తెలంగాణాకు రైల్వే శుభవార్త: ఆ మార్గంలో రూ.5 వేల కోట్లతో కొత్త రైల్వేలైన్!
ఉత్తర తెలంగాణ పారిశ్రామిక, ఆర్థిక ముఖచిత్రాన్ని సమూలంగా మార్చగల ప్రతిష్టాత్మక రామగుండం - మణుగూరు సరికొత్త బ్రాడ్‌గేజ్ రైల్వే లైన్ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. పాతికేళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ, పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యం మోడల్‌లో సుమారు రూ. 5,818.45 కోట్ల అంచనా వ్యయంతో ఈ మెగా రైల్వే కారిడార్ నిర్మాణానికి ఆమోదం లభించింది.
రామగుండం నుండి మణుగూరుకు తగ్గుతున్న దూరం
ప్రస్తుతం రామగుండం నుండి మణుగూరు వెళ్లాలంటే కాజీపేట, డోర్నకల్ జంక్షన్ల మీదుగా చుట్టూ తిరిగి దాదాపు 286 కిలోమీటర్లకు పైగా ప్రయాణించాల్సి వస్తోంది. ఈ మార్గంలో రైళ్ల రద్దీ 140 శాతంగా ఉండటంతో తీవ్ర ఆలస్యం జరుగుతోంది. సరికొత్తగా ప్రతిపాదించిన ఈ నేరుగా ఉండే రైల్వే లైన్ పొడవు 207.80 కిలోమీటర్లు, ట్రాక్ పొడవు 247.80 కి.మీ. ఈ లైన్ అందుబాటులోకి వస్తే రెండు నగరాల మధ్య దాదాపు 90 కిలోమీటర్ల మేర ప్రయాణ దూరం తగ్గనుంది.

బొగ్గు రవాణా ఖర్చులు భారీగా తగ్గడంతో పాటు రవాణా ప్రక్రియ వేగవంతం
ఈ ప్రాజెక్ట్ సింగరేణి బొగ్గు గనులు విస్తరించి ఉన్న కీలక ప్రాంతాలను కలుపుతూ ఒక వ్యూహాత్మక "కోల్ కారిడార్" గా మారనుంది. మణుగూరు, భూపాలపల్లి, రామగుండం ఏరియాల నుంచి వివిధ విద్యుత్ ఉత్పాదక కేంద్రాలకు, పరిశ్రమలకు బొగ్గు రవాణా ఖర్చులు భారీగా తగ్గడంతో పాటు రవాణా ప్రక్రియ అత్యంత వేగవంతం కానుంది. బొగ్గుతో పాటు ధాన్యాలు, సిమెంట్, ఖనిజాల రవాణాకు కూడా ఇది కీలక మార్గం కానుంది.
పర్యాటక రంగానికి, గిరిజన ప్రాంతాలకు ఊతం
ఈ నూతన రైలు మార్గాన్ని ప్రయాణికులకు కూడా ఎంతో సౌకర్యవంతంగా డిజైన్ చేశారు. ఈ లైన్ పెద్దపల్లి జిల్లాలోని రాఘవాపూర్ స్టేషన్ నుండి ప్రారంభమై మంథని, జయశంకర్ భూపాలపల్లి, మేడారం, తాడ్వాయి, కాటాపూర్, గోపాల్‌రావుపేట, రామానుజపురం మీదుగా మణుగూరు వరకు సాగుతుంది.ఇది పూర్తిగా అటవీ మరియు గిరిజన ప్రాంతాల గుండా వెళ్లనుండటంతో ఆయా ప్రాంతాల ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం లభిస్తుంది.
ఈ మార్గాల గుండా రైల్వే లైన్
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కాళేశ్వరం, ప్రపంచ వారసత్వ కట్టడం రామప్ప దేవాలయం, ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర జరిగే మేడారం, లక్నవరం, బొగత జలపాతం వంటి పర్యాటక ప్రాంతాలకు ఈ రైల్వే లైన్ ద్వారా అద్భుతమైన కనెక్టివిటీ లభిస్తుంది. మేడారం జాతర సమయంలో లక్షలాది మంది భక్తులను తరలించడానికి ప్రత్యేక రైళ్లు నడపడానికి ఇది వీలు కల్పిస్తుంది.
పనుల పురోగతి - పీపీపీ మోడల్
కేంద్ర ప్రభుత్వం ఈ మెగా ప్రాజెక్టు కోసం బడ్జెట్‌లో రూ. 2,911.84 కోట్ల భారీ నిధులను కేటాయించింది. పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ఈ ప్రాజెక్టుకు అవసరమైన భూసేకరణ ప్రక్రియ కోసం ఇప్పటికే గెజిట్ నోటిఫికేషన్లు జారీ అయ్యాయి. రైల్వే శాఖ నిబంధనల ప్రకారం, భూసేకరణ మరియు అనుమతుల బాధ్యతను భారతీయ రైల్వే చూసుకుంటుంది.
పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్య పద్ధతిలో లైన్ నిర్మాణం, నిర్వహణ
అప్పగించనున్నారు. ఈ ప్రాజెక్టును రాబోయే ఐదేళ్ల కాలపరిమితిలో 1 ఏడాది భూసేకరణ, 4 ఏళ్లు నిర్మాణ కాలంలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ మార్గం పూర్తయితే రామగుండం నుండి మణుగూరుకు దాదాపు 90 కిలోమీటర్ల మేర ప్రయాణ దూరం తగ్గనుంది.













Click it and Unblock the Notifications