Jammu Kashmir : పోలీస్ కానిస్టేబుల్ భార్య,కూతురిపై ఉగ్రవాదుల కాల్పులు...
జమ్మూకశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలో ఉన్న కొకాగండ్ ప్రాంతంలో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. మంగళవారం(జులై 20) సాయంత్రం ఓ పోలీస్ అధికారి ఇంట్లోకి చొరబడ్డ ఉగ్రవాదులు... ఆ అధికారి భార్య,కూతురిపై కాల్పులు జరిపారు. అనంతరం అక్కడి నుంచి పారిపోయారు. కాల్పుల్లో గాయపడ్డ ఆ ఇద్దరిని స్థానిక భద్రతా దళాలు సమీపంలోని ఆస్పత్రికి తరలించాయి. బాధితులను పోలీస్ కానిస్టేబుల్ సాజద్ అహ్మద్ మాలిక్ భార్య నైదా,కూతురు మధియాలుగా గుర్తించారు. బక్రీద్‌కు ఒకరోజు ముందు ఈ ఘటన చోటు చేసుకోవడం గమనార్హం.
జమ్మూకశ్మీర్‌లోని షోపియన్ జిల్లాలో సోమవారం(జులై 19) తెల్లవారు జామున జరిగిన ఎన్ కౌంటర్‌లో జైషే తోయిబా ఉగ్రవాద సంస్థకు చెందిన టాప్ కమాండర్ ఇష్ ఫాక్ దర్ అలియాస్ అబూ అక్రమ్ సహా మరో ఉగ్రవాది మృతి చెందిన సంగతి తెలిసిందే. షోపియన్ జిల్లాలోని చెక్ సాదిఖ్ ఖాన్ ప్రాంతంలో ఉగ్రవాదుల కదలికలపై సమాచారం అందడంతో భద్రతా దళాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. ఈ క్రమంలో సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తుండగా ఉగ్రవాదులు ఒక్కసారిగా భద్రతా దళాలపై కాల్పులు జరిపారు. వారిని లొంగిపోవాల్సిందిగా హెచ్చరించినప్పటికీ వెనక్కి తగ్గలేదు... దీంతో భద్రతా దళాలు ఎదురు కాల్పులు జరిపాయి.ఈ కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. వీరిలో ఒకరిని అబూ అక్రమ్‌గా గుర్తించారు. ఘటనా స్థలం నుంచి పలు అనుమానాస్పద డాక్యుమెంట్లు, ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు.

2017 నుంచి అబూ అక్రమ్ షోపియన్ జిల్లాలో చురుకుగా ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహిస్తున్నాడని ఐజీపీ విజయ్ కుమార్ పేర్కొన్నారు. రహస్యంగా తన కార్యకలాపాలు కొనసాగిస్తూ.. ఎప్పటికప్పుడు పాక్ ఐఎస్ఐకి సమాచారం పంపుతున్నాడని తెలిపారు. ఈ ఏడాది ఇప్పటివరకూ షోపియన్ జిల్లాలో పలుమార్లు ఎన్‌కౌంటర్ ఘటనలు చోటు చేసుకున్నాయి. పలువురు ఉగ్రవాదులను భద్రతాదళాలు మట్టుబెట్టాయి. ఈ నెల 16 న శ్రీనగర్‌లో లష్కరే తోయిబాకు చెందిన ఇద్దరు టెర్రరిస్టులు ఎన్ కౌంటర్‌లో హతమైన సంగతి తెలిసిందే.












Click it and Unblock the Notifications