థౌజండ్‌వాలా లాంటి దీపావళి కానుకను ప్రకటించిన మోదీ..!!
న్యూఢిల్లీ: రైల్వే ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం అద్దిరిపోయే కానుకను ప్రకటించింది. ప్రతి సంవత్సరం దీపావళి పండగను పురస్కరించుకుని ఇచ్చే కానుకే ఇది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలపై కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి అంటే 2022-2023కి సంబంధించిన ప్రతిపాదనలు అవి. దీనితో పాటు పలు ప్రతిపాదనలను కేంద్రమంత్రివర్గం ఆమోదించింది. దీనికి సంబంధించిన వివరాలను సమాచార, ప్రసారాల శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు.

78 రోజుల వేతనం..
రైల్వే ఉద్యోగులకు బోనస్‌ను ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. ఒక్కో ఉద్యోగికి 78 రోజుల పని దినాలకు సమానమైన వేతనాన్ని బోనస్‌గా ఇవ్వనుంది. ఇందులో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్/రైల్వే ప్రొటెక్షన్ స్పెషల్ ఫోర్స్ ఉద్యోగులకు మినహాయింపునిచ్చింది. వారికి బోనస్ ఉండదు. అలాగే- రైల్వేలో గెజిటెడ్ హోదాలో పని చేసే ఉద్యోగులను కూడా పరిగణనలోకి తీసుకోలేదు. బోనస్ నుంచి మినహాయించింది. నాన్ గెజిటెడ్ కేటగిరీకి చెందిన ఉద్యోగులకు మాత్రమే ఈ బోనస్‌ను వర్తింపజేసింది.

11.27 లక్షల మందికి బెనిఫిట్..
ప్రస్తుతం రైల్వేలో నాన్ గెజిటెడ్ హోదాలో 11.27 లక్షల మంది ఉద్యోగులు పని చేస్తోన్నారు. వేర్వేరు స్థాయిల్లో కొనసాగుతున్నారు. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ఈ 11.27 లక్షల మందికి లబ్ది కలుగుతుంది. ప్రొడక్టివిటీ లింక్డ్ బోనస్ రూపంలో 78 రోజులకు సమానమైన వేతనాన్ని అదనంగా చెల్లించనుంది కేంద్ర ప్రభుత్వం. దీనివల్ల కేంద్ర ప్రభుత్వంపై అదనంగా 1,832.09 కోట్ల రూపాయల మేర భారం పడుతుంది.

రూ.7 వేల నుంచి..
కాగా- ప్రొడక్టివిటీ లింక్డ్ బోనస్ చెల్లింపు కోసం కమిటీ సూచించిన వేతన సీలింగ్ నెలకు 7,000 రూపాయలు. ఇది కనీస మొత్తంగా పరిగణించాల్సి ఉంటుందని కమిటీ కేంద్రానికి సిఫారసు చేసింది. అలాగే ఒక్కో ఉద్యోగి అర్హతను బట్టి గరిష్ఠంగా 17,951 రూపాయలను బోనస్‌గా చెల్లిస్తుంది. ఆర్థిక వ్యవస్థకు రైల్వే మంత్రిత్వ శాఖ ఉత్ప్రేరకంగా పని చేసిందని, వారు చేసిన సేవలకు పరిగణనలోకి తీసుకుని ఈ బోనస్‌ను చెల్లించనున్నట్లు కేంద్రం తెలిపింది.

రైల్వే ఉద్యోగుల సేవలు..
ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానానికి చేర్చడంలో రైల్వే ఉద్యోగుల పాత్రను విస్మరించలేమని వ్యాఖ్యానించింది. సరుకుల రవాణాలో అహర్నిశలు కష్టపడ్డారని, ఎలాంటి ఆటంకం లేకుండా సకాలంలో వాటిని చేరవేయగలుగుతున్నారని పేర్కొంది. లాక్‌డౌన్ సమయంలో కూడా రైల్వే ఉద్యోగులు- ఆహారం, ఎరువులు, బొగ్గు, ఇతర నిత్యావసర వస్తువులను నిరంతరాయంగా తరలించేలా జాగ్రత్త పడ్డారని, రోజువారీ కార్యకలాపాల నిర్వహణలో వెనుకంజ వేయలేదని ప్రశంసించింది.












Click it and Unblock the Notifications