వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణ: కరోనా ఉందంటూ పురుడు పోయలేదు..ఆసుపత్రి గేటు వద్ద చెంచు మహిళ ప్రసవం- ప్రెస్‌రివ్యూ

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
గర్బిణీ

పురిటి నొప్పులతో ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చినా.. సేవలు అందించేందుకు వైద్య సిబ్బంది నిరాకరించడంతో అక్కడ గేటు వద్దే చెంచు మహిళకు ప్రసవమైందంటూ 'ఈనాడు' కథనం తెలిపింది.

తెలంగాణలోని నాగర్‌కర్నూల్‌ జిల్లాలో మంగళవారం ఈ ఘటన జరిగింది.

''జిల్లాలోని బల్మూరు మండలం బాణాలకు చెందిన నిమ్మల లాలమ్మకు మంగళవారం ఉదయం 8 గంటలకు పురిటి నొప్పులు రావడంతో కుటుంబసభ్యులు అచ్చంపేట ఏరియా ఆసుపత్రికి తీసుకువచ్చారు.

ఆమెకు 10 గంటలకు కరోనా పరీక్ష చేయించగా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో వైద్యులు ప్రసవం ఇక్కడ చేయలేమని, పీపీఈ కిట్లు కూడా లేవని చెప్పారు.

అప్పటికే మహిళకు నొప్పులు తీవ్రమైనప్పటికి నాగర్‌కర్నూల్‌ జిల్లా ఆసుపత్రికి వెళ్లాలని విధుల్లో ఉన్న డా.హరిబాబు సూచించారు.

నొప్పులు ఎక్కువవడంతో లాలమ్మను ఆమె వెంట ఉన్న అక్కాచెళ్లెలిద్దరూ ఆసుపత్రి గేటు వద్ద ఓ మూలకు తీసుకెళ్లి కాన్పు చేశారు. గమనించిన వైద్య సిబ్బంది బిడ్డను, తల్లిని ఆసుపత్రిలోకి తీసుకెళ్లారు.

ఈ విషయమై ఆసుపత్రి సూపరింటెండెంట్‌, గైనకాలజిస్ట్‌ అయిన డా.కృష్ణ మాట్లాడుతూ.. విధుల్లో ఉన్న వైద్యుడు హరిబాబు బాధితురాలిని జిల్లా ఆసుపత్రికి రెఫర్‌ చేశారని, వారు వెళ్లలేదని చెప్పారు.

కరోనా బాధిత చెంచు మహిళకు ప్రసవం చేసేందుకు అభ్యంతరం వ్యక్తం చేసిన డా.హరిబాబును సస్పెండ్‌ చేయాలంటూ ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. కొవిడ్‌తో వచ్చిన గర్భిణులను చేర్చుకుని ప్రసవాలు చేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు'' ఈనాడు కథనం పేర్కొంది.

మహారాష్ట్ర గంజాయి ముఠా

నర్సీపట్నంలో మహారాష్ట్ర గంజాయి ముఠా బీభత్సం

పోలీసులు వెంబడిస్తున్నారనే కారణంతో వేగంగా వెళ్తూ అడ్డొచ్చిన .. ప్రతి దానిని గుద్దుకుంటూ నర్సీపట్నంలో మహారాష్ట్ర గంజాయి ముఠా బీభత్సం సృష్టించిందని 'సాక్షి' ఒక వార్తను ప్రచురించింది.

''మహారాష్ట్రకు చెందిన సిద్ధూ, ఇఫ్రాన్, రోహిత్‌ చింతపల్లిలో 240 కిలోల గంజాయిని కొనుగోలు చేశారు. మహారాష్ట్ర తీసుకెళ్లేందుకు కారులో నర్సీపట్నం వైపు వస్తుండగా.. డౌనూరు చెక్‌పోస్టు వద్ద పోలీసులు అపేందుకు ప్రయత్నించగా తప్పించుకుని వచ్చేశారు.

దీంతో అప్రమత్తమైన పోలీసులు నర్సీపట్నం ట్రాఫిక్‌ ఎస్‌ఐకు కారులో వస్తున్న గంజాయి స్మగ్లర్ల సమాచారం అందించారు.

ప్రభుత్వ డిగ్రీ కళాశాల, అబిద్‌సెంటర్‌ వద్ద పోలీసులు స్మగ్లర్ల కారును ఆపేందుకు ప్రయత్నించగా వృద్ధురాలికి డాష్‌ ఇచ్చి వేగంగా దూసుకెళ్లారు.

శ్రీకన్య సెంటర్‌లో విధి నిర్వహణలో ఉన్న ఎస్‌ఐ ఆపే ప్రయత్నం చేయగా.. బారికేడ్లను గుద్దుకుని వెళ్లిపోయారు. వెంటనే ఎస్‌ఐ ద్విచక్రవాహనంపైన, పోలీసు వాహనంతో సిబ్బంది గంజాయి కారును వెంబడించారు.

గంజాయి స్మగ్లర్లు కారుతో ఎలా పడితే అలా దూసుకొస్తుండడంతో వాహనదారులు, ప్రజలు హడలెత్తిపోయారు. కాగా, దొరికిపోతామనే భయంతో స్మగ్లర్లు పెదబొడ్డేపల్లి వంతెన సమీపంలో కారును ఆపి వంతెన కింద ఉన్న కాలువలోకి దూకేశారు.

