MH Elections: అధికారం దక్కాలంటే అక్కడ గెలవాల్సిందే..!!
మహారాష్ట్ర ఎన్నికలు అధినేతల సమర్థతకు పరీక్షగా నిలుస్తున్నాయి. పార్టీలు ఎన్నికల్లో గెలుపు ను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నాయి. రెండు కూటముల నుంచి దాదాపు 50 మంది రెబల్స్ బరిలో ఉన్నారు. వారితో విత్ డ్రా చేయించేందుకు ముఖ్య నేతలు చివరి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ఎన్నికలు కాంగ్రెస్ కు పరీక్షగా మారుతున్నాయి. మిత్రపక్షాల ఓట్ల బదిలీనే ఈ ఎన్నికల్లో రెండు కూటములకు కీలకంగా మారుతున్నాయి. దీంతో, ఇక రెండు కూటముల నుంచి ప్రధాన నేతలు ప్రచార బరిలోకి దిగుతున్నారు.
వ్యూహ ప్రతివ్యూహాలతో
మహారాష్ట్ర ఎన్నికల్లో రెండు కూటములకు నాయకత్వం వహిస్తున్న కాంగ్రెస్ - బీజేపీలు పోటా పోట వ్యూహాలతో ముందుకు వెళ్తున్నాయి. రెండు కూటములు తమ మేనిఫెస్టో ను ఆకర్షణీయం గా తీర్చిదిద్దే పనిలో ఉన్నాయి. కాంగ్రెస్ ఇతర రాష్ట్రాల్లో ప్రకటించిన గ్యారంటీల తరహాలోనే ఇక్కడ తమ హామీలను ప్రకటించేందుకు సిద్దం అవుతోంది. ఇక, బీజేపీ సుస్థిరాభివృద్ధి పేరుతో మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తోంది. 288 అసెంబ్లీ స్థానాలు ఉన్న మహారాష్ట్ర అసెంబ్లీలో కాంగ్రెస్ - బీజేపీ 75 స్థానాల్లో ముఖా ముఖి తలపడుతున్నాయి. ఇక్కడ రెండు పార్టీలకు తమ కూటమిల్లోని మిత్రపక్ష పార్టీల నుంచి ఓట్ల బదిలీ కీలకంగా భావిస్తున్నాయి.

అక్కడ పట్టు కోసం
మహారాష్ట్రలో కరువు ప్రాంతమైన విదర్భతోపాటుగా పశ్చిమ, ఉత్తర మహారాష్ట్రలు, మరాఠ్వాడా, కొంకణ్.. ముంబై, థానె ప్రాంతాల్లో కమలం-హస్తం మధ్య గట్టిపోటీ కనిపిస్తోంది. 2019 ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు తల పడిన చోట బీజేపీ మెజార్టీ సీట్లు సాధించింది. మహారాష్ట్రలో ఎవరికి అధికారం దక్కాలన్నా.. విదర్భలో మెజార్టీ సీట్లు గెలవటం అవసరం. గత ఎన్నికల్లో బీజేపీ ఇక్కడ 23 స్థానాలను గెలుచుకుంది. ఇక ఆర్దిక రాజధాని ముంబాయి నగరంలోనూ మెజార్టీ సీట్లు దక్కించుకోవటం పైన రెండు పార్టీలు గురి పెట్టాయి. ఇక్కడ రెండు కూటముల్లోని రెండు శివసేన వర్గాల ఓట్లే ముంబాయి మహానగరంలో కీలకంగా మారుతున్నాయి. కాంగ్రెస్ కు శివసేన (యబీటీ)ఓట్లు బదిలీ జరిగితేనే కలిసొచ్చే అవకాశం ఉంది.
ప్రచారం కోసం
ఇక, నామినేషన్ల ఉపసంహరణకు రేపు(సోమవారం) చివరి రోజు. రెండు కూటముల నుంచి దాదాపు 50 మంది రెబల్స్ గా బరిలో ఉన్నారు. వీరిని బుజ్జగించేందుకు చివరి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నెల 5 నుంచి 18వ తేదీ వరకు ఎన్నికల ప్రచారం జరగనుంది. ఇప్పటికే ప్రధాని మోదీ ప్రచార షెడ్యూల్ ఖరారైంది. కాంగ్రెస్ నుంచి సోనియా, రాహుల్, ప్రియాంక ప్రచారం కోసం రానున్నారు. ప్రచారానికి ఉన్న 14 రోజుల సమయం సద్వినియోగం చేసుకోవాలని భావిస్తున్నారు. ఇక, స్థానికంగా ప్రభావితం చేసే నేతలను పార్టీలు రంగంలోకి దించుతున్నాయి. పార్టీ మేనిఫెస్టోల ప్రకటన తో పాటుగా ఎన్నికల హామీలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా కార్యాచరణ సిద్దం అవుతోంది.












Click it and Unblock the Notifications