విద్యార్థినికి టోపి పెట్టాడు: నకిలి జ్యోతిష్కుడి అరెస్టు
బెంగళూరు: జ్ఞాపకశక్తి పెరిగిపోతుందని నమ్మించి విద్యార్థిని దగ్గర బంగారు నగలు లాక్కొని మోసం చేసిన నకిలి జ్యోతిష్కుడిని బెంగళూరు పోలీసులు అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు. ఇదే కేసులో తప్పించుకుని పరారైన అతని ముగ్గురు అనుచరుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.
రాజగోపాలనగరలో గణేష్ అనే జ్యోతిష్కుడు నివాసం ఉంటున్నాడు. ఇతనిది బాగల్ కోటే జిల్లా. ఇతను జ్ఞాపకశక్తి పెరగడానికి ఔషదాలు ఇస్తామని కొన్ని దినపత్రికలలో ప్రకటనలు ఇచ్చాడు. ప్రకటనలు చూసిన ఓ ఇంటర్ (పీయుసీ) విద్యార్థిని గణేష్ ను సంప్రదించింది.
తాను ఇంటర్ రెండవ సంవత్సరంలో ఎక్కువ మార్కులు సంపాధించాలని, తనకు జ్ఞాపకశక్తి పెరగడానికి ఔషధాలు ఇవ్వాలని ఆమె చెప్పింది. అందుకు పెద్ద మొత్తంలో నగదు ఇవ్వాలని గణేష్ చెప్పాడు. అంత డబ్బు విద్యార్థిని దగ్గర లేదని గణేష్ తెలుసుకున్నాడు.

తరువాత ఇంటిలో ఉన్న బంగారు నగలు తీసుకురావాలని విద్యార్థినికి చెప్పాడు. ఆ విద్యార్థిని కుటుంబ సభ్యుల కళ్లుగప్పి 80 గ్రాముల బంగారు నగలు తీసుకు వెళ్లి గణేష్ కు ఇచ్చింది. తరువాత గణేష్ ఎలాంటి ఔషధాలు ఇవ్వకుండా విద్యార్థినిని మోసం చేశాడు.
ఈ విషయం బయటకు చెప్పినా, బంగారు నగలు తనకు ఇచ్చినట్లు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చినా నీవు రక్తం కక్కుకుని చచ్చిపోతావని, అందుకు తాను క్షుద్ర పూజలు చేశానని గణేష్ విద్యార్థినిని బెదిరించాడు.
విద్యార్థిని ఇంటికి వెళ్లి తల్లికి సమాచారం ఇచ్చింది. తల్లి, కుమార్తె ఇద్దరూ కలిసి రాజగోపాల నగర పోలీసులకు ఫిర్యాదు చెయ్యడంతో విషయం వెలుగు చూసింది. గణేష్ ఇంకా ఎంత మందిని ఈ విధంగా మోసం చేశాడనే విషయాన్ని ఆరా తీస్తున్నామని రాజగోపాలనగర పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications