జైరాం రమేష్ కసరత్తు: పది పేజీలతో టీ నివేదిక రెడీ
న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై కేంద్ర మంత్రుల బృందం (జివోఎం) కసరత్తు పూర్తయింది. బుధవారంనాడు కూడా కేంద్ర మంత్రులు సమావేశమై నివేదికకు తుది రూపు ఇవ్వడానికి కసరత్తు చేశారు. కేంద్ర మంత్రి జైరాం రమేష్ పది పేజీలతో కూడిన జీవోఎం నివేదికను రూపొందించారు. రేపు గురువారం ఉదయం పదకొండున్నర గంటలకు జీవోఎం సమావేశమై నివేదికను ఖరారు చేయనుంది.
రేపటి సమావేశం తర్వాత జివోఎం సిఫార్సులను కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు పంపిస్తారు. ఆ సిఫార్సుల ఆధారంగా కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ముసాయిదా బిల్లును రూపొందిస్తుంది. విభజనకు సంబంధించిన 11 అంశాలపై పది పేజీల నివేదికను కేంద్ర మంత్రి జైరాం రమేష్ రూపొందించారని సమాచారం. రేపటి జివోఎం సమావేశం తర్వాత సిఫార్సులను కేంద్ర మంత్రివర్గానికి పంపించాలని అనుకున్నారు. అయితే, రేపు మంత్రి వర్గ సమావేశం జరిగే అవకాశాలు లేవని తెలుస్తోంది.

తెలంగాణ ముసాయిదా బిల్లు ఈ నెల 28వ తేదీన కేంద్ర మంత్రి వర్గం ముందుకు వచ్చే అవకాశాలున్నాయని అంటున్నారు. ఒక్కో అంశంపై ఒక్కో పేజీలో రాసి పది పేజీల నివేదికను రూపొందించినట్లు చెబుతున్నారు. హైదరాబాద్, విద్యుత్తు, జలాల పంపకం, 371డి అనే నాలుగు ప్రధానాంశాలపై కూడా నివేదికలో పొందుపరిచినట్లు చెబుతున్నారు. రెండు రాష్ట్రాల్లోనూ 371డిని కొనసాగించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. దీనికి అవసరమైతే బిల్లును ప్రతిపాదిస్తారు లేదా రాజ్యాంగ సవరణ చేస్తారు. పోలవరం ప్రాజెక్టు ముంపు ప్రాంతాలపై కూడా జివోఎం నివేదికలో చేర్చినట్లు సమాచారం.
కాగా, సీమాంధ్రకు చెందిన కేంద్ర మంత్రులు జివోఎంకు చెందిన కేంద్ర మంత్రులు ఎకె ఆంటోనీని, వీరప్ప మొయిలీని కలిశారు. జైరాం రమేష్‌ను కూడా వారు కలిశారు. యుపిఎ చైర్ పర్సన్ సోనియా గాంధీని కలవాలని జైరాం రమేష్ వారికి సూచించినట్లు సమాచారం. జైరాం రమేష్‌ను కలిసినవారిలో కావూరి సాంబశివ రావు, చిరంజీవి, కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి తదితరులు ఉన్నారు.
సీమాంధ్రకు భారీ ప్యాకేజీ ఇవ్వాలని వారు జైరాం రమేష్‌ను కోరారు. ఇరు ప్రాంతాలకు ప్రయోజనం కలిగే విధంగా, సమన్యాయం జరిగే విధంగా చేయాలని వారు సూచించారు. హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా చేయడం వల్ల ఒరిగేదేమీ లేదని వారు చెప్పారు. ఢిల్లీ తరహాలో హైదరాబాదును కేంద్ర పాలిత ప్రాంతంగా చేయాలని వారు కోరారు.
పార్లమెంటు శీతాకాలం సమావేశాల్లో తెలంగాణ బిల్లు ఆమోదం పొందుతుందని ఆశిస్తున్నట్లు జివోఎం సభ్యుడైన వీరప్ప మొయిలీ అన్నారు. కాగా, ఈ నెలాఖరుకు జీవోఎం సిఫార్సులు ఖరారవుతాయని ఆయన అన్నారు. ఇరు ప్రాంతాలపై ప్రభావం చూపే అంశాలపై జీవోఎం దృష్టి పెడుతోందని ఆయన అన్నారు. అన్ని ప్రాంతాల ప్రజలకు సంతృప్తి కలిగే విధంగా కసరత్తు ఉంటుందని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications