కొలువుతీరిన పంజాబ్ కేబినెట్ - 10 మంది ప్రమాణ స్వీకారం : తొలి భేటీలో..!!
పంజాబ్ లో సంచలన విజయం సాధించిన ఆప్..కొత్త ప్రభుత్వం కొలువు తీరింది. నాలుగు రోజుల క్రితం సీఎంగా భగవంత్ మాన్ ప్రమాణ స్వీకారం చేసారు. ఆ రోజున తన కేబినెట్ లో తొలిగా 11 మంది మంత్రులను ఎంపిక చేసుకున్నారు. గవర్నర్ వారితో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ 10 మందిలో ఒక మహిళ ఉన్నారు. ముఖ్యమంత్రి భగవంత్ మాన్ తన వద్దే కీలక శాఖలు ఉంచుకున్నారు. ఖాట్కర్ కలాన్ లో సీఎంగా మాన్ ప్రమాణ స్వీకారానికి కేజ్రీవాల్ సైతం హాజరయ్యారు.

కొత్త కేబినెట్ లో ఛాన్స్ వీరికే
రెండు సార్లు దీర్బా నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన హర్పాల్ సింగ్ చీమా, మాలౌత్ నుంచి గెలుపొందిన బల్జీత్ కౌర్, జాందియాల ఎమ్మెల్యే హర్భజన్ సింగ్ ఈతో, మాన్సా ఎమ్మెల్యే విజయ్ సింగ్లా, భోవా ఎమ్మెల్యే లాల్ చంద్ కటారుచక్, బార్నాలా ఎమ్మెల్యే గుర్మీత్ సింగ్ మీత్ హాయర్, అజ్నాలా ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ ధలివాల్, పాటి ఎమ్మెల్యే లాల్ జిత్ సింగ్ భుల్లార్, హోషియార్ పూర్ ఎమ్మెల్యే బ్రహ్మ శంకర్ జింపా, ఆనంద్ పూర్ సాహిబ్ ఎమ్మెల్యే హర్జోత్ సింగ్ బెయిన్స్ లు మంత్రులుగా ప్రమాణం చేశారు. అనంతరం పంజాబ్ సచివాలయంలో బాధ్యతలు చేపట్టారు.

మంత్రులకు సీఎం దిశా నిర్దేశం
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 117 స్థానాలకు గానూ 92 సీట్లు కైవసం చేసుకుని ఆమ్ ఆద్మీ పార్టీ చరిత్ర సృష్టించింది. కాంగ్రెస్, శిరోమణి అకాలీదళ్ కాకుండా తొలిసారి మరో పార్టీ అధికారంలోకి వచ్చింది. ప్రమాణ స్వీకారం ముగియటంతో కాసేపట్లో పంజాబ్ కొత్త ప్రభుత్వం తొలి కేబినెట్ సమావేశం జరగనుంది. ముఖ్యమంత్రిగా అవినీతి రహిత పాలన అందిస్తానని కొత్త సీఎం ప్రకటించారు. అందులో భాగంగా అవినీతి ఫిర్యాదులు చేయటానికి ఒక హెల్ప్ లైన్ సైతం ఏర్పాటు చేసారు.

తొలి కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు
ఇక, ఇప్పుడు శాఖల కేటాయింపుతో పాటుగా ప్రభుత్వ లక్ష్యాలను తొలి కేబినెట్ సమావేశంలో సీఎం కొత్త మంత్రులకు వివరించనున్నారు. అదే విధంగా ఇప్పటికే సీఎంఓలో కీలక అధికారులను మార్పు చేసారు. మంత్రులకు సైతం తమ శాఖల్లో అధికారుల ఎంపిక..తమ వ్యక్తిగత సిబ్బంది నిర్ణయాల్లో నూ ముఖ్యమంత్రి వారికి కీలక సూచనలు చేయనున్నట్లు చెబుతున్నారు. 18 మందికి మంత్రులుగా కేబినెట్ లోకి తీసుకొనే అవకాశం ఉన్నా.. ప్రస్తుతం 10 మందితోనే సరిపెట్టారు. త్వరలోనే మిగిలిన వారి విషయంలో నిర్ణయం తీసుకొనే ఛాన్స్ ఉంది.












Click it and Unblock the Notifications