ఇంజన్ విడిపోయి ట్రైన్ పరుగులు.. ప్రాణాలు అరచేత పట్టుకున్న ప్రయాణికులు..(వీడియో)
పట్టాలపై ఎక్స్‌ప్రెస్ రైలు వేగంగా పరుగులు తీసింది. అందులో వింతేముంది అనుకుంటున్నారా..? ఇక్కడే అసలు విషయం ఉంది. ఆ రైలు ఇంజన్ విడిపోయి పరుగులు తీసింది. అందులో ఉన్న ప్రయాణికులకు మూడు కిలోమీటర్ల తర్వాత ఈ విషయం తెలిసింది. ఇంకేముంది ఇంజన్ లేని రైలులో ప్రయాణిస్తున్నామని తెలుసుకున్న ఆ ప్రయాణికులు ప్రాణాలు అరచేత పట్టుకుని బిక్కు బిక్కుమంటూ గడిపారు. పూర్తి వివరాల్లోకి వెళితే..
పంజాబ్ రాష్ట్రంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. పంజాబ్‌లోని ఖన్నాలో పాట్నా నుంచి -జమ్మూ తావికి వెళ్తున్న ట్రైన్ నెం.12355 అర్చన ఎక్స్‌ప్రెస్ ఎప్పటిలాగే ప్రయాణికులతో బయలుదేరింది. అయితే, రన్నింగ్‌లో ఉండగా ఒక్కసారిగా ఇంజన్ నుండి బోగిలు విడిపోయాయి. ఇంజన్ లేకుండా రైలు పరుగులు పెడుతున్నప్పటికీ ఈ విషయాన్ని ఎవరూ గుర్తించలేదు. అలా, అర్చన ఎక్స్‌ప్రెస్ ఏకంగా మూడు కిలోమీటర్ల దూరం ఇంజన్ లేకుండానే ముందుకుసాగింది. చివరకు రైలును నిలిపివేయడంతో ప్రయాణికులంతా ఊపిరీ పీల్చుకున్నారు. ఈ సమయంలో ఏ మాత్రం అలసత్వం వహించినా పెనుప్రమాదం సంభవించేది. తమకు ఈ భూమ్మీద ఇంకా నూకలు ఉన్నాయని ప్రయాణికులు భావిస్తున్నారు.

అప్రమత్తమైన కీమాన్..
మే5న పంజాబ్ రాష్ట్రంలో జరిగిన ఈ ఘటనపై రైల్వే శాఖ వివరణ ఇస్తూ.. ఇంజిన్ లేని కోచ్‌లను గుర్తించిన కీమాన్ వెంటనే అలారం మోగించినట్లు వెల్లడించింది. వెంటనే అప్రమత్తమైన తమ సిబ్బంది బోగిలు లేకుండా వెళ్తున్న ఇంజన్ లోకోపైలట్‌కు సమాచారం అందించి నిలిపివేసినట్లు తెలిపింది. ఆ తర్వాత బోగీలను ఇంజన్‌కు లింక్ చేసి రైలును యథావిథిగా పంపినట్లు ప్రకటించారు. ప్రస్తుతం ఈ షాకింగ్ వీడియో కాస్త వైరల్ కావడంతో నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన కామెంట్ల రూపంలో వస్తోంది.












Click it and Unblock the Notifications