రూ. 1,000 కోట్లు ఇస్తాం: మాకు కులంతో పని లేదు
అహ్మదాబాద్: గుజరాత్ లో పటేల్ వర్గీయులు చేస్తున్న పోరాటానికి తాత్కలికంగా చెక్ పెట్టడానికి అక్కడి ప్రభుత్వం ఓ కొత్త పథకాన్ని ప్రకటించింది. కులాలకు సంబంధం లేకుండా ప్రతిభావంతులైన విద్యార్థుల కోసం రూ. వెయ్యి కోట్లతో కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది.
కేవలం మంచి మార్కులు ఉండే విద్యార్థులంతా ఈ పథకానికి అర్హులవుతారని, తల్లిదండ్రుల ఆదాయం తక్కువగా ఉంటే సరిపోతుందని గుజరాత్ ప్రభుత్వం ప్రకటించింది. దీంతో హార్దిక్ పటేల్ ఉద్యమం కాస్త చల్లారుతుందని వారు భావిస్తున్నారు.
తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ. 4.5 లక్షల కంటే తక్కువ ఉండే తెలివైన, చురుకైన విద్యార్థులు అందరూ ఈ పథకానికి అర్హులు. ఏడాదికి గరిష్టంగా రూ. రెండు లక్షల వంతున చెల్లించే ఏ కోర్సులో చేరినా అందులో 50 శాతం ప్రభుత్వం చెల్లిస్తుంది.

ఈ పథకం ఇంజనీరింగ్, మెడిసిన్ కోర్సులకూ వర్తిస్తుందని గుజరాత్ ప్రభుత్వ అధికార ప్రతినిధి నితిన్ పటేల్ అన్నారు. స్కాలర్ షిప్పులు, యూనిఫారం, ఉచిత పాఠ్య పుస్తకాలు, హాస్టల్ సదుపాయాలు, ప్రోఫెషనల్ కాలేజీలలో అదనపు సీట్లకు ఈ నిధులు ఖర్చుపెడుతారని చెప్పారు.
అదే విదంగా ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అందరికీ కులాలతో సంబంధం లేకుండా ఐదేళ్ల వయోపరిమితి సడలిస్తున్నామని ప్రభుత్వం ప్రకటించింది. అయితే గతంలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు ఇచ్చే పథకానికి ఇది కొనసాగింపు మాత్రమేనని ఇందులో ప్రత్యేకత లేదని హార్దిక్ పటేల్ వర్గీయులు విమర్శించారు.












Click it and Unblock the Notifications