ఎపి నుంచి మారిన సీన్: ఢిల్లీలో తెలంగాణ హీట్
న్యూఢిల్లీ: తెలంగాణ ముసాయిదా బిల్లు వ్యవహారం ఢిల్లీకి చేరింది. తెలంగాణ రాజకీయాల దృశ్యం హైదరాబాదు నుంచి దేశ రాజధాని ఢిల్లీకి మారింది. దీంతో ఢిల్లీలో రాజకీయాలు వేడెక్కాయి. వచ్చే పార్లమెంటు సమావేశాల్లోనే తెలంగాణ ముసాయిదా బిల్లును ప్రతిపాదించి, ఆమోదింపజేసుకోవడానికి కాంగ్రెసు నేతృత్వంలోని యుపిఎ ప్రభుత్వం కసరత్తు చేస్తుండగా, దాన్ని అడ్డుకోవడానికి ఢిల్లీలో ప్రయత్నాలు సాగించే పనిలో సీమాంధ్ర నేతలు పడ్డారు.
పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కమల్ నాథ్ 3వ తేదీన అఖిల పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నారు. అదే విధంగా 4వ తేదీన స్పీకర్ మీరా కుమార్ ఫ్లోర్ లీడర్ల సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. తెలంగాణ బిల్లుపై 4వ తేదీన మంత్రి వర్గ సమావేశం జరిగే అవకాశం ఉంది.

కాగా, తెలంగాణ, సీమాంధ్ర నేతలు ఢిల్లీకి చేరుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్నారు. ఆయన ఈ నెల 4వ తేదీన ప్రధాని మన్మోహన్ సింగ్‌ను కలుస్తున్నారు. ఇతర జాతీయ పార్టీల నేతలను కూడా కలిసి తెలంగాణ బిల్లుకు మద్దతు కూడగట్టే ప్రయత్నాలు సాగించున్నారు. ప్రధానికి ఇవ్వాల్సిన వినతిపత్రం రూపకల్పనకు కెసిఆర్ తన పార్టీ నేతలతో సమావేశమయ్యారు.
తెలంగాణ కాంగ్రెసు నేతలు రేపు (ఆదివారం) ఢిల్లీకి వెళ్లే ఆలోచనలో ఉన్నారు. కాగా, కాంగ్రెసు సీమాంధ్ర నేతలు కూడా 3వ తేదీన ఢిల్లీ వెళ్లే ప్రయత్నాల్లో ఉన్నారు. ఈ నెల 4,5 తేదీల్లో తమకు అపాయింట్‌మెంట్ ఇవ్వాలని సీమాంధ్రకు చెందిన రాష్ట్ర మంత్రులు, శాసనసభ్యులు కోరారు. తెలుగదేశం పార్లమెంటు సభ్యులు కూడా రాష్ట్రపతి అపాయింట్‌మెంట్ కోరుతున్నారు. అపాయింట్‌మెంట్ ఇస్తే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఇరు ప్రాంతాల పార్లమెంటు సభ్యులతో రాష్ట్రపతిని కలుస్తారు.












Click it and Unblock the Notifications