బురారీ సూసైడ్ కేసు: ఆ ఇంటిని దేవాలయంగా మార్చాలని విజ్ఞప్తి
న్యూఢిల్లీ: సంచలనం సృష్టించిన ఢిల్లీ బురారీ కుటుంబం సామూహిక ఆత్మహత్యల కేసులో దర్యాప్తు చేసే కొద్దీ షాకింగ్ విషయాలు వెలుగు చూస్తున్నాయి. వారు చనిపోవడానికి కొద్ది గంటల ముందు ఆ కుటుంబంలోని కొందరు వ్యక్తులు ఆత్మహత్యల కోసం స్టూల్, వైర్లు తీసుకుని వెళ్తున్నట్లుగా ఓ వీడియో వెలుగు చూసింది. ఆ తర్వాత, తాజాగా ఆత్మహత్యకు తానే ప్రేరేపించినట్లు గీతామా అనే మహిళ ముందుకు వచ్చింది.
ఇదిలా ఉండగా, 11 మంది ఆత్మహత్య చేసుకున్న ఇంటిని ఏం చేస్తారనే ప్రశ్న తలెత్తుతోంది. ఆ ఇంటిని ఆలయంగా మార్చాలని కొందరు స్థానికులు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారని తెలుస్తోంది. కుటుంబంలోని 11 మంది ఒకేసారి ఆత్మహత్య చేసుకోవడంతో స్థానికులు భయానికి లోనవుతున్నారు.

దీనికి తోడు ఆత్మహత్య వెనుక కారణాలు మీడియాలో ప్రసారమవడం, పోలీసులు రోజూ ఆ ఇంటి వద్దకు వచ్చి వెళ్తుండటంతో వారంతా ఆందోళనకు చెందుతున్నారు. ఇప్పటికే ఆ ఇంటి చుట్టుపక్కల నివసించే చాలామంది భయంతో తమ ఇళ్లను ఖాళీ చేస్తున్నారట.
ప్రస్తుతం నారాయణ్ దేవి ఇంటిని పోలీసులు సీజ్ చేశారు. దర్యాప్తు తర్వాత ఆ ఇంటిని ఎవరికి అప్పగిస్తారన్న దానిపై స్పష్టత రాలేదు. అయితే ఆ ఇంటిని ఆలయంగా మార్చితేనే మంచిదని కొందరు స్థానికులు భావిస్తున్నారు. ఆ ఇంటిని తీసుకోవడానికి ఎవరూ ముందుకు రావడం లేదు.
మరోవైపు, మహిళా మంత్రసాని గీతామాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.












Click it and Unblock the Notifications