యోగీ ఆదిత్యనాథ్ తో కేరళ స్టోరీ యూనిట్ భేటీ-పన్ను మినహాయింపుపై కృతజ్ఞతలు..
కేరళ నుంచి మతం మార్చుకుని వెళ్లిపోయి ఐసిస్ లో చేరిన యువతుల గాథతో తెరకెక్కిన ది కేరళ స్టోరీ ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. ఈ నేపథ్యంలో పలు బీజేపీ రాష్ట్రాలు ఆ సినిమాను తమ రాష్ట్రాల్లో ప్రోత్సహిస్తున్నాయి. యూపీతో పాటు పలు రాష్ట్రాలు ఇదే క్రమంలో కేరళ స్టోరీకి వినోద పన్ను మినహాయింపు కుడా ఇచ్చేశాయి. ఈ నేపథ్యంలో కేరళ స్టోరీ చిత్ర యూనిట్ ఇవాళ యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ తో భేటీ అయింది.
కేరళ స్టోరీ చిత్ర నిర్మాత విపుల్ అమృత్ లాల్ షా, దర్శకుడు సుదీప్తో సేన్, అదా శర్మ, ఇతర నటీనటులు కూడా యోగీ ఆదిత్యనాథ్ ను ఇవాళ కలిసిన వారిలో ఉన్నారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ కు యోగీ ఆదిత్యనాథ్ అభినందనలు తెలిపారు. ఇప్పటికే ఈ చిత్రానికి యోగీ సర్కార్ వినోదపన్ను మినహాయింపు ఇస్తూ నిర్ణయం తీసుకుంది. దీనిపై చిత్ర యూనిట్ సీఎంకు ధన్యవాదాలు తెలిపింది. యూపీ ప్రజలకు ఈ చిత్రం చూసేందుకు అవకాశమిచ్చిన యోగీకి దర్శకుడు సుదీప్తో సేన్ కృతజ్ఞతలు తెలిపారు.

తమ చిత్రానికి వినోద పన్ను మినహాయిస్తూ యూపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తమ మానసిక స్ధైర్యం మరింత పెంచిందని కేరళ స్టోరీ చిత్ర నిర్మాత విపుల్ షా తెలిపారు. తమ చిత్రం చూడాల్సిందిగా ప్రేక్షకులకు సీఎం యోగీ ఆదిత్యనాథ్ బలమైన సందేశం పంపారని ఆయన అభిప్రాయపడ్డారు. ఇందుకు సీఎంకు ప్రత్యేక ధన్యవాదాలు చెపుతున్నామన్నారు. ఈ సందర్భంగా ఈ చిత్ర నిర్మాణంలో తమ అనుభవాల్ని వారు సీఎంతో పంచుకున్నారు.
మరోవైపు సీఎం యోగీ ఆదిత్యనాథ్ తో పాటు ఆయన కేబినెట్ మంత్రులందరూ కలిసి రేపు లోక్ భవన్ లో కేరళ స్టోరీ చిత్రాన్ని వీక్షించబోతున్నారు. ఇప్పటికే మధ్యప్రదేశ్ ప్రభుత్వం కూడా ఈ చిత్రానికి వినోదపన్ను మినహాయిస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రధాని మోడీ సైతం కర్నాటక ఎన్నికల ప్రచారం సందర్భంగా కేరళ స్టోరీ చిత్రాన్ని ప్రస్తావించారు.












Click it and Unblock the Notifications