స్వతంత్ర్య భారతదేశంలో ఉరి తీయబడుతున్న మొట్టమొదటి మహిళ .. ఆమె భయంకర నేర చరిత్ర ఇదే !!
స్వతంత్ర్య భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా మధురలో ఒక మహిళా ఖైదీకి ఉరిశిక్ష అమలు చేయబోతున్నారు. స్వాతంత్రం వచ్చిన తరువాత ఒక మహిళా ఖైదీని ఉరి తీయడం ఇదే తొలిసారి. మీడియా నివేదికల ప్రకారం, సంచలనాత్మక అమ్రోహా హత్య కేసులో ఇద్దరు దోషులలో ఒకరైన షబ్నమ్ ను ఉరి తీయడానికి కావలసిన ఏర్పాట్లను మధుర జైల్లో చేస్తున్నారు. స్వతంత్ర భారతదేశంలో ఉరి తీయబడుతున్న మొదటి మహిళ ఈమె కావడంతో , ఈమె చేసిన నేరంపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఉరి తీయడానికి ఏర్పాట్లు జరుగుతున్నా, ఆమెను ఉరి తీసే తేదీ మాత్రం ఇంకా ఖరారు కాలేదు.

ఇంతకీ చనిపోయేంతవరకు ఉరితీసేలా కోర్టు శిక్ష విధించిన ఆమె చేసిన దారుణం ఏమిటంటే
కటుంబ సభ్యులను అత్యంత దారుణంగా నరికి చంపిన షబ్నమ్ అనే కసాయి మహిళ 2008వ సంవత్సరం ఏప్రిల్ నెలలో తన కుటుంబానికి చెందిన ఎనిమిది మందిని గొడ్డలితో నరికి చంపింది షబ్నమ్. సలీం అనే వ్యక్తితో వివాహేతర సంబంధం కలిగి ఉన్న షబ్నమ్ కుటుంబ సభ్యులను హతమార్చడం మాత్రమే కాకుండా తన ఇంటిపై గుర్తు తెలియని దుండగులు దాడి చేసినట్లు ఆ మహిళ మొదట నటించింది. దర్యాప్తులో ఆమె వివాహేతర సంబంధం కోసం నేరానికి పాల్పడిందని, ఆమె కుటుంబ సభ్యులను చంపడానికి ముందు వారందరికీ మత్తు మందు కలిపిన పాలను తాగడానికి ఇచ్చిందని పోలీసులు విచారణలో తేల్చారు.

మరణ శిక్ష విధించిన సెషన్స్ కోర్టు, సమర్ధించిన హైకోర్టు, సుప్రీం కోర్టు
కనీసం చిన్న పిల్లలు అని కూడా చూడకుండా దారుణంగా గొడ్డలితో నరికి చంపిందని గుర్తించారు. షబ్నమ్ ఎనిమిది మందిని హతమార్చేందుకు సలీం సహాయం చేశాడని పోలీసులు తేల్చారు.
సెషన్స్ కోర్టు వీరిద్దరికి మరణశిక్ష విధించింది. 2010 లో, వారు అలహాబాద్ హైకోర్టులో సెషన్స్ కోర్టు తీర్పును సవాలు చేశారు. అయితే వీరి మరణశిక్షను హైకోర్టు సమర్థించింది. ఆ తర్వాత షబ్నమ్ మరియు సలీం సుప్రీంకోర్టును ఆశ్రయించారు, కాని 2015 లో ఉన్నత న్యాయస్థానం మరణశిక్షను సమర్థించింది.

క్షమాభిక్షకు రాష్ట్రపతి నో .. మధుర జైల్లో ఉరిశిక్ష అమలుకు ఏర్పాట్లు
చివరి అవకాశంగా రాష్ట్రపతి క్షమాభిక్ష పెట్టాలని విజ్ఞప్తి చేసినా రాష్ట్రపతి సైతం తిరస్కరించారు . అన్ని దారులు మూసుకు పోవడంతో వీరిని ఉరి తీయడానికి రంగం సిద్ధమైంది. దీంతో షబ్నమ్ కు మధుర జైల్లో మరణశిక్ష అమలు చేయడానికి ఉరి వేసే గదిని సిద్దం చేస్తున్నారు. దేశానికి స్వాతంత్రం వచ్చిన తరువాత ఉరిశిక్ష అమలు అయ్యే మొదటి మహిళ ఈమె కావడం గమనార్హం. నిర్భయ కేసులో దోషులకు ఉరిశిక్ష అమలు చేసిన మీరట్ కు చెందిన పవన్ జల్లాద్ ఈమెకు కూడా ఉరిశిక్ష అమలు చేయబోతున్నారు .

మధుర జైలులో 150 ఏళ్ల చరిత్రలో ఒక్క ఉరి లేదు .. ఇప్పుడు షబ్నమ్ ఉరి
ఇప్పటికే ఉరివేసే గదిని రెండుసార్లు పరిశీలించారు.షబ్నమ్ ను ఉరి తీస్తున్న మధుర జైలుకు 150 ఏళ్ల చరిత్ర ఉంది. మన దేశంలో మహిళలు ఉరి తీయడానికి మధుర జైల్లో ప్రత్యేక గదిని ఏర్పాటు చేశారు. 150 సంవత్సరాలుగా ఆ గదిలో ఇప్పటివరకు ఎవరికి ఉరిశిక్ష అమలు కాలేదు. బ్రిటిష్ పాలనలో 1870లో మధుర జైలులో ఈ గదిని నిర్మించినా, అప్పటి నుండి ఇప్పటి వరకు దాని అవసరమే రాలేదు. ఇప్పుడు షబ్నమ్ ను ఉరి తీయడానికి ఏర్పాట్లు చేస్తున్న క్రమంలో ఈ గది వినియోగంలోకి రానున్నట్లుగా తెలుస్తుంది.

ఉరి ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పిన జైలు సూపరింటెండెంట్
ఇక ఉరిశిక్ష అమలు తేదీ తెలియకపోయినప్పటికీ, ఉరి ఏర్పాట్లలో తమ నిమగ్నమయ్యామని జైలు సూపరింటెండెంట్ శైలేంద్ర కుమార్ మైత్రేయ చెబుతున్నారు. ఉరి వేయడానికి కావాల్సిన తాడును బక్సార్ నుంచి తెప్పించారు. ఉరిశిక్ష అమలు చేసే గదిలో చిన్న చిన్న మార్పులు సూచించారు పవన్ జల్లాద్ .
వాటిని రెండు రోజుల్లో సిద్ధం చేస్తామని చెప్పారు జైలు అధికారులు .












Click it and Unblock the Notifications