లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా, 1.50 లక్షల ఈమెయిల్స్ సీజ్ !
బెంగళూరు/న్యూఢిల్లీ: లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా కేసు దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారులు ఆయనకు సంబంధించిన 1.50 లక్షల అధికారిక ఈమెయిల్స్ లోని పూర్తి వివరాలు సేకరించడానికి ముమ్మరంగా ప్రయత్నాలు మొదలు పెట్టారు.
విజయ్ మాల్యాకు రూ. 6,900 కోట్ల రుణం ఇవ్వడానికి ఎవరైనా సహకరించారా ? అని సీబీఐ అధికారులు ఆరా తీస్తున్నారు. రాజకీయ ప్రముఖులు, బ్యాంకు అధికారులు, ఆయన కంపెనీల సిబ్బంది లిక్కర్ కింగ్ కు ఎప్పుడెప్పుడు ఈమెయిల్స్ పంపించారు అని ఆరా తీస్తున్నారు.
బ్యాంకుల్లో రుణం తీసుకుని తరువాత పంగనామాలు పెట్టిన విజయ్ మాల్యా బండారం బయట పెట్టడానికి ఆయనకు చెందిన 1.5 లక్షల ఈమెల్స్ ను సీబీఐ ప్రత్యేక బృందం అధికారులు జల్లెడ పడుతున్నారు.

ఈ ఈమెల్ వివరాలు కేసు దర్యాప్తులో సాక్షంగా పెట్టాలని సీబీఐ అధికారులు ప్రయత్నిస్తున్నారు. విజయ్ మాల్యాకు ఎవరైనా సహాయం చేసి ఉంటే ఈమెయిల్స్ లో ఆ వివరాలు ఉంటాయని సీబీఐ అధికారులు అంటున్నారు.
విజయ్ మాల్యా కేసు దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారులు గత వారం మొదటి చార్జ్ షీట్ కోర్టులో సమర్పించారు. ఆయనకు రుణం మంజూరు చెయ్యడానికి ఐడీబీఐ బ్యాంకులోని కొందరు అధికారులు సహకరించారని ఇప్పటికే వెలుగు చూసింది.
విజయ్ మాల్యా తన కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ సంస్థకు 2006 నుంచి 2009 మధ్య కాలంలో ఐడీబీఐ బ్యాంక్ నుంచి వేల కోట్ల రుపాయాల రుణం తీసుకున్నారు. కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ కు నెగటీవ్ రేటింగ్ ఉన్నా బ్యాంకు అధికారులు ఎలా రుణం మంజూరు చేశారు ? అని సీబీఐ అధికారులు ఆరా తీస్తున్నారు.












Click it and Unblock the Notifications