రిక్షాలో సీఎం వద్దకు సీఈవో : రిక్షావాలాకు సీఎం బంపర్ ఆఫర్
లక్నో : ఇండియాలోని ప్రధాన నగరాల్లో ఎక్కడ అడుగుపెట్టినా.. ట్రాఫిక్ కష్టాలు కళ్లెదుట కదలాడుతూనే ఉంటాయి. గంటలపాటు ట్రాఫిక్ జామ్ లో చిక్కుకుని ఆఫీసులకు ఆలస్యంగా వెళ్లి.. ఛీత్కారాలు ఎదుర్కొనే ఉద్యోగులకు లెక్క లేదు. ఇక ఏ ముఖ్యమంత్రి గారో అపాయిమెంట్ ఇచ్చినా.. ట్రాఫిక్ కష్టాలతో సకాలంలో అక్కడికి చేరుకోలేని పరిస్థితి. సరిగ్గా ఇలాంటి పరిస్థితే పేటీఎం సీఈవో విజయ్ శేఖర్ శర్మకు కూడా ఎదురైంది.
యూపీ సీఎం అఖిలేశ్ యాదవ్ తో భేటీ కోసం కారులో బయలుదేరిన ఆయన లక్నో ట్రాఫిక్ జామ్ లో చిక్కుకుపోయారు. ఎంతసేపు వేచి చూసినా.. ట్రాఫిక్ క్లియర్ అయ్యే సూచనలు కనబడకపోవడంతో.. ఇక లాభం లేదనుకుని అటుగా వెళ్తున్న ఓ రిక్షావాలాను పిలిచి అందులో బయలుదేరారు.
A traffic jam forced Paytm CEO Vijay Shekhar Sharma to visit us in a cycle rickshaw. Lucknow Metro will help solve the traffic jams in city. pic.twitter.com/SDzZy0mjMX
— Akhilesh Yadav (@yadavakhilesh) October 27, 2016
సదరు రిక్షావాలా చకచకా సైకిల్ ను పరుగులు పెట్టిస్తూ.. అఖిలేశ్ నివాసంలో త్వరగానే దిగబెట్టేశాడు. ఇక సీఈవో స్థాయి హోదా ఉన్న వ్యక్తి సాదాసీదాగా ఓ రిక్షాలో రావడం చూసి అఖిలేశ్ ఆశ్చర్యపోయారు. సీఈవోతో పాటు రిక్షావాలాతో ఉన్న ఫోటోను తన ట్విట్టర్ లో షేర్ చేయడంతో.. విషయం బయటకొచ్చింది. కాగా, మెట్రో రాకతోనే ట్రాఫిక్ కష్టాలు గట్టెక్కుతాయని చెప్పారు అఖిలేశ్.
రిక్షావాలాకు పండుగ అదృష్టం కలిసొచ్చింది..
పండుగ పూట రిక్షావాలా మణిరామ్ కు అదృష్టం కలిసొచ్చింది. పేటీఎం సీఈవోను సకాలంలో అఖిలేశ్ ఇంటికి తీసుకొచ్చినందుకు గాను రిక్షావాలాను అభినందించారు అఖిలేశ్. అంతేకాదు, రూ.6వేల నగదును తన సెక్యూరిటీ సిబ్బందితో రిక్షావాలకు ఇప్పించారు.
మణిరామ్ వివరాలను అఖిలేశ్ స్వయంగా అడిగి తెలుసుకున్నారు. కొత్త రిక్షా సైకిల్ తో పాటు కొత్త ఇంటిని కూడా నిర్మించి ఇస్తామని అఖిలేశ్ అతనికి హామి ఇచ్చాడు. దీంతో దీపావళి పూట ఆ రిక్షావాలా ఇంట్లో నిజమైన ఆనందం వెల్లి విరియనుందని అభిప్రాయపడుతున్నారు నెటిజెన్స్.












Click it and Unblock the Notifications