దీంతో స్థానికులు, పోలీసులు వారిని చుట్టుముట్టారు. కాలువలోంచి ముగ్గురు స్మగ్లర్లను బయటకు రప్పించి స్టేషన్‌కు తరలించినట్లు'' సాక్షి వార్తలో రాసుకొచ్చింది.

మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ మెడకు టాంపరింగ్‌ వివాదం

ఎన్నికల సంఘం వెబ్‌సైట్లో అఫిడవిట్లను మార్చారని తెలంగాణ ఎక్సైజ్‌ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌పై గతేడాది ఆగస్టులో నమోదైన ఫిర్యాదుపై తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు చేపట్టినట్లు 'ఆంధ్రజ్యోతి' కథనం పేర్కొంది.

''2018 అసెంబ్లీ ఎన్నికల్లో మహబూబ్‌నగర్‌ నుంచి పోటీ చేసిన శ్రీనివాస్ గౌడ్‌ నిబంధనలకు విరుద్ధంగా రెండు అఫిడవిట్లను ఈసీ వెబ్‌సైట్లో అప్‌లోడ్‌ చేయించినట్లు కొందరు ఈసీకి ఫిర్యాదు చేశారు.

ఈసీ నిబంధనల ప్రకారం ఆస్తులు, అప్పులు, క్రిమినల్‌ కేసుల వివరాలతో ఆయన సమర్పించిన అఫిడవిట్‌ను ఈసీ తమ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేసి ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది.

అయితే పోలింగ్‌ పూర్తయి, ఫలితాలు రావడానికి రెండు రోజుల ముందు కొత్త అఫిడవిట్‌ ప్రత్యక్షమైందని, అనర్హత వేటునుంచి తప్పించుకునేందుకు సవరించిన అఫిడవిట్‌ను శ్రీనివా్‌సగౌడ్‌ స్థానిక ఈసీ అధికారులతో కుమ్మక్కై అప్‌లోడ్‌ చేయించినట్లు ఆరోపణలు వచ్చాయి.

దీనిపై గత ఏడాది ఆగస్టులో ఇచ్చిన ఫిర్యాదుపై ఇప్పడు కేంద్ర ఎన్నికల కమిషన్‌ చర్యలు చేపట్టింది. అంతర్గతంగా సాంకేతిక బృందంతో విచారణ జరిపిస్తోంది. విచారణ అంశం మంగళవారం వెలుగులోకి వచ్చింది.

ఈ ట్యాంపరింగ్‌ను సాంకేతిక బృందం ధ్రువీకరిస్తే.. మంత్రిపై ఐపీసీ, ఐటీ చట్టాల ప్రకారం చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది.

ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి నుంచి కేంద్ర ఎన్నికల కమిషన్‌ నివేదిక తెప్పించుకుంది. ఇందులో ఈసీ వెబ్‌సైట్‌ను మంత్రి ట్యాంపరింగ్‌ చేసిన విషయం నిజమేనని శశాంక్‌ గోయల్‌ పేర్కొన్నట్లు సమాచారం. అయితే ఈ అంశాన్ని ఎన్నికల అధికారులు ఎక్కడా బయట పెట్టడంలేదని'' ఆంధ్రజ్యోతి తెలిపింది.

కరోనా వ్యాక్సినేషన్

100 శాతం రెండు డోసులు పూర్తి చేసుకున్న తొలి జిల్లాగా కరీంనగర్ రికార్డు

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్ రెండు డోసులు 100 శాతం పూర్తి చేసుకున్న తొలి జిల్లాగా, దక్షిణాది రాష్ట్రాల్లో రెండో జిల్లాగా కరీంనగర్ జిల్లా రికార్డు సొంతం చేసుకుందని 'నమస్తే తెలంగాణ' ఒక వార్తలో తెలిపింది.

''మంగళవారం నాటికి జిల్లాలో రెండో డోస్‌ పంపిణీ 100 శాతం పూర్తయింది. జిల్లాలో 7,92,922 మందికి టీకాలు వేయాలని లక్ష్యంగా నిర్ధారించగా.. మొదటి డోస్‌ లక్ష్యానికి మించి 104 శాతం మందికి వేశారు. ఇప్పటి వరకు 8,27,103 డోసులు పంపిణీ చేశారు.

ఇదే స్ఫూర్తితో సెకండ్‌ డోస్‌ సైతం రికార్డు స్థాయిలో పూర్తి చేశారు. మంగళవారం నాటికి జిల్లాలో 7,94,404 మందికి రెండో డోస్‌ పంపిణీ చేసి 100 శాతం అధిగమించిన తొలి జిల్లాగా రికార్డు సృష్టించారు.

దక్షిణాది రాష్ట్రాల్లో రెండు డోసులు పూర్తయిన జిల్లాగా బెంగళూరు అర్బన్‌ మొదటి స్థానంలో నిలువగా, కరీంనగర్‌ రెండో స్థానంలో నిలిచింది.

ఈ సందర్భంగా వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌ రావు హర్షం వ్యక్తం చేశారు. కరీంనగర్‌ జిల్లా అధికారులను, సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు. తెలంగాణతోపాటు దక్షిణాది రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచారని ప్రశంసించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల ప్రకారం, రాష్ట్రంలోని అన్ని జిల్లాలు ఇదే స్ఫూర్తితో వందశాతం లక్ష్యాన్ని పూర్తి చేయాలని పిలుపునిచ్చినట్లు'' నమస్తే తెలంగాణ పత్రిక రాసింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Telangana:Woman said to be covid positive was denied delivery
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X