వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణ: జగిత్యాల, కాళేశ్వరంలలో చేపల వర్షం కురిసిందా? రోడ్లపైకి చేపలు ఎక్కడి నుంచి వచ్చాయి?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews

ఇటీవల భారీ వర్షాల సందర్భంగా తెలంగాణలోని జగిత్యాల, కాళేశ్వరం, వైరా(ఖమ్మం)లలో చేపల వాన కురిసినట్లు వార్తలు వచ్చాయి.

దీనికి సంబంధించి సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు వైరల్ అయ్యాయి. నేలపై పాకుతున్న చేపలు ఈ వీడియోల్లో కనిపించాయి.

fish

కొంతమంది స్థానికులు చేపలను కుప్పలుగా పోగేసి బేసిన్లు, బకెట్లలో ఇళ్లకు పట్టుకుపోయిన దృశ్యాలు ఆ వీడియోల్లో ఉన్నాయి.

ఆరోజు ఏం జరిగింది?

జులై 4న జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో, జులై 9న జగిత్యాల జిల్లా కేంద్రంలోని సాయినగర్ కాలనీలో చేపలు రోడ్లపై కనిపించాయి. దీంతో చేపల వర్షం పడిందన్న వార్తలు మీడియాలో వచ్చాయి.

అయితే ఆకాశం నుంచి వర్షంలా చేపలు పడినట్లు ప్రత్యక్షంగా చూసినవారు ఎవరూ లేరు. స్థానికులు మాత్రం తమ పరిసరాల్లో కనిపించిన చేపలను పట్టుకున్నారు.

''జులై 4న ఉదయం లేచేసరికి వింత చేపలు మా ఇంటి ముందు, పక్కనే ఉన్న పొలాల్లో కనిపించాయి. వాటిని తీసి ఒడ్డున వేశాం. నీటి నుండి బయటకు తీసిన తర్వాత రెండు గంటలు అవి బతికే ఉన్నాయి. ఆ చేపల మొప్పల దగ్గర ముళ్లు కనిపించాయి. చాలా మంది వాటి వీడియోలు తీశారు. ఈ ప్రాంతంలో చెరువులు కూడా ఉన్నాయి. అయితే ఇలాంటి చేపలను ఎప్పుడూ చూడలేదు''అని కాళేశ్వరానికి చెందిన సమ్మయ్య అన్నారు.

జగిత్యాల సాయినగర్ రోడ్ నంబర్-1 కాలనీకి చెందిన రమేశ్.. జులై 9న కూడా ఇలాంటి దృశ్యాలనే చూశారు.

''రెండు రోజులుగా భారీ వర్షం కురిసింది. వర్షం ఆగిపోయాక బయటకు వచ్చి చూస్తే రోడ్డుపై చేపలు కనిపించాయి. ఇలాంటి చేపలు ఎప్పుడూ చూడలేదు. రెక్కలు, మొప్పల నిండా ముళ్లతో వింతగా కనిపించాయి'' అని ఆయన చెప్పారు.

ఈ రెండు ప్రాంతాల్లోనూ చేపలు పైనుంచి వర్షంలా పడినట్లుగా ఎవరూ చెప్పలేదు.

అధికారులు ఏమంటున్నారు?

చేపల వాన వార్తలపై కరీంనగర్ జిల్లా మత్స్య శాఖ అధికారులను బీబీసీ సంప్రదించింది. కాళేశ్వరం, జగిత్యాల, వైరా ఘటనలపై వివరణ కోరింది.

ఆ ప్రాంతాల్లో చేపల వాన కురిసిందన్న వార్తలను వారు ఖండించారు.

