చైనా కరోనా కల్లోలానికి కారణం.. ఒకటికాదు నాలుగు కొత్త వేరియంట్లు!!
కరోనాకు పుట్టినిల్లు అయిన చైనా ఇప్పుడు కరోనా మహమ్మారి చేతిలో చిక్కుకొని విలవిలలాడుతోంది. చైనాలో కరోనా మరణమృదంగం మోగుతోంది. ప్రతిరోజు లక్షల్లో కరోనా కేసులు నమోదవుతున్న తీరు ఆందోళన కలిగిస్తుంది. రోజుకు 10 లక్షల మంది కరోనా బారిన పడుతున్నారు అంటే పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు . అయితే డ్రాగన్ కంట్రీ చైనాలో కరోనా కల్లోలానికి ఓమిక్రాన్ బి ఎఫ్ 7 ఒకటి మాత్రమే కాదు మొత్తం నాలుగు వేరియంట్లు కారణమని భారత్ కోవిడ్ ప్యానల్ చీఫ్ ఎన్ కె ఆరోడా వెల్లడించారు.

చైనాలో కరోనా విలయానికి కారణం ఇదే
చైనాలో విజృంభిస్తున్న కొత్త వేరియంట్ ఓమిక్రాన్ బీఎఫ్ 7 విషయంలో దేశ వ్యాప్తంగా ఆందోళన కొనసాగుతున్న సమయంలో కరోనా కొత్త వేరియంట్ బీఎఫ్ 7 ఆందోళన అవసరం లేదని చెప్పారు. చైనాలో కరోనా విజృంభణ పై సరైన సమాచారం లేని కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉంటూ ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. డ్రాగన్ కంట్రీ లో మహమ్మారి విలయం సృష్టించడానికి కరోనా కొత్త వేరియంట్ ల కాక్టైల్ కారణమని స్పష్టంగా తెలుస్తోందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.

చైనాలో పంజా విసురుతున్న నాలుగు కొత్త వేరియంట్లు
చైనాలో ఓమిక్రాన్ బి ఎఫ్ 7 వేరియంట్ కేసులు 15 శాతమే ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. చైనాలో అత్యధికంగా నమోదవుతున్న కేసులలో 50 శాతం కేసులు బీఎన్, బీక్యూ వేరియంట్ ద్వారా వ్యాపిస్తున్నాయని ఎన్ కే ఆరోరా పేర్కొన్నారు. అదేవిధంగా ఎస్ వి వి వేరియంట్ వల్ల మరో 15 శాతం కరోనా కేసులు నమోదు అవుతున్నాయని ఆయన పేర్కొన్నారు. దీనివల్ల రోగులలో భిన్నమైన లక్షణాలు కనిపిస్తున్నాయని ఆయన తెలిపారు. నాలుగు వేరియంట్లు ఒకే సారి చైనాలో మూకుమ్మడి దాడి చేస్తున్నట్టు పేర్కొన్నారు.

చైనా కరోనాను చూసి భారత్ ప్రజలు భయపడాల్సిన అవసరం లేదు .. ఎందుకంటే
అయితే చైనాలో వ్యాపిస్తున్న కరోనా ను దృష్టిలో పెట్టుకొని భారతదేశంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్న ఆయన మాస్కులు ధరించి, తగిన జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది అన్నారు. కరోనా మొదటి, రెండవ, మూడవ వేవ్ లలో కోవిడ్ ను తట్టుకుని, వ్యాక్సిన్ లను తీసుకున్న భారతీయులకు హెర్డ్ ఇమ్యూనిటీ లభించిందని, కాబట్టి దేశ ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. మన దేశంతో పోలిస్తే చైనాలో వ్యాక్సిన్ ల ప్రభావం చాలా తక్కువగా ఉండటం వల్ల చైనీయులు నాలుగు డోసుల వ్యాక్సిన్లు తీసుకున్నప్పటికీ వారు సురక్షితంగా లేరన్నారు. కానీ భారతదేశంలో వ్యాక్సినేషన్ ప్రభావం ఎక్కువగా ఉందని, ప్రజలలో వ్యాధినిరోధక శక్తి ఎక్కువగా ఉన్న కారణంగా, కరోనా ను సమర్ధవంతంగా ఎదుర్కొనగలరని అందుకే ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.












Click it and Unblock the Notifications