హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణ: బీజేపీ అధ్యక్షుడి కుమారుడిపై క్రిమినల్ కేసు- 'ఇది రాజకీయ ప్రతీకార చర్య' అని ఆరోపించిన బండి సంజయ్

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథ్ మీద పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. ఒక విద్యార్థిపై భౌతికంగా దాడికి పాల్పడ్డాడనే ఆరోపణలతో ఐపీసీ సెక్షన్ 323, 341, 541, 506 సెక్షన్ల కింద ఈ కేసు నమోదైంది.

మంగళవారం నాడు వెలుగులోకి వచ్చిన ఒక వీడియో ఆధారంగా పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. హైదరాబాద్ శివార్లలోని ఒక ప్రైవేట్ యూనివర్సిటీలో భగీరథ్ బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు.

ఆ వీడియోలో సాయి భగీరథ్ ఒక అబ్బాయిని కొడుతూ తిడుతున్న దృశ్యాలు ఉన్నాయి. భగీరథ్ కొట్టిన అబ్బాయి పేరు శ్రీరామ్ అని తెలుస్తోంది.

ఈ వీడియోను బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు కూడా సోషల్ మీడియాలో షేర్ చేశారు.

'బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథ్, ర్యాగింగ్ పేరిట గూండాయిజం చేస్తున్నాడు. రాయలేని భాషలో తిట్టడంతోపాటు స్నేహితులతో కలిసి కొట్టడంతో విద్యార్థికి తీవ్రగాయాలు అయ్యాయి. హైదరాబాద్‌లోని మహీంద్రా యూనివర్సిటీలో ఈ ఘటన జరిగింది’ అంటూ బీఆర్‌ఎస్ నేత వై.సతీశ్ రెడ్డి పోస్ట్ చేశారు.

https://twitter.com/ysathishreddy/status/1615328096089165825?s=21

వీడియోలో ఏముంది?

వైరల్ అయిన ఆ వీడియోలో శ్రీరామ్ అని చెబుతున్న విద్యార్థిని బండి సాయి భగీరథ్ కొడుతూ కనిపించాడు. 'చేస్తవా ఫోను...’ అంటూ అరిచాడు.

మధ్యలో సాయి భగీరథ్ స్నేహితుడు అని చెబుతున్న మరొక విద్యార్థి వచ్చి శ్రీరామ్‌ను కొట్టాడు.

ఆ తరువాత సాయి భగీరథ్, బూతులు తిడుతూ కనిపించాడు.

దుండిగల్‌లోని మహీంద్రా యూనివర్సిటీలో ఈ ఘటన జరిగినట్లుగా తెలుస్తోంది.

వీడియో పాతదా?

'బండి సాయి భగీరథ్ కొట్టిన విద్యార్థి ఇప్పుడు ఆసుపత్రిలో ఉన్నాడు’ అంటూ బీఆర్ఎస్ నాయకుడు సతీశ్ రెడ్డి ఆ వీడియోను ట్వీట్ చేశారు.

బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కూడా ఆయన ట్యాగ్ చేశారు.

కానీ సాయి భగీరథ్ చేతిలో దెబ్బలు తిన్నాడని చెబుతున్న శ్రీరామ్ అనే విద్యార్థి పేరుతో మరొక వీడియో కూడా సోషల్ మీడియాలో కనిపిస్తోంది.

ఒక అమ్మాయితో తను తప్పుగా ప్రవర్తించడం వల్లే భగీరథ్ కొట్టాడని, శ్రీరామ్ అని చెబుతున్న విద్యార్థి అన్నాడు.

'నా పేరు శ్రీరామ్.

నేను భగీరథ్ ఫ్రెండ్ వాళ్ల చెల్లికి రాత్రి 4 గంటలకు ఫోన్ చేసి లవ్ చేయమని అడిగాను. ఆ అమ్మాయితో మిస్ బిహేవ్ చేశాను.

ఆ అమ్మాయికి కాల్ చేశాను, మెసేజులు చేశాను.