''చేపల వర్షం అంటూ ఉండదు. ఎండకు తట్టుకోలేక కొన్ని రకాల చేపలు బురద లోపలికి వెళ్లిపోతాయి. అప్పుడు వాటి శరీరంలోని గ్లైకోజన్ గ్లూకోజ్‌గా మారి అది జీవించి ఉంటుంది. వర్షాలు పడినప్పుడు బురదలో కొత్త నీరుకు ఇవి ఎదురీదుతాయి. ఆ సమయంలో పిట్యూటరీ గ్రంథి ప్రభావంతో హార్మోన్ మార్పుల వల్ల ఇవి నీటి ప్రవాహాలకు ఎదురీదుతూ చాలా దూరం చేరుకుంటాయి. ఇలా అవి ఇళ్ల మధ్య, పొలాల్లో కనిపించే సరికి చేపల వర్షం కురిసిందని సాధారణంగా భ్రమిస్తుంటారు''అని కరీంనగర్ మత్స్య శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ దేవేందర్ బీబీసీకి తెలిపారు.

''జగిత్యాలలో రోడ్లపై కనిపించిన చేపలను స్థానికంగా 'బండ పాకురు' రకం అని పిలుస్తారు. ఇది ఇక్కడ అరుదైన రకం చేప. ఇప్పుడు ఎక్కువగా దొరకడం లేదు. రిజర్వాయర్ల ద్వారా కెనాల్ ప్రవాహంలో ఆ ప్రాంతానికి ఎప్పుడో వచ్చి ఉండవచ్చు. కాళేశ్వరంలో కనిపించిన చేప 'తిలాపియా' రకానికి చెందింది. దీని శరీరంపై ముళ్ల వంటి నిర్మాణం ఉంటుంది. ముళ్లతో గాయాలవుతాయన్న భయంతో దీని దగ్గరకు ఇతర రకాల చేపలు రావు. ఇవి నలుపు, తెలుపు రంగులతో పాటు మచ్చలను కలిగి ఉంటాయి. స్థానికంగా వీటిని 'బురక చేపలు' అని పిలుస్తారు. వీటిని ఈ మధ్య కాలంలో ఎక్కువగా హోటళ్లలో 'అపోలో ఫిష్' వంటకంగా అమ్ముతున్నారు. ఈ చేప అధిక ప్రోటీన్లను కలిగి ఉంటుంది''అని దేవేందర్ వివరించారు.

గతంలోనూ వార్తలు

గతంలో కొన్నిసార్లు వాతావరణ కాలుష్యం వల్ల అక్కడక్కడా ఎరుపు, పసుపు రంగులో వాన కురిసిందన్న వార్తలు చూశాం. మరోవైపు చేపల వానకు సంబంధించి గతంలోనూ వార్తలు వచ్చాయి.

థాయిలాండ్, ఆస్ట్రేలియా, సింగపూర్, శ్రీలంక తదితర దేశాల్లోనూ ఇలాంటి వార్తలు వచ్చాయి.

భారత్‌లోనూ 2013లో కేరళలోని కందనసేరి, 2009లో గుజరాత్‌లోని జామ్‌నగర్ ప్రాంతంలో ఇలా చేపలు వర్షంతోపాటు కురిసినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి.

నిపుణులు ఏం చెబుతున్నారు?

చేపల వాన వార్తలపై జీవశాస్త్ర, వాతావరణ పరిశోధకులతోనూ బీబీసీ మాట్లాడింది.

ఈ అంశంపై వరంగల్ కాకతీయ యూనివర్సిటీ జీవశాస్త్ర ప్రొఫెసర్ డాక్టర్ ఇస్తారి మాట్లాడుతూ.. '' చేపల వర్షం పడాలంటే.. మొదట చేపలు మేఘాల్లో ఉండాలి. అవి అక్కడి నుంచి కిందకు రావాలి. మేఘాల్లో చేపలు నివసించే ఆస్కారం, అవకాశం లేదు. ఇది అపోహ మాత్రమే. నీటిలోని చేపలకు ఎగిరే లక్షణం ఉంటుంది. నీటిలో ఆక్సిజన్ స్థాయిలు పడిపోయినప్పుడు, ఫ్యాక్టరీ రసాయనాలు ఆ నీటీలో కలిసినప్పుడు, వాటి సంఖ్య పెరిగిపోయినప్పుడు చేపలు బయటకు రావడానికి ప్రయత్నిస్తుంటాయి. అలా రోడ్డుపైకి వస్తాయి. వర్షాకాలంలో ఇది కాస్త ఎక్కువ అవుతుంది. అందుకే మనకు రోడ్లపై, పొలాల్లో చేపలు కనిపిస్తుంటాయి''అని అన్నారు.

