ఫ్యామిలీ "షో" - గెలుపెవరిది..!!
జార్ఖండ్ ఎన్నికలు ఆసక్తి కరంగా మారుతున్నాయి. రెండు కూటముల మధ్య పోరు హోరా హోరీగా మారుతోంది. ఇప్పటికే రెండు కూటములు మేనిఫెస్టోలో పోటీ పడి హామీలు ఇచ్చాయి. ఎన్నికల ప్రచారం తారా స్థాయికి చేరుతోంది. ఇదే సమయంలో ప్రధాన పార్టీల్లో ఫ్యామిలీ షో కొనసాగుతోంది. ఒకే కుటుంబానికి చెందిన సభ్యులు వేర్వేరు పార్టీల్లో పోటీ చేస్తున్నారు. వీరిలో గెలుపు దక్కేదెవరికి అనేది ఆసక్తి కరంగా మారుతోంది. సోరెన్ కుటుంబ సభ్యులు సైతం పోటీలో ఉండటంతో మరింత ఉత్కంఠ పెంచుతోంది.
రసవత్తర పోరు
జార్ఖండ్ ఎన్నికల్లో పోటీ రసవత్తరంగా మారుతోంది. ఒకే కుటుంబానికి చెందిన సభ్యులు ఒకరి పైన మరొకరు పోటీ పడుతున్నారు. తుండీలో జేఎంఎం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే మధుర ప్రసాద్ మహతో పోటీలో నిలిచారు. అక్కడ బీజేపీ అభ్యర్దిగా వికాస్ కుమార్ మహత పోటీలో ఉన్నారు. అదే నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్దిగా పోటీలో ఆయన కుమారుడు దినేశ్ మహతో ఉండటం ఇక్కడ పోటీ ఆసక్తి కరంగా మారుతోంది. ఝారియాలో తండ్రీకుమారులు ఎన్నికల బరిలో పోటీలో ఉండటం తో గెలుపు ఎవరిని వరిస్తుందనేది కీలక చర్చగా మారింది. ఇక్కడ జేకేఎల్ఎం నుంచి అహ్మద్ రుస్తాం అన్సారీ పోటీ చేస్తుండగా.. ఆయన కుమారుడు బంటీ ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్నారు.

కుటుంబ సభ్యులే
జారియాలో ఇద్దరు కజిన్స్ పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ నుంచి సిటింగ్ ఎమ్మెల్యే పూర్ణిమ నీరజ్ సింగ్, ఆమె ప్రత్యర్థిగా బీజేపీ నుంచి రాగిణి సింగ్ పోటీలో ఉన్నారు. పూర్ణిమ భర్త నీరజ్ సింగ్ 2017లో హత్యకు గురయ్యారు. ఈ కేసులో అతడి కజిన్, రాగిణి భర్త సంజీవ్ సింగ్ జైలుకు వెళ్లి వచ్చారు.గోమియాలో చిత్తరంజన్ సావో, ఆయన భార్య సునీతా దేవి స్వతంత్రులుగా నామినేషన్లు దాఖలు చేసారు. ఇదే విధంగా పలు నియోజకవర్గాల్లో మారులు, కోడళ్లు రంగంలోకి దిగడం ద్వారా ప్రచారంలోనూ ఆసక్తిని పెంచుతోంది. ఇక, జేఎంఎం వ్యవస్థాపకుడు శిబు సోరెన్ ఇద్దరు కోడళ్లు సీతా సోరెన్, కల్పనా సోరెన్ జంతారా, గాండేయ్ నుంచి పోటీ చేస్తున్నారు. అయితే, వీరిలో కల్పన జేఎంఎం నుంచి, సీతా బీజేపీ నుంచి పోటీలో నిలిచారు.
హోరా హోరీ
మాజీ ముఖ్యమంత్రి రఘుబర్ దాస్ 5 సార్లు ప్రాతినిధ్యం వహించిన జెంషెడ్‌పుర్ తూర్పు నుంచి ఈసారి ఆయన కోడలు పూర్ణిమ దాస్ సాహు బరిలోకి దిగారు. ఆమెతో జెంషెడ్‌పుర్ మాజీ ఎస్పీ అజోయ్ కుమార్ తలపడుతున్నారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన దివంగత నిర్మల్ మహతో కోడలు సవిత మహతో జేఎంఎం తరఫున ఐకాగఢ్ నుంచి పోటీ చేస్తున్నారు. ఈ రకమైన పోటీలతో కుటుంబాల బలం ఆ నియోజకవర్గం పైన ప్రభావం ఉంది. ఈ సమయంలో ఒకే కుటుంబానికి చెందిన సభ్యులు ప్రత్యర్థులుగా బరిలోకి దిగటం ద్వారా నియోజకవర్గాల్లోని ప్రజలు ఎవరికి మద్దతుగా నిలుస్తారనే ఫలితాల్లోననే స్పష్టత రానుంది.












Click it and Unblock the Notifications