పెరిగిన దూకుడు: రాష్ట్రపతికి చేరిన తెలంగాణ బిల్లు
న్యూఢిల్లీ: రాష్ట్ర పునర్వ్యస్థీకరణ బిల్లు శుక్రవారం రాత్రి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి చేరింది. కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన 24 గంటల్లో బిల్లు రాష్ట్రపతి భవన్‌కు చేరింది. కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే శుక్రవారం సాయంత్రం 'ఆంధ్రప్రదేశ్ పునర్యవస్థీకరణ బిల్లు' ముసాయిదాను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పరిశీలనకు పంపించారు. బిల్లు ప్రతి, కేబినెట్ నోట్, జీవోఎం నివేదికతోపాటు హోం శాఖ నోట్, న్యాయ నిపుణుల అభిప్రాయాలను కూడా రాష్ట్రపతికి పంపినట్లు తెలిసింది.
ప్రస్తుతం కోల్‌కతాలో ఉన్న రాష్ట్రపతి సోమవారం ఢిల్లీకి తిరిగి వస్తారు. ఆయన కనీసం రెండు మూడు రోజులు ఈ బిల్లును పరిశీలిస్తారని అంటున్నారు. ఆయన న్యాయ నిపుణులతో చర్చించే అవకాశం ఉందని చెబుతున్నారు. ఆర్టికల్ 371(డి)లో ఏ మార్పు చేసినా రాజ్యాంగ సవరణ చేయాల్సిందేనని అటార్నీ జనరల్ వాహనావతి, లోక్‌సభ మాజీ సెక్రటరీ జనరల్ విశ్వనాథన్ ఇంతకు ముందు చెప్పారు. అయితే ఆ అవసరంలేదని, సాధారణ మెజారిటీతో బిల్లును ఆమోదించవచ్చునని జీవోఎం అభిప్రాయపడింది. దీనిపై రాష్ట్రపతి న్యాయపరిశీలన కోరే అవకాశాలున్నట్లు చెబుతున్నారు.

ముసాయిదా బిల్లు పరిశీలనకు రాష్ట్రపతి ఎంత సమయం తీసుకుంటారు, అభిప్రాయం తెలిపేందుకు అసెంబ్లీకి ఎంత గడువు ఇస్తారనే అంశాలను బట్టి అది పార్లమెంటు ముందుకు వచ్చే సమయం ఆధారపడి ఉంటుంది. కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ దిగ్విజయ్ సింగ్ ఇదే మాట చెప్పారు. అసెంబ్లీకి ఎంత గడువు ఇవ్వాలనే అంశాన్ని ఆర్టికల్ 3లో పొందుపరచలేదు. "నిర్దేశించిన సమయంలోగా బిల్లుపై అసెంబ్లీ తన అభిప్రాయాన్ని చెప్పాలి. గడువు పూర్తయ్యేలోపు చెప్పకపోయినా చెప్పినట్లుగానే భావించవచ్చు'' అని రాజ్యాంగం చెబుతోంది.
గతంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లును అసెంబ్లీ పరిశీలించేందుకు రాష్ట్రపతి 69 రోజులు గడువు ఇచ్చారు. బీహార్ అసెంబ్లీకి 40 రోజులు, మధ్యప్రదేశ్‌కు 40 రోజులు గడువు ఇచ్చారు. బాంబే బిల్లు విషయంలో 20 రోజులే ఇచ్చారు.












Click it and Unblock the Notifications