''కొలనులు, చెరువులు, కాలువలు ఉన్న ప్రాంతంలో మాత్రమే ఇలాంటి వార్తలు వస్తాయి. వేరే ప్రాంతంలో కనబడవు. వాటర్ స్ప్రవుట్స్, టోర్నడోలు, హరికేన్స్ సమయంలో నీటితో పాటు పైకి లేచిన చేపలు కొద్ది దూరం వెళ్లి అక్కడ కిందకు పడిపోతాయి. ఆ సమయంలో సాధారణంగా వర్షం ఉంటుంది కాబట్టి వర్షంతో పాటూ అవి పడ్డాయని భావిస్తారు. అంత ఎత్తులో నుండి చేపలు పడితే బతికే అవకాశాలు తక్కువ. చేపల వాన పడిందని చెప్పే ప్రాంతాల్లో గమనిస్తే అక్కడి చేపలన్నీ బతికే ఉంటాయి. నిజంగా అవి మేఘాల నుండి వర్షంతోపాటూ పడి ఉంటే చనిపోయి ఉండాలి''అని ప్రొఫెసర్ ఇస్తారి వివరించారు.

విశాఖ ఆంధ్రా యూనివర్సిటీ జీవశాస్త్ర ప్రొఫెసర్ మంజులత ఈ అంశం పై మాట్లాడుతూ.. ''ప్రాజెక్టులు, చెరువులు లాంటి నీటి వనరుల దగ్గర వాటర్ స్ప్రవుట్‌ల రూపంలో టోర్నడోలు ఏర్పడినప్పుడు చేపలు నీటితోపాటు లేచి దూరంగా పడతాయి. చేపలుపై నుండి పడడంతో దాన్ని చేపల వర్షంగా అనుకుంటారు''అని ఆమె అన్నారు.

''టింకింగ్ మోషన్ వల్ల ఇలా జరుగుతుంటుంది. సాధారణంగా నీరు, నేల మీద బలమైన గాలులతో సుడిగుండాలు లాంటివి ఏర్పడతాయి. నీటి మీద ఏర్పడితే వాటర్ స్ప్రవుట్స్ అని, నేల మీద అయితే డస్ట్ స్ప్రవుట్స్ అని పిలుస్తారు. ఇలా ఏర్పడ్డ స్ప్రవుట్స్ సాధారణంగా మూడు కిలో మీటర్ల దూరం వరకు కూడా ప్రయాణిస్తాయి. ఆ సమయంలో ఉండే ఒత్తిడి వల్ల చేపలు కూడా నీటితో పైకి లేస్తాయి. ఒత్తిడి తగ్గినప్పుడు మళ్లీ కిందకు పడిపోతాయి. దీంతో అది చేపల వర్షం అని అనుకుంటారు. మేఘాల్లో చేపలు ఉండటం లాంటివి జరగదు''అని ఆంధ్రా యూనివర్సిటీ వాతావరణ శాఖ ప్రొఫెసర్ సునీత చెప్పారు.

చేపలే కాదు.. కప్పలు, టమాటాలు, బొగ్గులు, కీటకాలు పైనుంచి పడినట్లు గతంలో వార్తలు వచ్చాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Telangana: Has it rained fish in Jagityala and Kaleswaram? Where did the fish come from on the roads
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X