ఉగ్ర స్థావరం ధ్వంసం, భారీగా ఆయుధాలు సీజ్
జమ్మూకాశ్మీర్‌లోని పహల్గాంలో ఉగ్రదాడి అనంతరం భద్రతా దళాలు ముష్కరుల వేట కొనసాగిస్తున్నాయి. ఇందులో భాగంగా కాశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలో ఉగ్రవాదుల రహస్య స్థావరాన్ని భద్రతా దళాలు గుర్తించి ధ్వంసం చేశాయి. ఆ ఉగ్ర స్థావరాల నుంచి భారీగా ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు.
ఉగ్ర స్థావరాలపై నిఘా వర్గాల సమాచారం మేరకు ఉత్తర కాశ్మీర్ జిల్లాలోని సెడోరి నాలా అటవీ ప్రాంతంలో భద్రతా దళాలు సోదాలు నిర్వహించాయని అధికారులు తెలిపారు. ఈ ప్రాంతంలో ప్రజల శాంతి భద్రతలకు భంగం కలిగించాలనే లక్ష్యంతో ఉగ్రవాదులు కుట్ర పన్నుతున్నారనే సమాచారం వచ్చిందన్నారు. ఆ సమయంలో సైన్యం ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసిందని తెలిపారు. ఉగ్రవేటలో ఇది మరో ముందడుగు అని చెప్పారు.

పహల్గాం ఉగ్రదాడిలో 26 మంది పౌరులు ప్రాణాలు కోల్పోవడంతో భారత ప్రభుత్వం ఉగ్రవాదులకు మనుగడ లేకుండా చేసేందుకు సిద్ధమైంది. ఉగ్రదాడి తర్వాత నుంచి భద్రతా దళాలు జమ్మూకాశ్మీర్‌లోని అణువణువూ జల్లెడపడుతున్నారు. ఇప్పటికే పలువురు ఉగ్రవాదుల నివాసాలను నేలమట్టం చేసిన విషయం తెలిసిందే.
మరోవైపు, కుల్గాం జిల్లాలో ఉగ్రవాదులతో కలిసి పనిచేస్తున్న ఇద్దరిని భద్రతా దళాలు శనివారం అరెస్ట్ చేశాయి. ఖైమోహ్ ప్రాంతంలో వీరిని అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొన్నాయి. ఇక, భారత్, పాక్ సరిహద్దులోనూ ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. శుక్రవారం రాత్రి నుంచి పాకిస్థాన్ కవ్వింపు చర్యలకు దిగుతోంది.
సరిహద్దులో పాక్ సైన్యం భారత సైనికులపై కాల్పులకు దిగింది. దీంతో భారత్ సైన్యం కూడా ఎదురుకాల్పులు జరుపుతూ వారికి ధీటుగా ఎదుర్కొంటోంది. సరిహద్దు ప్రాంతంలో పాకిస్థాన్ తన సైన్యాన్ని పెంచుతున్నట్లు సమాచారం. దీంతో భారత్ కూడా సరహద్దులోకి పెద్ద ఎత్తున బలగాలను మోహరించింది. ఈ క్రమంలో ఎప్పుడేం జరుగుతుందో అని సరిహద్దు ప్రజలు ఆందోళనలో ఉన్నారు.












Click it and Unblock the Notifications