ఈ విషయం భగీరథ్‌కు తెలిసి వచ్చి నాతో మాట్లాడాడు. కానీ నేను కాస్త ఎక్కువ తక్కువ మాట్లాడటంతో భగీరథ్ నన్ను కొట్టాడు.

ఆ తరువాత జరిగిందేదో జరిగిందని మేం కలిసే ఉంటున్నాం. మా మధ్య ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు. మేం ఫ్రెండ్సే... మేం బ్యాచ్‌మేట్సే...

అయిపోయిందేదో అయిపోయింది... ఇప్పుడు ఆ వీడియో ఒక యూజ్‌లెస్ థింగ్. ఇప్పుడు మేం మంచిగానే ఉంటున్నాం.

ఆ వీడియో మా మధ్య విభేదాలు పెంచడానికి తప్ప మరి దేనికీ పనికిరాదు. ఇప్పుడు మేమంతా బాగానే ఉంటున్నాం’ అని ఆ వీడియోలు శ్రీరామ్ చెబుతూ కనిపించాడు.

అయితే అటు సాయి భగీరథ్ కొడుతున్న వీడియో కానీ ఇటు శ్రీరామ్ మాట్లాడిన వీడియో కానీ అవి ఎప్పటివో స్పష్టంగా తెలియడం లేదు.

సాయి భగీరథ్ కొట్టిన ఘటన పోయిన ఏడాది జరిగినట్లుగా చెబుతున్నారు.

https://twitter.com/krishanKTRS/status/1615431962315063296

మరో వీడియో

ఇదిలా ఉంటే, టీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ ఎం. కృశాంక్, ఇది కూడా భగీరథలాగే ఉందంటూ ట్వీట్ చేసిన మరో వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది.

బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కుమారుడిలాగే కనిపిస్తున్న వ్యక్తి చెలరేగిపోతున్నాడు అనే వ్యాఖ్యతో కృశాంక్ ఈ వీడియో షేర్ చేశారు.

ఈ వీడియోలో భగీరథగా భావిస్తున్న యువకుడు తన మిత్రులతో కలసి మరొక విద్యార్థిని కొడుతున్న దృశ్యాలున్నాయి.

బండి సంజయ్

రాజకీయ ప్రతీకారమే - బండి సంజయ్

మహీంద్రా యూనివర్సిటీలో జరిగినట్లుగా చెబుతున్న ఘటన మీద దుండిగల్ పోలీసులు కేసు నమోదు చేశారు.

తన కొడుకు మీద పోలీసులు కేసు పెట్టారని బండి సంజయ్ కూడా అన్నారు.

'పిల్లల భవిష్యత్తును నాశనం చేస్తారా?' అని ప్రశ్నిస్తూ, రాజకీయంగా ఎదుర్కొనలేక కేసీఆర్ తన కొడుకు మీద కేసు పెట్టారని ఆయన ఆరోపించారు.

'చిన్నపిల్లల జోలికి వస్తే ఊరుకోను. చిన్న పిల్లలు, కుటుంబసభ్యులను ఉపయోగించుకోవద్దు. నీ(కేసీఆర్) మనుమడిని కామెంట్ చేస్తే నేను ఖండించాను. ఎప్పుడో జరిగినదాన్ని తీసుకొచ్చి ఇవాళ నా కొడుకు మీద నాన్ బెయిలబుల్ కేసు పెట్టారు. ఆ అబ్బాయి కూడా వీడియో పెట్టాడు. పిల్లలు పిల్లలు కొట్టుకుంటారు. మళ్లీ కలుస్తారు. కేసు పెట్టించాల్సిన అవసరం ఏముంది? ఎవరు ఫిర్యాదు చేశారు?' అని సంజయ్ ప్రశ్నించారు.

బీజేపీ సమావేశాల కోసం దిల్లీకి వెళ్లిన బండి సంజయ్, "యాదాద్రి మీద కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను, హైదరాబాద్‌కు నిజాం మనుమడి మృతదేహాన్ని తీసుకురావడం మీద ప్రజల దృష్టి మళ్లించేందుకే ఇలా చేశారు" అని విమర్శించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Telangana: Criminal case against BJP president's son- 'It's an act of political revenge', says Bandi Sanjay
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X