటింగ్ సమయంలో గందరగోళం చెలరేగడంతో ఎవరి స్థానాల్లో వారు కూర్చుంటే ఓటింగ్ నిర్వహిస్తానని కురియన్ చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+