మోదీకి సవాల్ చేసిన సీఎం, అయోధ్య కేసులో ఏం జరుగుతోంది ?, 31 ఏళ్ల క్రితం కేసులో !
రామజన్మభూమి పోరాటం కేసు 31 ఏళ్ల తర్వాత మళ్లీ రీ ఓపెన్ కావడంతో రామజన్మభూమి కోసం పోరాటం చేసిన వారిలో ఇప్పుడు అరెస్ట్ భయం మొదలైంది. మూడు దశాబ్దాల క్రితం రామజన్మభూమి పోరాటంలో హిందూ కార్యకర్తలు పాల్గొన్నారు. ఆ కేసులోని నిందితుల కోసం కర్ణాటకలోని హుబ్బళి పోలీసులు ఆకస్మికంగా వేట ప్రారంభించారు.
కర్ణాటకరాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటున్న ఇలాంటి చర్యను బీజేపీ నాయకులు వ్యతిరేకించారు కర్ణాటక మాజీ మంత్రి, బళ్లారికి చెందిన బి. శ్రీరాములు మాట్లాడుతూ కర్ణాటక రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం విద్వేష రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. బెంగళూరులోని మల్లేశ్వరంలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మాజీ మంత్రి బళ్లారి శ్రీరాములు విలేకరులతో మాట్లాడుతూ సిద్దరామయ్య ప్రభుత్వం తీరుపై విరుచుకుపడ్డారు.

దేశంలోని కోట్లాది మంది ప్రజలు రామమందిరాన్ని నిర్మించాలనే ఆకాంక్షను ప్రధాని నరేంద్ర మోదీ నెరవేర్చారని బళ్లారి శ్రీరాములు అన్నారు. ఒకవైపు రామమందిర ప్రారంభోత్సవానికి తేదీ ఖరారైందని,. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం దాదాపు 31 ఏళ్ల క్రితం ఎత్తివేసిన కేసులను ఇప్పుడు రీఓపెన్ చేసి హిందువులను అరెస్టు చేస్తోందని శ్రీరాములు మండిపడ్డారు. ఇది హిందూ వ్యతిరేక ప్రభుత్వమని శ్రీరాములు ఆరోపించారు.
అయోధ్యలో శ్రీరామచంద్రుడు మహర్షి వాల్మీకి కల్పిత ఆలయమని కాంగ్రెస్ నాయకులు అంటున్నారని, శ్రీరామచంద్రుడు కల్పితమైతే వాల్మీకి మహర్షి గురించి మాట్లాడే అర్హత మీకు ఏముందని, అయోధ్య ఎయిర్‌పోర్టుకు మహర్షి వాల్మీకి ఎయిర్‌పోర్టుగా నరేంద్ర మోదీ నామకరణం చేశారని మాజీ మంత్రి శ్రీరాములు గుర్తు చేశారు. దేశంలోని 125 కోట్ల మంది ప్రజలు శ్రీరామ మందిర నిర్మాణాన్ని పురస్కరించుకుని సంబరాలు చేసుకుంటున్నారని శ్రీరాములు అన్నారు
ఇలాంటి పరిస్థితుల్లో కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం విద్వేష రాజకీయాలు చేస్తోందని, మేము దానిని తీవ్రంగా ఖండిస్తున్నామని, దీనిపై పెద్దఎత్తున పోరాటం చేస్తామని బీజేపీ సీనియర్ నాయకుడు సిద్దరామయ్య ప్రభుత్వాన్ని హెచ్చరించారు, విద్వేష రాజకీయాలు, ప్రతీకార రాజకీయాలతో కాంగ్రెస్ అంతం ప్రారంభమైందని కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి శ్రీరాములు విరుచుకుపడ్డారు.
రామజన్మభూమి కోసం పోరాటం చేసిన 31 ఏళ్ల క్రితం నమోదు అయిన కేసులో ఇప్పుడు ఓ నిందితుడిని కర్ణాటక పోలీసులు అరెస్ట్ చేశారు. మిగతా నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఈ కేసులో 3వ నిందితుడు శ్రీకాంత్ పూజారిని గత శుక్రవారం కర్ణాటక పోలీసులు అరెస్టు చేసి జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. కేసు నమోదు అయిన సమయంలో ఆ కేసులోని నిందితులు 30 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్సు గల యువకులు.

ఇప్పుడు వారందరికీ 65-70 ఏళ్లు ఉంటాయి. రాజు ధర్మదాస్, శ్రీకాంత్ పూజారి, అశోక్ కలబురగి, షణ్ముఖ్ కటగర, గురునాథ కటిగార, రామచంద్ర కలబురగి, అమృత కలబురగి కోసం పోలీసులు గాలిస్తున్నారు. కరసేవకు ముందు అంటే 1992 డిసెంబర్ 5వ తేదీన హుబ్బళి నగరంలో అల్లర్లు జరిగి ఓ దుకాణానికి నిప్పు పెట్టారు. ఈ కేసుకు సంబంధించి హుబ్బళిలోని షహర్ పోలీస్ స్టేషన్‌లో 31 ఏళ్ల క్రితం 9 మందిపై ఎఫ్‌ఐఆర్ నమోదైంది. ప్రస్తుతం ఈ పాత కేసును రీ ఓపెన్ చెయ్యాలని హుబ్బళి పోలీసులు నిర్ణయించడం హాట్ టాపిక్ అయ్యింది.












Click it and Unblock the Notifications